పెరిగిన ఉల్లి ధరలు ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. అంతేగాక ఈ
ప్రభావం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఎటా పట్టణంలో కోడి గుడ్ల అమ్మకందారు
ప్రాణం మీదికి తెచ్చింది. ఎగ్ అమ్లెట్లలో ఉల్లిపాయలు వేయలేదని ఓ
అమ్మకందారుపై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ప్రమాదంలో అమ్మకందారు
తీవ్ర గాయాల పాలయ్యాడు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..అలీగంజ్ మార్కెట్ లో కోడి గుడ్ల
అమ్మకందారు కశ్యప్ శనివారం సాయంత్రం తన వినియోగదారులకు సేవలందిస్తూ బిజీగా
ఉన్నాడు. ఆ సమయంలోనే యోగేష్ అలియాస్ ఖురానా తన బంధువు పూజారి, అతని నలుగురు
స్నేహితులతో ఆ దుకాణానికి వచ్చారు. వారు ఎగ్ అమ్లెట్ ఆర్డర్ చేశారు.
ఎగ్ అమ్లెట్ చేయడం చూసిన వారు ఉల్లిపాయలు ఎందుకు వేయడం లేదని కశ్యప్‌ను
అడిగారు. గత కొన్ని వారాల నుంచి పెరిగిన ఉల్లి ధరల కారణంగా అమ్లెట్‌లో
ఉల్లిపాయలను వినియోగించడం లేదని కశ్యప్ చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన
పూజరి, అతని స్నేహితులు కశ్యప్‌పై దాడికి ప్రయత్నించారు. పక్కనే ఉన్న ఇతర
దుకాణాదారులు వివాదాన్ని పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేశారు. అయితే
వివాదంలో దుండగులు తుపాకీతో కాల్చడంతో కశ్యప్ నుదుటి భాగంలో తీవ్ర
గాయమైంది. వెంటనే అతన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం కశ్యప్‌కు ప్రాణాపాయం ఏమి లేదని అడిషనల్ సూపరింటెండెంట్ సంజయ్
కుమార్ యాదవ్ తెలిపారు. ఖురానా, పూజారి, తన నలుగురు స్నేహితులపై ఐపీసీ
సెక్షన్స్ 307(హత్యాయత్నం), 386(దోపిడీ) కింద కేసు నమోదు చేసినట్లు
పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం
గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు. అయితే కశ్యప్‌కు పూజారి
బావ మరిది అవుతాడని, పూజారి ఇంటికి కశ్యప్ తరచూ వెళ్లేవాడని పోలీసులు
తెలిపారు. ఇప్పటికే పూజారిపై పలు కేసులు ఉన్నట్లు ఆగ్రా జోన్ ఐజీ అషుతోష్
పాండే తెలిపారు.

No comments:
Post a Comment