Tuesday, May 26, 2015

అందరి ఆడపిల్లల్లానే ఆమె కూడా పెరిగింది

అందరి ఆడపిల్లల్లానే ఆమె కూడా పెరిగింది. ఇంటర్మీడియట్‌ అయ్యాక బిఎస్‌సి నర్సింగ్‌లో చేరింది. ఆ సందర్భంగా అక్కడి మహిళా వైద్యురాలి ద్వారా ఆమె తనలోని వైకల్యం తెలుసుకుంది. బిఎస్‌సి నర్సింగ్‌ అయిపోయాక మంచి ఆసుపత్రిలో ఉద్యోగం వచ్చింది. వృత్తిలో అంకితభావం ఆమెను ఉన్నతంగా తీర్చిదిద్దింది. అందరి ఆడపిల్లల్లా తనూ
పెళ్ళి చేసుకోవాలనీ, తనకూ ఓ కుటుంబం కావాలనీ కలలు కనేది. అది తనకున్న శారీరక లోపంతో సాకారం కాదని బాధపడేది. తల్లిదండ్రులు, తోబుట్టువులు ఆమె జీతం తప్ప జీవితం గురించి ఆలోచించలేదు. ఒకసారి పెద్దమ్మ కూతురుని కలిసినప్పుడు ఆమెతో తన బాధను పంచుకుంది. ఆమె సహకారంతో డాక్టర్‌ను సంప్రదించి, ఆపరేషన్‌ చేయించుకుంది. ఆత్మవిశ్వాసంతో ఆమె తన సమస్యను పరిష్కరించుకున్న తీరు ఈ వారం 'జరిగిన కథ'గా ఆమె మాటల్లోనే..
a''నా పేరు కరుణ. ఒక సాధారణ ఆడపిల్లగానే నా చిన్నతనం గడిచిపోయింది. నాకు ఒక అక్క, అన్నయ్య ఉన్నారు. నాన్నది ప్రయివేటు ఉద్యోగం. ఆర్థికంగా ఇంట్లో ఇబ్బందిగానే ఉండేది. ఇంటర్‌ అవగానే నేను నర్సింగ్‌లో చేరాను. అక్కకు పెళ్ళి చేశారు. ఆ అప్పు అలాగే ఉంది. నాన్న వడ్డీ మాత్రమే కడుతూ వచ్చాడు. నేను బిఎస్‌సి నర్సింగ్‌ చేసేప్పుడు అక్కడి మహిళా వైద్యురాలిని సంప్రదించినప్పుడు, నాలోని వైకల్యం తెలిసింది. నేను అందరు అమ్మాయిల్లా పెళ్లి చేసుకుని మాతృత్వం పొందలేనని అర్థమైంది. దాన్ని ఎలా అధిగమించాలో అవగాహన లేదు.
బిఎస్‌సి నర్సింగ్‌ పూర్తవగానే నాకు ఒక మంచి ఆసుపత్రిలో జాబ్‌ వచ్చింది. నా పనితనం, పనిపట్ల నాకున్న అంకితభావం, నేను వృత్తిలో ఉన్నత స్థానానికి ఎదిగేందుకు తోడ్పడ్డాయి. ఇంత వయసు వచ్చినా నేను మెచ్యూర్‌ కాలేదని, నన్ను డాక్టర్‌ దగ్గర చూపించాలన్న ధ్యాస అమ్మకు లేదు. వాళ్ళందరికీ నేను సంపాదించే జీతం గురించి తప్ప నా జీవితం గురించి అవసరం లేదు. అన్నయ్య కూడా పెళ్ళి చేసుకున్నాక అత్తగారింట్లోనే ఉండిపోయాడు. ఇంటికి చుట్టంలా ఎప్పుడైనా వస్తుండేవాడు. అమ్మానాన్న ఆరోగ్యం గురించి, అక్క పురుళ్ళూ, పుణ్యాలన్నింటినీ నేనే చూసుకునేదాన్ని.
ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం నాకూ అందరి ఆడపిల్లల్లా పెళ్ళి చేసుకోవాలని, నాకూ ఓ కుటుంబం కావాలని అనిపించి, బాధపడ్తుండేదాన్ని. నన్ను నేనే ఓదార్చుకునేదాన్ని. ఎందుకంటే ఈ విషయం నేను ఎవరితోనూ పంచుకోలేను కదా! నేనే ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నాను. నేనేం తక్కువ కాదని, ఈ వైకల్యం అలాంటి వాటికి ఆటంకం కాదని నన్ను నేనే గొప్పగా అనుకుని ఊరడిల్లేదాన్ని. ఇలా నాకు నేనే ఎన్నిసార్లు కౌన్సెలింగ్‌ చేసుకున్నానో లెక్కేలేదు.
ఒకసారి పనిమీద హైదరాబాద్‌ వెళ్లాను. ఆ సందర్భంగా అక్కడే ఉంటున్న మా పెద్దమ్మ కూతురు ప్రసన్న అక్క వాళ్లింటికి వెళ్లాను. ఆ రోజు రాత్రి అక్క 'ఏమే ఇలా ఎంతకాలం నీ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటావు. నువ్వు పెళ్ళి చేసుకోవా?' అని అడిగింది. 'అమ్మను అడగకపోయావా?' అని అన్నాను. 'అడిగాను. నువ్వే పెళ్ళి వద్దంటున్నావని చెప్పింది' అంది అక్క. 'అలా చెప్పిందా?' అని అంటూనే నాకు దు:ఖం ఆగక ఏడ్చేశాను. 'ఎందుకే ఏడుస్తావు? విషయం ఏమిటో చెప్పు. నాకు చేతనైన సాయం చేస్తాను' అంది. నా సమస్య ఏమిటో చెప్పాను. ఆరోజే అక్క తన స్నేహితురాలు అపూర్వకి ఫోన్‌ చేసి, మాట్లాడింది. తర్వాతిరోజే అందరం కలిసి గైనకాలజిస్టు దగ్గరకు వెళ్ళాం.
డాక్టర్‌ నన్ను పరీక్షించాక 'ఈ అమ్మాయికి వెజైనా లేదు. అయినా ఏం ఫర్వాలేదు. కృత్రిమంగా అమర్చవచ్చు. సంసార జీవితానికి ఏమీ ఇబ్బంది ఉండదు. కాకపోతే, పిల్లలు పుట్టడం ఒక్కటే సమస్య. ఈమెకు గర్భాశయం కూడా చాలా చిన్నగా ఉంది. పెళ్ళి చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకుంటానికి వస్తే, నా దగ్గరకు తీసుకొస్తే నేను వాళ్ళకు వివరిస్తాను' అని డాక్టర్‌ చెప్పారు. శస్త్రచికిత్సకు ఎంత ఖర్చవుతుందో వివరాలు తెలుసుకుని, 'నెలరోజుల్లో డబ్బులు సమకూర్చుకుని వస్తాను' అని డాక్టర్‌ దగ్గర నుండి వచ్చేశాం. నెలరోజుల తర్వాత నేను డబ్బులు తీసుకుని, అక్క దగ్గరకు వచ్చాను. అక్క, అక్క స్నేహితురాలు అపూర్వతో కలిసి డాక్టర్‌ దగ్గరకు వెళ్ళాం. డాక్టర్‌ గారు ఆపరేషన్‌ చేశారు. అయితే కొద్ది రోజులకే ఇన్ఫెక్షన్‌ అయింది. ఈలోపు డాక్టర్‌ గారి భర్త చనిపోవడంతో ఆమె వచ్చే స్థితిలో లేరు. ఆమెకు తెలిసిన వేరే డాక్టర్‌ వద్దకు వెళ్ళమంటే, వెళ్లాం. ఆ డాక్టర్‌ పరీక్ష చేసి, మరో చిన్న శస్త్ర చికిత్స అవసరమని చెప్పారు. అది కూడా చేయించుకున్నాను. ఆరు నెలల తర్వాత మళ్ళీ మొదట చూపించుకున్న డాక్టర్‌ దగ్గరకు వెళ్ళాను. 'అంతా బాగుంది కరుణా! నువ్వు ఇక నిరభ్యంతరంగా పెళ్ళి చేసుకోవచ్చు' అన్నారు. 
ఒకతను పెళ్ళి చేసుకుంటానని ముందుకొచ్చాడు. అయితే అతని తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దాంతో అతను వెనకడుగు వేశాడు. నేను నా వృత్తి చేసుకుంటూ అలాగే ఉండిపోయాను. ఈలోపు ప్రసన్న అక్క వాళ్ళే ఒక సంబంధం తీసుకొచ్చారు. అతనికి మొదట ఒక పాప, తర్వాత కవలల్ని కనే సమయంలో భార్య చనిపోయింది. బాగా ఆస్థిపరులు. కాకపోతే అతను బాగా నలుపు అని చెప్పారు. 
'అతనికి విషయం చెప్పండి. ఒప్పుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు. రంగు సమస్య కాదు, గుణం మంచిదైతే చాలు' అన్నాను. అక్కావాళ్ళు అతనితో మాట్లాడారు. అతను చాలా సంతోషంగా నన్ను పెళ్ళి చేసుకోవడానికి అంగీకరించారు. అతని పేరు అనిరుద్‌. అనిరుద్‌, నేను కలిసి డాక్టర్‌ దగ్గరకు వెళ్ళాం. డాక్టర్‌ గారు అనిరుద్‌తో మాట్లాడారు. ఆ తర్వాత నెలలోనే రిజిష్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నాం. పెళ్ళికి అమ్మానాన్న, అక్క, అన్నయ్య ఎవ్వరూ రాలేదు. వాళ్ళందరికీ నాకు పెళ్ళి అవడం ఇష్టం లేదు. నాకు చాలా బాధ కలిగింది. ప్రసన్న అక్క, మరో పిన్ని, పెద్దమ్మ పిల్లలంతా నాకు ఆరోజు తోడుగా నిలిచారు.
ఇప్పుడు నాకు ముగ్గురు పిల్లలు, మంచి భర్త. ఎంతో ఆనందంగా నా జీవితం సాగిపోతోంది. పిల్లలు పెద్దయ్యాక ఎంఎస్‌సి నర్సింగ్‌ చేసి, టీచింగ్‌ వైపు వెళ్దామనుకుంటున్నాను. అందులోనూ కవలపిల్లలు (బాబు, పాప) కాబట్టి, వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అనిరుద్‌ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. పిల్లలు కూడా నాకు బాగా మాలిమి అయ్యారు. 'అమ్మా! అమ్మా!' అంటూ పెద్దపాప కూడా నన్ను వదిలిపెట్టదు. 
ఈ మధ్యే అమ్మ, ప్రసన్న అక్కతో నా దగ్గరకు వస్తానని, తీసికెళ్ళమని అడిగిందంట. 'పెళ్ళికి కూడా రాలేని వాళ్ళు, ఇప్పుడు ఎందుకు వెళ్లడం, మీకైతే ఏ లోటూ లేకుండా నెలనెలా డబ్బులు పంపిస్తోంది కదా! మీరేమీ దాని జీవితంలోకి వెళ్లొద్దు!' అని గట్టిగా చెప్పింది ప్రసన్నక్క. వెంటనే అక్క నాకు ఫోన్‌ చేసి అమ్మ అడిగిన విషయం చెప్పింది. 'కరుణా! ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వాళ్ళ మీద జాలి పడి, రమ్మనకు. వాళ్ళు వట్టి డబ్బు మనుషులు. అనవసరంగా పచ్చని సంసారంలో డబ్బు కోసం చిచ్చు పెడతారు కూడా. వాళ్ళకి కావలసిన డబ్బును నెలనెలా నీ బాధ్యతగా నువ్వు ఇస్తున్నావు. అంతవరకు ఓకే. అందుకు ఒప్పుకున్న అనిరుద్‌ మంచితనాన్ని ఆసరాగా చేసుకుని, మీవాళ్లు నీ ఇంట్లో తిష్ట వేయాలనుకుంటున్నారు. అందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకు' అని పదే పదే చెప్పింది. నాకు కూడా అక్క చెప్పింది సరైందే అనిపించింది. 'అలాగే అక్కా! నువ్వు చెప్పినట్లే నడుచుకుంటాను. నువ్వు ఎంతో ఆలోచించి చెప్తావు' అని అన్నాను.
ఇప్పుడు మా బంధువులు అంతా నా కుటుంబాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అతనివైపు బంధువులు, అత్తయ్య, మామయ్య కూడా నన్ను వాళ్ళ అదృష్టంగా భావిస్తున్నారు. 'నాకూ ఓ కుటుంబం ఉంది' అని నేను ఎంతో సంతోషపడుతున్నాను. నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. నేను చాలా అదృష్టవంతురాలిని.
చివరగా నేను చెప్పేది ఒక్కటే, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అమ్మాయిల్ని వెంటనే డాక్టర్‌ దగ్గర చూపించి, తగిన చికిత్స చేయించండి. వాళ్ళకో భవిష్యత్తు ఇచ్చేందుకు ప్రయత్నించండి. !''

No comments:

Post a Comment