Tuesday, September 24, 2013

ఎగసిన పాటల కెరటం

శ్రేయ తొలి గురువు ఆమె తల్లి శర్మిష్ఠ. తన ఇంజనీర్‌ తండ్రి కూడా పట్టుదలతో తనకోసం కలలు తీరే దారి చూపించారని శ్రేయ భావిస్తారు. 1984 మార్చి12న జన్మించిన ఘోషాల్‌ గడచిన దశాబ్దంలో ప్రముఖ హిందీ ఫిలిం
గాయనిగా పేరు తెచ్చుకొన్నారు. తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ భాషలలో కూడా ఆమె పాడారు. ఆమె తన కెరీర్‌లో చాలా అవార్డులు, నామినేషన్లు పొందారు. ఉత్తమ నేపథ్య గాయనిగా నాలుగు జాతీయ ఫిలిం అవార్డులు, ఫిలింఫేర్‌ అవార్డు, మూడు రాష్ట్ర ఫిలిం అవార్డులు, ఫిలింఫేర్‌ ఆర్‌డి బర్మన్‌ అవార్డు, అమెరికాలోని ఒహాయో పురస్కారం, దక్షిణ భారతదేశపు గాయనిగా ఏడు ఫిలింఫేర్‌ అవార్డులు గెలుచుకొన్న ఆమె మన దేశపు ఉత్తమ సినీ గాయనిగా అనతికాలంలో మంచిపేరు తెచ్చుకున్నారు.

ఒహాయో విశిష్ట పురస్కారం
అమెరికాలోని ఒహాయో రాష్ట్ర గవర్నర్‌ 'టెడ్‌ స్ట్రిక్‌ ల్యాండ్‌' జూన్‌ 26ను 'ఘోషాల్‌ డే'గా ప్రకటించారు. సంగీత ప్రపంచానికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఆ రాష్ట్రం ప్రకటించింది. ఆమె ఆ సమయంలో ఆ రాష్ట్రంలోనే ప్రదర్శనలు ఇస్తున్నారు. చాలా సంవత్సరాలుగా కళాకారులు, సాహితీవేత్తలకు ఆ రాష్ట్రం ఇటువంటి ప్రకటనలతో సత్కరించడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో మనదేశంలో రవీంద్రనాథ్‌ టాగోర్‌, స్వామి వివేకానందలకు ఆ గౌరవం దక్కింది. 2010 జూన్‌ 26న మొట్టమొదటి 'శ్రేయ ఘోషాల్‌ డే' నాడు ఆమె అభిమానులు మైక్రో బ్లాగింగ్‌ సైట్ల ద్వారా అట్టహాసంగా శ్రేయ ఘోషాల్‌ దినాన్ని జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఎన్నో చిత్రాలను సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్ల ద్వారా అభిమానులు పంచుకొన్నారు. ఆమె పాడిన చాలా పాటలను కూడా టిసిరీస్‌ అభిమానుల కోసం లోడ్‌ చేసింది.
సరిగమప పోటీని గెలవడంతో ఆమె కెరీర్‌ మలుపు తిరిగింది. ఆమె హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం 'దేవదాస్‌'తో ఆరంభమైంది. ఆ చిత్రంతో శ్రేయ ఉత్తమగాయనిగా జాతీయ అవార్డు, ఫిలింఫేర్‌ అవార్డునూ సొంతం చేసుకొన్నారు. ఆమె మన దేశపు అత్యున్నత స్థాయి సెలబ్రిటీలలో ఒకరిగా ఫోర్బ్స్‌ గుర్తింపును 2013లో పొందారు. అదే సంవత్సరం ఫేస్‌బుక్‌లో ఎఆర్‌ రెహమాన్‌, సచిన్‌ టెండూల్కర్‌ తరువాత కోటి మంది ఇష్టపడిన వ్యక్తిగా నిలిచారు. ఈ విషయంలో సైతం అలాంటి గౌరవం పొందిన తొలి భారతీయ మహిళగా శ్రేయ పేరొందారు.
కొత్త పోకడలకు శ్రేయ ఆహ్వానం
కొందరు యువ సంగీత దర్శకులు పాటకు తెస్తున్న కొత్త గుర్తింపు పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. వారు సృజనాత్మకత సరిహద్దులను తిరగ రాస్తున్నారని అభిప్రాయపడ్డారు. వారితో కలిసి పనిచేయడం హుషారుగా ఉంటుందన్నారు. ఒక మ్యూజిక్‌ కంపెనీ ఆన్‌లైన్‌ పథకం కింద కైలాష్‌ ఖేర్‌తో కలిసి 'నైనా చార్‌' అనే పాట పాడారు. సొంత ట్యూన్స్‌కు అనుగుణంగా నృత్యం చేయడం కూడా తనకు ఇష్టమని చెప్పారు.
2005 నుంచి హవా
శ్రేయ ఘోషాల్‌ నుంచి 2005లో చాలా పాటలు విన్నాం. ఎలాన్‌, బ్లాక్‌ మెయిల్‌, జుర్మ్‌, ఫన్‌ హిట్‌ సినిమాల నుంచి శ్రేయ పాటలు ఆమెకు భారతీయ సినీ ప్రపంచంలో చెరగని ముద్రను వేశాయి.
జహర్‌ ఆల్బమ్‌లో 2005లోనే ఆమె పాట 'అగర్‌ తుమ్‌ మిల్‌ జో' చేరింది. ఎవర్‌ గ్రీన్‌ రొమాంటిక్‌ హిట్స్‌ పేరిట కూర్చిన ఆల్బమ్‌లో ఉన్న ఈ పాట అప్పటికి అన్ని చార్ట్స్‌ను అధిగమించింది. ఆమె ప్రస్తుతం ఏడుగురు సంగీత దర్శకుల పర్యవేక్షణలో సినిమాలకు పాడుతున్నారు. గతంలో అనూమాలిక్‌, కల్యాణ్‌జీ ఆనంద్‌జీ, సంజీవ్‌ దర్శన్‌, బప్పి లాహిరి, తదితరులకు పాడారు. 2006 నుంచి ఘోషాల్‌ పాటలు మరింతగా హోరెత్తిస్తున్నాయి. కొన్ని ఈ కాలపు పాటలను శ్రేయ స్వయంగా తన వెబ్‌సైట్‌లో ఉంచారు. దాదాపు డజనుకు పైగా హిందీ సినిమాలలో ఈ ఏడేళ్ల కాలంలో శ్రేయ పాడారు.
హైదరాబాద్‌లో ప్రముఖ చలనచిత్ర గాయని శ్రేయా ఘోషాల్‌ ఇటీవల ఓ సాయంత్రం శ్రోతలను తన పాటలతో అలరించారు. శిల్పకళా వేదికపై 'ది హిందు' ఆంగ్ల దినపత్రిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె సంగీతం పట్ల తన భావాలను వ్యక్తం చేశారు. వీక్షకులను విశేషంగా ఆకర్షించి, ఇటీవలే ముగిసిన ఇండియన్‌ ఐడల్‌ జూనియర్‌ రియాలిటీ షో జడ్జీలలో ఒకరిగా ఆమె తన వ్యాఖ్యలతో అందరిలో చెరగని ముద్ర వేశారు. ఆమె సునిశిత విమర్శలు, ప్రోత్సాహకర వ్యాఖ్యలను రియాలిటీ షోలో పాల్గొన్న వారు, వీక్ష్షకులూ సమానంగా ఇష్టపడ్డారు. ఆమె స్వయంగా ఎన్నో రియాలిటీ షోలలో పాల్గొనడమే అందుకు కారణం కావచ్చు. విశాల్‌, శేఖర్‌, తాను ఆ షోకు న్యాయం చేశామని ఆమె ధీమాగా పేర్కొన్నారు. రియాలిటీ షోలు కేవలం టిఆర్‌పి రేటింగ్‌ కోసం ప్రసారంచేసే కార్యక్రమాలన్న విమర్శల గురించి చెబుతూ ఆ కార్యక్రమాలను కేవలం తొలిమెట్టులాగా ఉపయోగించుకోవాలన్నారు. వాటిలో వచ్చిన అవార్డులతో అంతా సాధించేశామనుకోరాదనీ చెప్పారు. పాల్గొన్న కళాకారుల సృజనను వెలికి తీయడమే అసలు ఉద్దేశమని అందుకే వారి ప్రదర్శనలోని మంచిని, తప్పులను ఎత్తిచూపి, సరిదిద్దుకోడానికి ఒక అవకాశమిచ్చామని చెప్పారు. అయితే ఆ పనిలో కరుకు వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తపడ్డామని తెలిపారు. జీవితకాలం సాధనకు టైటిల్‌ మంచి ప్రారంభం మాత్రమే అన్నారు. 'ఇండియన్‌ ఐడల్‌ జూనియర్‌ షో'లో 'టైటిల్స్‌ కోసం చిన్నారుల్ని తొందరపెట్టకండంటూ' పిల్లల తల్లితండ్రులకు ఆమె హితవు చెప్పారు. ప్రదర్శనలో మితిమీరి పాడిస్తే, స్వరపేటిక తొందరగా పాడైపోతుందని హెచ్చరించారు.
తెలుగు హిట్స్‌
శ్రేయ తెలుగులో 25 దాకా హిట్స్‌ ఇచ్చారు. వాటిలో కొన్ని : 1 ప్రేమ ప్రేమ, అత్తారింటికి, ప్రేమించే ప్రేమవా, వెళ్లిపోతే ఎలా, నువ్వేం మాయ, నువ్వే నా శ్వాస, నీ కోసం, తలచి తలచి, వచ్చే వచ్చే, జగదానంద కారకా, ఆకాశ దేశాన, ఆకు వక్క, ఆలాపన నామనసున, అమ్మాయి ఆంధ్రా మిర్చీ, అటేమో వెన్నెల గోదారి, ఉన్నట్టుండి ఏదో .. ఇలా ఎన్నో హిట్లిచ్చిన శేయ మనవారి దృష్టిలో తెలుగు గాయని!

No comments:

Post a Comment