
స్వీట్ అంటే నోరూరిపోతుంది కదూ! ముఖ్యంగా చిన్నారులకు స్వీట్ అంటే ఎంతో మక్కువ. శీతాకాలం ప్రవేశిస్తోంది. ఈ కాలంలో క్యారెట్స్ విరివిగా వస్తాయి. దీనితోపాటు గుమ్మడి, పాలు, పంచదారలతో
తయారుచేసే స్వీట్స్ గురించి ఈ వారం తెలుసుకుందాం.కలకండ్
కావల్సిన పదార్థాలు:
పాలు-లీటరు; తాజా పన్నీరు - కేజీ; పంచదార - కప్పు; బాదం, పిస్తా - గుప్పెడు (చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి); యాలకుల పొడి- టేబుల్ స్పూన్; వెన్న -కొద్దిగా.
తయారుచేసే విధానం:
ముందుగా అడుగు మందంగా ఉన్న పాన్ తీసుకొని అందులో పాలు పోసి స్టౌ మీద పెట్టాలి. పాలని చిక్కబడే వరకూ కాయాలి. అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పాలు చిక్కబడుతున్నప్పుడే పన్నీరుముక్కల్ని చిదిమి వేయాలి. తర్వాత అందులోనే పంచదార, యాలకుల పొడి వేయాలి. ఈ మిశ్రమం దగ్గరపడే వరకూ బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని దగ్గరపడ్డాక ఒక ప్లేట్‌కు వెన్న బాగా రాసి అందులోకి తీసుకోవాలి. పైన బాదం, పిస్తా పలుకులతో అలంకరించుకోవాలి. అంతే టేస్టీ కలకండ్ రెడీ!
కేసర్ పేడా
కావల్సిన పదార్థాలు : పాలు-లీటరు; పంచదార -100 గ్రాములు; యాలకుల పొడి - టీస్పూన్; కుంకుమపువ్వు - కొద్దిగా; పిస్తా -8 (గార్నిష్ కోసం)
తయారుచేసే విధానం : ముందుగా ఒక మందపాటి గిన్నెలో పాలు పోసి స్టౌపై పెట్టి బాగా కాయాలి. పాలు చిక్కబడే వరకూ కలుపుతూ మరగనివ్వాలి. చిక్కపడ్డాక అందులో పంచదార వేసి కరిగే వరకూ బాగా కలపాలి. మంట మధ్యస్థంగా ఉంచి, పాలు చిక్కబడే వరకూ తిప్పుతూ ఉండాలి. తర్వాత కుంకమ పువ్వును స్పూన్ పాలల్లో కలిపి పోయాలి. ఇప్పుడు పాలు లేత పసుపు రంగులోకి మారతాయి. బాగా చిక్కపడ్డాక స్టౌ మీద నుంచి దింపి, చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారితే ఉండలు చేయడం కష్టమవుతుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకొని, రెండు అరచేతుల మధ్య ఉంచి బిస్కెట్‌లా వత్తాలి. తర్వాత వీటిపై పిస్తాపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే కేసర పేడా రెడీ.
రవ్వ కేసరి
కావలసిన పదార్థాలు : బొంబాయి రవ్వ-100 గ్రాములు; చక్కెర - 100 గ్రాములు (తీపి ఎక్కువ కావాలంటే మరో 50 గ్రాములు వేసుకోవచ్చు); యాలకుల పొడి- పావు టీస్పూన్; నెయ్యి -3 టేబుల్ స్పూన్స్, మిఠాయి రంగు: చిటికెడు; జీడిపప్పు, బాదాం, కిస్మిస్: 10చొప్పున; నీళ్లు: సరిపడా.
తయారుచేసేవిధానం : వెడల్పాటి అడుగు మందమున్న గిన్నెను స్టౌపై ఉంచి చెంచా నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కాక జీడిపప్పు, బాదాం, కిస్మిస్ దోరగా వేయించి పక్కన పెట్టు కోవాలి. అదే గిన్నెలో బొంబాయిరవ్వ వేసి కమ్మటి వాసన వచ్చేవరకూ వేయించాలి. వేయించిన రవ్వను కూడా విడిగా తీసిపెట్టాలి. ఇప్పుడు గిన్నెలో ఒకటికి మూడొం తుల నీళ్లు పోసి, మరగించాలి. హల్వా బాగా గట్టిగా కావాలంటే నీళ్లు ఒకటికి రెండే పోయవచ్చు. మరిగే నీళ్లల్లో పంచాదార, మిఠాయిరంగు వేసి కలపాలి. పంచదార కరిగాక, రవ్వను పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. బాగా దగ్గరపడ్డాక యాలకుల పొడి వేసి కలపాలి. చివరిలో మిగిలిన నెయ్యీ వేసి కలిపి, దించేయాలి. దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని, ముందుగా వేయించి పెట్టుకున్న జీడి పప్పు, బాదం, కిస్మిస్‌లతో గార్నిష్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన రవ్వకేసరి రెడీ.
క్యారెట్-గుమ్మడి హల్వా
కావల్సిన పదార్థాలు : తీపి గుమ్మడికాయ తురుము - కప్పు; క్యారెట్ తురుము - కప్పు; పంచదార-కప్పు; నెయ్యి - అరకప్పు; పాలు - అరకప్పు; యాలకుల పొడి- టీ స్పూన్; జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్ - 10 గ్రాములు చొప్పున.
తయారుచేసే విధానం : ముందుగా స్టౌ మీద పాన్ ఉంచి, అందులో రెండుస్పూన్ల నెయ్యి వేయాలి. అది వేడెక్కాక జీడిపప్పు, కిస్మిస్, బాదం, పిస్తాల్ని దోరగా వేపుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మరో స్పూన్ నెయ్యి వేయాలి. అది వేడెక్కాక గుమ్మడి, క్యారెట్ తురుముల్ని వేర్వేరుగా వేయించి, పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పాన్‌లో పాలు, పంచదార వేసి దగ్గరపడే వరకూ ఉడికించాలి. అందులో ముందుగా వేయించి పెట్టుకున్న గుమ్మడి, క్యారెట్ తురుముల్ని వేయాలి. ఆ తర్వాత మిగిలిన నెయ్యి వేసి గరిటెతో చిక్కపడే వరకూ తిప్పుతూ ఉండాలి. బాగా దగ్గరపడే ముందు యాలకుల పొడి కూడా వేసి కలపాలి. దగ్గరపడ్డాక స్టౌ మీద నుండి దించేసి ఒక ప్లేట్‌కి నెయ్యి రాసి అందులోకి ఈ పదార్థాన్ని తీసుకోవాలి. దీనిపైన ముందుగానే వేయించిన జీడిపప్పు, కిస్మిస్, బాదం, పిస్తాల్ని చల్లాలి. అంతే గుమ్మడి, క్యారెట్ హల్వా రెడీ. దీన్ని ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. లేదా బౌల్స్‌లోకి విడిగా వడ్డించీ ఇవ్వొచ్చు. దీనిలో ఐరన్, విటమిన్ సి, ఎ, కె లు పుష్కలంగా ఉండి, ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
No comments:
Post a Comment