Monday, February 3, 2014

పోల్‌ డ్యాన్స్‌ ... యోగ్యమైన వ్యాయామం...

నేటికాలంలో యోగా... డ్యాన్స్‌లు... వ్యాయామాలుగా ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు వాటి కోవలోకే పోల్‌డ్యాన్స్‌ కూడా చేరింది. పోల్‌ డ్యాన్స్‌ను ఒకప్పుడు కళాప్రదర్శనగా భావించేవారు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా
యోగ్యమైన వ్యాయామంగా భావిస్తున్నారు. నిలువుగా ఉన్న పోల్‌ను మధ్యలో ఉంచి దానిచుట్టూ నృత్యం చేయడమే పోల్‌డాన్స్‌. ఇప్పుడు ఎంతోమంది ఇష్టపడి నేర్చుకుంటున్న ఈ పోల్‌డ్యాన్స్‌ వినోదంతోపాటు మంచి వ్యాయామం కూడా. ఇప్పటికే జిమ్‌లలో, డ్యాన్స్‌ స్టూడియోలలో అందుబాటులో ఉన్న ఈ పోల్‌డ్యాన్స్‌ను నేడు ప్రపంచంలో ఎంతోమంది నేర్చుకోవడానికి ఉత్పాహాన్ని, ఆసక్తిని కనబరుస్తున్నారు. కొంతమంది వృత్తిగా ఎంచుకుంటున్నారు. మరిన్ని ప్రయోజనాలున్న ఈ పోల్‌డ్యాన్స్‌ను నేర్చుకోవాలనుకుంటున్నారా?... అయితే ఈ కింది సూచనలను అనుసరించి ప్రయత్నించండి.!
నృత్యమే వ్యాయామం...
నేడు వ్యాయామంగా మారిన పోల్‌డ్యాన్స్‌ 20వ శతాబ్ధంలోనే అభివృద్ధి చెందింది. మనం చిన్నప్పుడు రోడ్ల మీద గారడీలు చేసేవారిని చూసే ఉంటాం! వాళ్ళు ఒక కర్రను చేతులతో అడ్డంగా పట్టుకొని, తాడుపై నడుస్తుంటారు. అది పోల్‌డ్యాన్సే! అలాగే సర్కస్‌లలో కూడా చూసే ఉంటారు కదా! ఇది స్ట్రిప్‌ క్లబ్‌లలో కూడా ప్రజాదరణ పొందింది. ఇప్పటికీ కొందరు ఈ పోల్‌ విన్యాసాలను చేస్తూ పొట్టగడుపుకుంటున్నారు. అలాంటి పోల్‌ నృత్యాన్ని నేర్చుకోవడానికి ఓర్పు, సహనంతో పాటు శారీరక బలం, నమ్రత ఎంతో అవసరం. పోల్‌డ్యాన్స్‌ను నేర్చుకునేటప్పుడు ప్రాథమిక విషయాలైన పైకి ఎగబాకటం, వేగంగా తిరగడం, పటుత్వం, గిరగిర తిరగడం, ఊగులాడడం లాంటి విషయాలపై అవగాహన అవసరం. ఈ పోల్‌డ్యాన్స్‌ తరగతులలో వీటిపై అవగాహన కల్పించడంతో పాటు కొన్ని చిట్కాలనూ నేర్పిస్తారు. ఈ డ్యాన్స్‌లో ప్రతి కదలిక ఎంతో నైపుణ్యంతో కూడుకున్న ఫ్యాషన్‌. కదలికలకు మంచి సంగీతమూ తోడైతే నృత్యానికి నృత్యం... వ్యాయామానికి వ్యాయామం.
మాములుగా వ్యాయామాలు చేసేటప్పుడు నేలమీద కూర్చోవడం... పైకి ఎగబాకడం... చప్పుడు చేయడం... లాంటి ఎన్నో వ్యాయాయ భంగిమలను పోల్‌తో కూడా చేయవచ్చు. అలాగే ఇతర డ్యాన్స్‌లలో (సల్సా, బ్రేక్‌ డ్యాన్స్‌, హిప్‌ హాప్‌...) కూడా పోల్స్‌ను ఉపయోగిస్తుంటారు. అలా పోల్‌ ను ఉపయోగించి, నృత్యం చేయడం వలన తుంటి, నడుము, కాళ్ళు ఇలా ప్రతిభాగానికి చక్కని వ్యాయామం. అందుకే చక్కని ఆకృతీ సొంతమవుతుంది.
ప్రయోజనాలు
రోజువారీ వ్యాయమంలో పోల్‌డ్యాన్స్‌ను చేయడం వలన శరీర కదలికలలో మెరుగుదల వలన శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. ఈ డ్యాన్స్‌ వలన రోజుకి 250 కేలరీలు ఖర్చవుతాయంటే దీనివలన ప్రయోజనాలేంటో అర్థంచేసుకోవచ్చు. వీటితో పాటు కండరాల పటుత్వానికి, బరువు అదుపులో ఉంచుకోవడానికి, పొట్ట కండరాల బలానికి ఎంతో ప్రయోజనకారి. ఎగరడానికి, ఎగబాకడానికి, తిరగడానికి పోల్‌ ఆధారంగా ఉంటుంది. అది శరీరానికి కావలసిన ఆక్సిజన్‌ సరఫరాను ఉత్తేజపరుస్తుంది. ఇది గుండె సంబంధిత కండరాలకు ఎంతో ఉపయోగం. ఈ డ్యాన్స్‌ ద్వారా హృదయ స్పందనలు మెరుగవుతాయి. పోల్‌డ్యాన్స్‌లోని వివిధ భంగిమలు, కదలికల వలన శారీరక వ్యాయామంతో పాటు ఆత్మవిశ్వాసం పెంచుతుంది. దీనివలన సహజంగానే ఎంతో ఆకర్షణీయంగా కనబడతారు.
వార్మప్‌లను మరవకండి
ఏ వ్యాయామమైనా చేయడానికి ముందు శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి. అలాగే పోల్‌డ్యాన్స్‌ చేసేటప్పుడు కూడా కొన్ని వార్మప్‌ వ్యాయామాలు చేయాలి. అప్పుడు శరీరం ఉత్తేజితమై పోల్‌డాన్స్‌లో చేసే భంగిమలకు సహకరిస్తుంది. ఉదాహరణకు మోకాళ్ళ మీద కూర్చొని, వెనుకకు వంగుతూ పాదాలను చేతులతో పట్టుకోవాలి. దీనివలన శరీరంలోని అన్ని భాగాలు ఉత్తేజితమై, నృత్యానికి సహకరిస్తాయి. అలాగే పోల్‌డ్యాన్స్‌ చేయడానికి వీలుగా ఉండే దుస్తులను ధరించడం మరవకండి.

No comments:

Post a Comment