గర్భాధారణ సమయంలో కడుపులో పెరిగే బిడ్డ బరువు వెన్నెముకపై ప్రభావం చూపిస్తోంది. ఈ సమయంలో చాలా మంది మహిళలు వెన్ను సమస్యతో బాధపడతారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. ప్రసవం తరువాత కూడా వెన్ను సమస్యలు వెంటాడతాయి. వెన్నుసమస్యలు రాకుండా గర్భాధారణ సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు..
బరువులు ఎత్తకండి : ఎక్కువ బరువు ఉండే వస్తువులను ఎత్తవద్దు. బరువు ఉండే వస్తువులను ఎత్తవలసి వస్తే మీ కుటుంబ సభ్యుల సహాయం తీసుకోండి. తప్పనిసరి పరిస్థితుల్లో మీరే బరువు వస్తువులను ఎత్తవలసి వస్తే మీ కాళ్ళ ఆధారంగా ఎత్తండి కానీ మీ గర్భం పైన దాని ప్రభావం పడకుండా జాగ్రత్త పడకండి. మీ నడుము వంచటానికి బదులుగా మోకాళ్లను వంచి బరువు ఎత్తండి.
సరైన దుస్తులనే : గర్భంతో ఉన్న ఆడవారు బలహీనమైన కీళ్ళను కలిగి ఉండటం వలన త్వరగా ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంది. కావున కండరాలకు బాహ్య మద్దతు తప్పనిసరి. మీ ఉదర భాగానికి మద్దతుగా ఉండే దుస్తులను ధరించండి. ఇవి గర్భం పైన ఎలాంటి ఒత్తిడిని కలిగించకుండా సౌకర్యవంతంగా ఉంటాయి. అంతే కాకుండా మీ వెన్నెముక పైన ఒత్తిడిని పడకుండా సహాయపడతాయి.
విశ్రాంతి తప్పనిసరి : గర్భాధారణ సమయంలో వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందుటకు సరైన భంగిమలో పడుకోవటం చాలా ముఖ్యం. పడుకునే సమయంలో ఒక మోకాలిని వంచి పడుకోండి. మీ మోకాళ్ళ మధ్య దిండును ఉంచండ.ి రెండు కాళ్ళను సూటిగా చాపి పడుకోవద్దు. దీని వలన కండరాలు ఎక్కువ ఒత్తిడికి గురి అవుతాయి.
చిన్నచిన్న వ్యాయామాలు : గర్భాధారణ సమయంలో కీళ్ళు చాలా బలహీనంగా మారి, తక్కువ స్థిరత్వాన్ని కలిగి త్వరగా గాయాలకు గురవుతుంటాయి. ముఖ్యంగా వెన్నెముక ప్రాంతం బలహీనంగా ఉంటుంది. డాక్టర్ సలహా మేరకు రోజూ చిన్న చిన్న వ్యాయామాలను చేస్తే వెన్నెముక బలంగా మారి వెన్నునొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. డాక్టర్ అనుమతితో వాకింగ్, స్విమ్మింగ్, యోగా చేయవచ్చు.
హీల్స్‌కు దూరంగా : గర్భిణీలు ఎత్తుగా ఉండే చెప్పులను వాడ కూడదు. వీటి వలన వెన్నెముక, నడుము నొప్పి వస్తుంది.
నిటారుగా : మూడవ నెల నుంచే శిశువు పెరుగుదల ప్రారంభం అవుతుంది. శరీరబరువు పెరగడంతో నిటారుగా నిలబడడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువ సమయం నిలబడాల్సి వస్తే.. ఇతరుల సహాయం, ఏదైనా ఆసరా తీసుకోండి. కూర్చునే భంగిమలోనూ సరైన విధానం పాటించాలి. లేకపోతే.. నడుము నొప్పి, వెన్నునొప్పితో బాధపడాల్సి వస్తుంది. విశ్రాంతి తీసుకునే సమయంలోనూ.. నిద్రించే సమయంలోనూ సరైన భంగిమను అనుసరించాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. నడుము, వెెన్నెముక, కండాల నొప్పితో బాధపడాల్సి వస్తుంది.
వేడి లేదా చల్లటి మసాజ్ : ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొన్నిసార్లు నడుము, వెన్నెనొప్పితో బాధపడుతుంటారు. ఈ సమయంలో పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం బిడ్డ పెరుగుదలకు మంచిది కాదు. నొప్పి నుంచి ఉపశమనం కోసం వేడి, చల్లని నీటితో కాపడం పెట్టడం మంచిది.
డాక్టర్ సలహా :ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నా.. వెన్ను నొప్పి వస్తే.. డాక్టరును సంప్రదించాలి. ఎలాంటి మందులు వాడాలన్నా డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.
No comments:
Post a Comment