Monday, September 2, 2013

'ట్రెండ్ సెట్టర్' పుట్టాడు!

అక్కడి అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి తో ఎంట్రీ ఇచ్చి 'తొలిప్రేమ'తో టాలీవుడ్ కు తన సత్తా ఎంటో తెలిసేలా చేశాడు. 'తమ్ముడు'తో తనలోని కొత్త కోణాన్ని బయటపెట్టాడు. 'సుస్వాగతం'తో యూత్ ను ఆకట్టుకున్నాడు. 'బద్రి'తో టాలీవుడ్ కు
తన ట్రెండ్ ను పరిచయం చేశాడు. 'గుడుంబా శంకర్' తోయూత్ కు స్టైల్ అంటే ఎంటో చెప్పాడు. ఇక 'ఖుషి'తో ఇండస్ట్రీలో 'పవనిజాన్ని' క్రియేట్ చేశాడు. ఇప్పుడు 'అత్తారింటికి దారేదీ' తో టాలీవుడ్ లో సింహాన్ని చూపించబోతున్నాడు. ఆయనే టాలీవుడ్ నిజమైన 'బెంగాల్ టైగర్' పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ రోజు ఈ 'ఆరడుగుల బుల్లెట్' పుట్టిన రోజు. ఈ సోమవారం తన పుట్టిన రోజు జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్ కు '10టివి' శుభాకాంక్షలు చెబుతోంది.
పవన్ కళ్యాణ్ కి అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడమే కాకుండా వారికి , టాలీవుడ్ కు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. 'చిరంజీవి' తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినా.. అతి తక్కువ టైమ్ లోనే తమ్ముడు అనే మార్క్ ను చెరిపేసుకుని 'పవర్ స్టార్' గా ఎదిగాడు. ఓ సినిమాకు కమిట్ అయితే, అది తప్ప వేరే లోకం తెలియని వాడు. తొలిప్రేమతో ఎంతో మందిని సినిమా ఇండస్ట్రీ వైపు పరుగులు పెట్టించడమే కాదు.. ఎందరో టెక్నీషియన్లకు అవకాశం ఇచ్చి, నిరూపించుకునేలా చేసినవాడు. అందుకే అతడు 'ధైర్యం విసిరిన రాకెట్టు'..
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' అంటూ.. సింపుల్ గా ఎంట్రీ ఇచ్చినా.. అందులో తనదైన ప్రతిభ చూపించాడు. అదే మార్షల్ ఆర్ట్స్. ఫస్ట్ సినిమాలోనే అతను చేసిన విన్యాసాలకు ఒళ్లు గగుర్పొడవడమే కాదు, అప్పటికే మాస్ హీరోగా ఉన్న చిరంజీవికి సరైన వారసుడు ఇతనే అనిపించుకున్నాడు. తర్వాత 'గోకులంలో సీత' అంటూ వచ్చినా.. కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ సాధించలేక పోయాడు. 'సుస్వాగతం' సినిమా పవన్ కు తొలి కమర్షియల్ హిట్ ఇచ్చింది. ఆ తర్వాత జీవితంలో ఏదైనా కొత్తగా ట్రై చేయాలని ఫిక్స్ అయ్యాడు. అలా ఎవరికీ తెలియని ఓ తమిళ కుర్రాడిని దర్శకుడిగా ఎంచుకుని ఫస్ట్ ప్రయోగం చేశాడు. అదే 'తొలిప్రేమ'. ఏ అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ తెలుగు సినిమా చరిత్రలోనే ఓ సంచలనం అయింది. ఇక అప్పటి నుంచి పవన్ చేసినవన్నీ ప్రయోగాలే అనుకోవచ్చు. తొలిప్రేమతో కరుణాకరన్ కు లైఫ్ ఇస్తే, మరో కొత్త దర్శకుడు అరుణ్ ప్రసాద్ ను నమ్మాడు. తమ్ముడు సినిమాతో తనలోని మాస్ యాంగిల్ నే కాకుండా.. తన విద్యాలను ప్రదర్శించాడు. ఈసినిమా సూపర్ హిట్ కావడంతో పవన్ మరింత ఉత్సాహంగా ప్రయోగాలు కంటిన్యూ చేశాడు.
పవన్ ఇండస్ట్రీకి మరో డైనమిక్ డైరెక్టర్ ను పరిచయం చేశాడు. అతనే పూరీ జగన్నాథ్.. 'బద్రి' సినిమాతోనే ఓ సంచలనం సృష్టించాడు పూరీ. అంతే కాక పవన్ కు కొత్త యాంగిల్ లో చూపించాడు. బద్రిలో మరో విశేషం ఏంటంటే అన్ని పాటలకు పవన్ కళ్యాణే కొరియోగ్రాఫర్. ఆ తర్వాత సుస్వాగతం నుంచి వరుస హిట్లున్నా.. పవన్ కెరీర్ లో స్పెషల్ మూవీ మరొకటుంది. ఇది కూడా కొత్త దర్శకుడితోనే కొట్టాడు హిట్టు. తమిళ డైరెక్టర్ ఎస్.జె.సూర్య ను పరిచయం చేస్తూ 'ఖుషీ'గా పవన్ చూపిన ఫెర్ఫార్మెన్స్ కు ఎంటైర్ ఏపి ఊగిపోయింది. 'బెంగాల్ టైగర్' సిద్దూ.. సిద్ధార్థ్ రాయ్ అంటూ పవన్ డైలాగ్స్ కు అమ్మాయిలూ ఫిదా అయిపోయారు..
'జానీ' సినిమాతో పవన్ కొత్త ఒరవడికి నాంది పలికాడనే పేరువచ్చినా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయాడు. జానీ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని చేసిన సినిమా 'గుడుంబా శంకర్', 'బాలు'. పేరుకు తగ్గట్టే పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ మూవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ లక్ష రూపాయలతో డిజైన్ చేయించిన పవన్ 'ప్యాంట్' మాత్రం ట్రెండ్ క్రియేట్ చేసింది. కాస్ట్యూమ్స్ విషయంలో కొత్త ట్రెండ్ కు తెరలేపింది. తర్వాత వచ్చిన 'బంగారం', 'అన్నవరం' రూపంలో అతనికి ఇబ్బందులే వచ్చాయి. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న పవన్ మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ కు దర్శకుడిగా 'జల్సా' చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద క్లిక్ అయింది. చాలా రోజుల తర్వాత పవన్ కు హిట్ అందింది. అదే ఉత్సాహంతో తీసిన 'పులి' సినిమా హైఎక్స్ పెక్టేషన్ తో వచ్చినా.. అది కాస్త భారీ డిజాస్టర్ గా మారింది. 'తీన్ మార్', పంజా సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.
ఇక అప్పుడే బాలీవుడ్ లో ఓ సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ 'దబాంగ్' రీమేక్ లో తన దైన ట్రెండ్ లో నటించి మరో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు పవన్. అదే 'గబ్బర్ సింగ్'. ఈ సినిమా సృష్టించిన సంచలనానికి టాలీవుడ్ రికార్డులన్నీ షేక్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. అయినా మరోసారి త్రివిక్రమ్ తో కలిసి చేస్తున్న 'అత్తారింటికి దారేదీ'పై కూడా అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నెల 19న విడుదల కాబోతున్న ఈ సినిమా మరోసారి టాలీవుడ్ లో రికార్డులు సృష్టిస్తుందని సినిమా టీమ్ చెబుతుంది.
ఈ సినిమా ఎలాఉన్నా.. పవన్ అంటే ఇండస్ట్రీలో ఇప్పుడో మేనియా.. అతని పేరు చెబితే అభిమానులు 'పవనిజం' తడిసిపోతున్నారు. అందుకే అత్తారింటికి దారేదీ ఎప్పుడు వచ్చినా సూపర్ హిట్ చేసేందుకు రెడీగా ఉన్నారు అభిమానులు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా, వ్యక్తిగా పవన్ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు.. నిలుస్తున్నాడు. అందుకే అతనంటే పడిచచ్చే అభిమానులు అంతమంది ఉంటారు. ఇప్పుడున్న హీరోల్లో అతని సినిమాలే కాదు, శైలి కూడా విలక్షణమే. పవన్ నేర్పిన ట్రెండ్ ను మెచ్చుకోంటూ.. మరోసారి ఈ 'ఆరడగుల బుల్లెట్' కు '10టివి' తరపున మరో సారి బర్త్ డే విషెస్ చెబుదాం..

No comments:

Post a Comment