Friday, October 11, 2013

నేటికి 50ఏళ్లు పూర్తి...

ఒక పౌరాణిక సినిమా జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతలు సాధించింది. తింటే గారెలు తినాలి.. వింటే భారతం వినాలి.. చూస్తే నర్తనశాల చిత్రం చూడాలి...
అనేంతగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. 1963 అక్టోబర్ 11న దసరా కానుకగా నర్తనశాల విడుదలైంది. విడుదలై సరిగ్గా నేటికి 50ఏళ్లు పూర్తి చేసుకుంది. పౌరాణిక బ్రహ్మగా పేరొందిన దర్శకుడు కమలాకర కామేశ్వరావు ప్రసిద్ధి ఈ సినిమాతో ఎల్లలు దాటింది. నాటి నటీనటుల నటనా వైభవానికి దేశీయులే కాదు..విదేశీయులు సైతం ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఎస్ వి రంగారావు (కీచకుడి పాత్ర) నటనకు మంత్రముగ్దులైన విదేశీయులు.. తమ దేశంలో ఇలాంటి నటుడు పుట్టలేదే.. అని ముక్కున వేలేసుకున్నారు. నేటి సినిమాల్లో నటీనటులు ఎప్పటికప్పుడు మారిపోయే క్రమంలో.. ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకొని ఈ రోజుకీ అందరినోటా ప్రశంసలుందుకుంటోంది. రాజ్యం పిక్చర్స్ పతాకంపై ఈ పౌరాణిక చిత్రం తెలుగు సినీ వినీలాకాశంలో ఓ వెలుగు వెలిగింది. అప్పట్లో ఈ చిత్రం 26 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. విజయవాడ, హైదరాబాద్ లలో 200 రోజులు ఆడింది. 19 కేంద్రాల్లో శత దినోత్సవాన్ని జరుపుకొంది.
కథాగమనం..
చిత్ర వీక్షణం మొత్తం మహాభారతంలోని విరాటపర్వం. అంటే.. కౌరవుల చేతిలో మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు పన్నెండేళ్లు అరణ్యవాసం పూర్తి చేసుకొని, ఒక ఏడాది అజ్ఞాతవాసంలో ఉంటారు. దాంతో వారు తమ ఆయుధాలన్నింటినీ జమ్మిచెట్టుపై దాచి ఉంచుతారు. తమ నిజస్వరూపాలు తెలయకుండా ఉండేందుకు మారువేషాలు ధరిస్తారు. ధర్మరాజు కంకుభట్టుగా, భీముడు వంటవాడుగా, అర్జునుడు బృహన్నలుగా, నకులుడు, సహదేవుడు అశ్వ, గోపాల తంత్రీపాలుగా మారుతారు. విరాటరాజు కొలువును ఆశ్రయిస్తారు. ద్రౌపది సైరంధ్రిగా మారి రాణిగారికి అలంకారాలుచేసే దాసిగా అక్కడకు చేరుతుంది. విరాటరాజు బావమరిది కీచకుడు. విరాటరాజు కుమార్తె ఉత్తర. ఆమెకు నాట్యం నేర్పించేందుకు బృహన్నల పాత్రలో అర్జునుడు వస్తాడు. సంగీతం, నాట్యం నేర్పించే కేంద్రానికి నర్తనశాలగా పేరు పెట్టారు.
ఎన్టీఆర్ నటన నభూతో..
బృహన్నల పాత్రను .. ఎన్టీఆర్ సవాల్ గా తీసుకున్నారు. ఆడ,మగ నటన కలగలిపిన పాత్ర.. నేటి స్టార్లు ఊహించడానికే వీలు లేని పాత్రను చేసి అందిరిని మెప్పించారు. ఆ పాత్ర కోసం ఎన్నో రోజులు కూచిపూడి నేర్చుకున్నారు. బృహన్నల పాత్ర తో ఆయన చెరగని ముద్ర వేశారు. ఎల్ విజయలక్ష్మికి ధీటుగా ఆయన నటించారు. ఇందుకు నృత్య దర్శకుడు వెంపటి సత్యం వద్ద శిక్షణ తీసుకున్నారు.
నటనా కౌషలం...
కంకుభట్టుగా మిక్కిలినేని.. ద్రౌపదిగా సావిత్రి, ఎస్ విఆర్ కీచకుడుగా.. బృహన్నలగా ఎన్టీఆర్ వారివారి పాత్రల్లో జీవించారు. వీరే కాకుండా ఈ చిత్రంలో.. నర్తకిగా ఎల్ విజయలక్ష్మి,భీముడిగా దండిమూడి రాజగోపాల్ రావు , అభిమన్యుడిగా శోభన్ బాబు, రేలంగి... మరెందరో నటులు చిరస్మరణీయ నటనను ప్రదర్శించారు. సుసర్ల దక్షిణామూర్తి సంగీతంలో ఈ చిత్రంలోని పాటలు చిత్రానికే హైలెట్ గా నిలిచాయి.
అంతర్జాతీయస్థాయిలో..
1964లో జాతీయ అవార్డుల్లో అఖిలభారత స్థాయిలో నర్తనశాల చిత్రం నిలిచింది. ఇప్పటివరకూ ఏ తెలుగు చిత్రానికి ఇంతటి ఖ్యాతి లభించలేదు. జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్రంగా అవార్డును గెలుచుకుంది. 1964లో జకార్తాలో జరిగిన ఆఫ్రో ఆసియన్ చలనచిత్రోత్సవానికి ఇండియానుండి వెళ్లిన ఒకే ఒక్క సినిమా నర్తనశాల. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఈ చిత్రానికి ఎన్నో అవార్డులు.. మరెన్నో ప్రశంసలు లభించాయి.

No comments:

Post a Comment