క్యాలిగ్రఫీ అన్నది అరేబియా ఎడారులలో క్యూఫిక్ రూపంలో అభివృద్ధి చెంది అక్కడి నుంచి పర్షియాకు చేరింది. అరబిక్ అక్షరమాలలో అక్షరాల రేఖలు ఒకదానిలోకి ఒకటి ప్రవహిస్తాయి. కనీ కనపడకుండా, చేయి తిరిగిన
స్ట్రోక్‌లలో అక్షరాల కలయిక జరుగుతుంది. ఈ అక్షరాల పైన, కింద నుఖాత్ అనే చుక్కలు ఉంటాయి. నీటి మడుగులో బుడగల లాగా ఒక్కోసారి ఈ చుక్కలు దగ్గర దగ్గరగా వస్తాయి. కొన్నిసార్లు అక్షరాలు ఒకదాని నుంచి ఒకటి విడిపోయి ఉంటాయి. అయితే ఏ రూపంలో అయినా ఈ చుక్కలు సంకేతాల లాగా పనిచేస్తాయి. ఇస్లామిక్ క్యాలిగ్రఫీ అన్నది ఓ ప్రత్యేక అక్షరమాలను అందంగా రాయడం. సంకేతాల వెంట కళ్లు పరిగెెట్టి విషయం అవగాహనకు రావడం ఈ అక్షరమాలలో జరుగుతుంది. ఉర్దూ ముద్రణ రంగంలో ఆధునికత వచ్చి, ఈ కళాకారులకు ఇటీవల ఆదరణ తగ్గినా మంచి రోజులు మళ్లీ వస్తున్నట్ల్లు హైదరాబాద్ నగరానికి చెందిన ప్రసిద్ధ క్యాలిగ్రఫీ కళాకారుడు మహమ్మద్ నయీమ్ అంటున్నారు.హైదరాబాద్ నగరంలో క్యాలిగ్రఫీకి చీకటి రోజులు తొలగిపోయాయని 84 ఏళ్ల కాకలు తీరిన క్యాలిగ్రాఫర్ మహమ్మద్ నయీమ్ సబేరీ చెబుతారు. సాంప్రదాయిక దక్కనీ షేర్వానీ ధరించి, చేతిలో కలంతో , పక్కన రంగులు కలుపుకొనే పళ్లెంతో, ఈ వయస్సులో కూడా నిలకడగా ఉండే చేతులతో - చూడగానే తనది క్యాలిగ్రఫీ వృత్తి అని తెలిసేలా ఉంటారు నయీమ్. ఖురాన్‌లోని లయాత్మకమైన శ్లోకాలకు కళాత్మక ఆకృతినిస్తారు ఆ వృద్ధ క్యాలిగ్రాఫర్.
కాకలు తీరిన నయీమ్
పెన్ స్ట్రోక్‌లను అదే పనిగా తుంచే ప్రత్యేక పద్ధతిలో నయీమ్ కాస్తా అక్షరాలను చిత్తరువులుగా దిద్దుతారు. అదృష్టవశాత్తూ ఇప్పుడు క్యాలిగ్రఫీ పునరుజ్జీవం పొందుతోందని ఆయన చెప్పారు.
విద్యార్థులలో, వృత్తి నిపుణులలో క్యాలిగ్రఫీని ఉర్దూ దినపత్రిక 'సియాసత్', 'ఇదారా- ఇ-అభియాత్- ఇ- ఉర్దూ' సంస్థలు ప్రోత్సహిస్తూ, కాపాడుతున్నాయని నయామ్ తెలిపారు. 1942లో క్యాలిగ్రఫీని పరిరక్షించడానికి ఇదారా సంస్థను నెలకొల్పారు. ప్రత్యేక రకం ఇంకుకు బదులు నీటి రంగులను వాడడంతో క్యాలిగ్రఫీ ఖర్చు బాగా తగ్గిందని ఆయన చెప్పారు. గడచిన రెండేళ్ల నుంచి పిన్నలు, పెద్దలు గుంపులుగా క్యాలిగ్రఫీ తరగతులకు హాజరవుతున్నారు.
నయీమ్ క్యాలిగ్రఫీ తరగతులను వందలమంది విద్యార్థులతో నడుపుతున్నారు. ఆయనకు ఒక్కో తరగతిలో 150 మంది విద్యార్థులు ఉంటారు. అలా వేలమందిని క్యాలిగ్రఫీ కళాకారులుగా మలిచారాయన. ఆయన ఐదు దశాబ్దాలుగా ఆ వృత్తిలో కొనసాగుతున్నారు. జర్మనీ నుంచి వచ్చిన విద్యార్థులకు కూడా క్యాలిగ్రఫీ విద్యను నయీమ్ నేర్పారు. తాను ఒక విషయాన్ని కంపోజ్ చేయడానికి దాని పరిమాణం, డిజైన్, పద్ధతిని బట్టి 15 నిమిషాలు లేదా ఐదురోజుల వ్యవధి పడుతుందని చెప్పారు. సాలార్ జంగ్ మ్యూజియంలో ప్రస్తుతం తాను క్యాలిగ్రఫీ చేసిన వందలాది కళాఖండాలున్నాయని నయీమ్ తెలిపారు. ఇతర క్యాలిగ్రాఫర్లు, విద్యార్థులు కంపోజ్ చేసినవి కూడా ఆ మ్యూజియంలో ఉన్నాయని చెప్పారు. క్యాలిగ్రఫీ కళాఖండాలను కొనడానికి జనం బారులు తీరుతుండడంతో ఆ కళకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని నయీమ్ అభిప్రాయపడ్డారు. ఆయన పదేళ్ల వయస్సులో ఉన్నపుడు ఖతాత్ విద్యను తన మామ మెహబూబ్ అలీ అధేర్ నుంచి నేర్చుకొన్నారు. ఆ విద్య పట్ల తనకున్న అవగాహనను క్షుణ్ణంగా పరిశీలించాక గాని మామ తనకు ఆ విద్యను నేర్పలేేదని నయీమ్ నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఖత్-ఇ-గుల్జార్‌లో ఖేరాన్ కవిత్వాన్ని, పద్యాలను కంపోజ్ చేయడం బాగా నేర్చుకొని చాలా మందికి నేర్పానని ఆయన తెలిపారు. ఖత్- ఇ- ఖుఫిలో చుక్కలు ఉండవు. నిజానికి, నయీమ్ నీటిపారుదల శాఖలో ప్రభుత్వోద్యోగిగా పనిచేశారు. అక్కడ ఉద్యోగంలో కుదురుకొన్నా ఆయన క్యాలిగ్రఫీ కళ విడిచిపెట్టలేదు. అంగుళంలో ఆరోవంతు ఉండే పాళీ గల కలంతో క్యాలిగ్రఫీ నైపుణ్యం చూపడమంటే నయీమ్‌కు ఎంతో ఇష్టం.
ఎక్కడిదీ కళ?
ఫన్-ఇ- ఖుష్నవీసిగా క్యాలిగ్రఫీని ఈ కళలో కాకలు తీరిన అందరూ గుర్తుపడతారు. క్యాలిగ్రఫీలో అక్షరాలను చుక్కలతో, వక్రరేఖలతో, కుంచె స్ట్రోక్స్‌తో కూడా నిలువుగా, అడ్డంగా పేర్చడం ఉంటుంది. 13వ శతాబ్దంలో ఈ కళ ఆఫ్ఘనిస్తాన్‌లోని హెరాత్ నగరంలో మార్పునకు గురై, నస్తాలిక్ రూపాన్ని సంతరించుకొంది. అక్కడి నుంచి భారత ఉపఖండాన్ని చేరి రాజుల ప్రాపకాన్ని పొందింది.
1992లో హైదరాబాద్ నగరంలోని ఉర్దూ ప్రచురణ సంస్థలు ముద్రణ ప్రక్రియను ఆధునీకరించడం ప్రారంభించాయి. కొన్ని యుగాలుగా పాత పద్ధతులను అనుసరిస్తూ వచ్చిన అవి అప్పట్లో కొత్త మార్గం పట్టాయి. అందంగా రాయడం కోసం కొన్నేళ్లుగా ప్రచురణ, ముద్రణ రంగంలో కొనసాగుతున్న మాస్టర్ క్యాలిగ్రాఫర్లకు ఉద్వాసన పలికారు. వారంతా కేవలం ఖత్తాత్‌లుగా మిగిలారు. పూర్వం వారు దినపత్రికలు, గ్రంథాల పతాక శీర్షికలను అందంగా రాసేవారు. చివరకు ఈ క్యాలిగ్రాఫర్లు ఉద్యోగాలు కోల్పోయాక జీవిక కోసం అతి తక్కువ మూల్యానికి పాతబస్తీలో పెళ్లిళ్లకు ఆహుతుల పేర్లను అందంగా రాసే వృత్తిలో కుదురుకొన్నారు.
బెంగళూరులో కళా ప్రదర్శన
త్వరలోనే బెంగళూరులో హైదరాబాద్ నగర క్యాలిగ్రాఫర్ల కళాకృతులతో ప్రదర్శనను నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రదర్శనను ఇండియన్ ఇస్లామిక్ ఆర్ట్ పేరుతో లిబియాకు తరలిస్తారు. బెంఘాజి, త్రిపోలీలలో ప్రదర్శనలు నిర్వహిస్తారు. తరువాత యూరోపియన్ దేశం మాలాలో కూడా ప్రదర్శనను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రదర్శనలతోనైనా మన క్యాలిగ్రఫీ కళ తిరిగి ఎంతో కొంత పూర్వపు వైభవాన్ని అందుకొంటుందేమో చూడాలి.

No comments:
Post a Comment