Wednesday, February 5, 2014

గర్భిణీ స్త్రీ ఉద్యోగస్తురాలైతే తీసుకోవల్సిన జాగ్రత్తలు

భార్యాభర్తల అనురాగానికి తీపిగుర్తులు పిల్లలు. స్త్రీ గర్భం దాల్చిన తర్వాత పుట్టింటివారు ఆమెను అపురూపంగా చూసుకుంటారు. సీమంతం చేసి తమ ముచ్చట తీర్చుకుంటారు. ముత్తయిదువులు పండంటి బిడ్డను కనమని
ఆ స్త్రీని దీవిస్తారు. వారి దీవెనలు ఫలించి ఆమె పండంటి బిడ్డకు జన్మనిస్తుంది. అయితే గర్భం దాల్చిన వెంటనే ఆ స్త్రీ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. పుట్టబోయే బిడ్డ ఎలాంటి డెఫిషియన్సీకి లోనుకాకుండా నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వారు నిర్దేశించిన సమయాలలో చికిత్సలు చేయించుకుంటూ ఉండాలి. తల్లి గర్భం సురక్షితమైనదే అయినప్పటికీ కడుపులో బిడ్డ ఉన్నప్పుడు అటువంటి స్త్రీలు చేయకూడని కొన్ని పనుల గురించి మన దేశంలో చాలామందికి పూర్తి అవగాహన లేదనే చెప్పాలి. గర్భం దాల్చిన తర్వాత వైద్యులు సూచించిన మందులు మాత్రమే వాడాల్సి ఉంటుంది. చీటికి మాటికీ ఇబ్బంది కలిగించే తలనొప్పి, ఇతర రుగ్మతలకు సొంత వైద్యం చేసుకోకూడదు. అలాగే తల్లీ బిడ్డలకు నలత కలిగించే ఆహారం తీసుకోకూడదు. గర్భిణీ వేళకు ఆహారం తీసుకోవాలి. అయితే నేడు నూటికి తొంభై మంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు కనుక ప్రెగ్నెన్సీ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే చాలా సమస్యలు మన దరికి చేరవని వైద్యులు తెలియజేస్తున్నారు. నిర్ణీత వేళల్లోనే మన పనులు ముగించుకుని కాస్త ముందుగానే ఆఫీసుకు బయలుదేరిపోవాలి. లేదంటే ఆలస్యంగా వచ్చే బస్సు కోసం టెన్షన్ పడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ టెన్షన్ అనేది గర్భిణులకు చేటుచేస్తుంది. దీనివల్ల బీపీ పెరగడం, రక్తంలో కొలెస్ట్రాల్ హెచ్చుతగ్గులు, అనవసరంగా చెమటలు పట్టేయడం వంటివి జరుగుతాయి. అదేవిధంగా ఆఫీసుల్లో మగవారితోపాటు స్త్రీలు కూడా పదే పదే ఒత్తిడిని తట్టుకోవడానికి టీ, కాఫీలు కాస్త ఎక్కువసార్లే తాగుతూ ఉంటారు. అలా చేయకూడదు. టీ, కాఫీల్లో ఉండే హానికారక పదార్థాలు గర్భస్త శిశువుకు హానికలిగిస్తాయి కనుక సాధ్యమైనంత వరకు టీ, కాఫీలు తగ్గించేయాలి. దానికంటే బాగా మరగబెట్టిన చల్లార్చిన పాలు శ్రేష్ఠం. అదేవిధంగా ఎక్కడపడితే అక్కడ నీళ్లు తాగకూడదు. అలాగే ప్యాకెట్లలో విక్రయించే నీటి వినియోగం కూడా మంచిది కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. కనుక ఇంట్లో బాగా మరిగించిన నీటినే చల్లార్చుకుని బాటిల్లో పోసుకుని ఆఫీసుకు వెళ్లాలి. గర్భంలో శిశువుకు ఇబ్బంది కలిగించేలా భీకర శబ్దాలు వినిపించే చోట్లలో ఎక్కువ సమయం గడపకూడదు. ఇటీవల జరిగిన కొన్ని పరిశోధనల్లో పెద్దవారు వినలేని అల్ట్రాసౌండ్ తరంగాలకు కూడా గర్భస్థ శిశువులు చక్కగా స్పందించగలరని, అయితే అవి వారికి చేటు చేస్తాయని తేలింది. అందుకే వైద్యులు పిండం మరీ ఎదగకముందు స్కానింగ్‌కు అనుమతించరు. భీకర శబ్దాలు గర్భస్థ శిశువులను ఉలిక్కిపడేలా చేస్తాయని, పదే పదే అటువంటి శబ్దాలు వింటూ ఉంటే వారు ఎంతో అనీజీనెస్‌కు గురికావడమే కాకుండా నలతల బారిన పడతారని వైద్యులు చెబుతున్నారు. కనుక గర్భిణీలు భీకర శబ్దాలు ఉత్పన్నమయ్యే చోట ఎక్కువసేపు ఉండకూడదు. అటు వెళ్ళకపోవడమే మేలు. అదే వీనుల విందైన సంగీతమైతే తల్లి గర్భంలో ఉండే శిశువులు పరవశిస్తారని, తరచూ అటువంటి సంగీతం తల్లి వింటూ ఉంటే ఆమె గర్భంలో ఉండే శిశువు చక్కటి ఆరోగ్యంతో పెరిగి పెద్దదవుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.


1 comment:

  1. చాలా మంచి విషయాలు తెలియజేశారు .. ఇవి ఎంతో మందికి ఉపయోగ కరమైనవి .

    ReplyDelete