Sunday, September 15, 2013

మనసు 'మాట' వినండి..!

మన గురించి ఎదుటి వారు ఏమనుకుంటున్నారు..? వారి మనసులో మనకున్న స్థానమేంటి..?? మనం చేస్తున్న పనిపై వారి నిష్పాక్షిక అభిప్రాయం ఏంటో..???
ఇలా.. ఎదుటివారి ఆలోచనలపై మనకు లెక్కలేనన్ని సందేహాలు వస్తుంటాయి. మరి.. ఈ అనుమానాలు తీరేదెలా..? ఇతరుల మనసు తెలుసుకునేదెలా..?? సరిగ్గా ఇలాంటి ప్రశ్నలు తలెత్తడంతో మనసు మర్మం తెలుసుకునే పనిలో పడ్డారు కొందరు శాస్త్రవేత్తలు. ఆ దిశగా కొంత వరకూ విజయం సాధించారు కూడా..!
హ్యూమన్ బ్రెయిన్ ఒక సెన్సేషన్. ఆలోచనలు, కలలు, జ్ఞాపకాలు, భావోద్వేగాల వంటి అద్భుత శక్తులు మనిషి మెదడుకే సొంతమయ్యాయి. కానీ దాని గురించి మనిషికి తెలిసింది చాలా తక్కువే. మనిషి మెదడులో వందల కోట్ల నాడీ కణాలుంటాయి. ఇవి ఒకదానికొకటి జల్లెడలా అల్లుకుపోయి ఉంటాయి. వీటి అమరిక ఒక వింత. అయితే మెదడుకు అత్యంత వేగంగా ఆలోచించడం ఎలా సాధ్యమవుతుంది? పెద్ద ఎత్తున సమాచారాన్ని జ్ఞాపకం ఉంచుకునే శక్తి ఏ విధంగా సాధ్యమైందనేది అంతు చిక్కని ప్రశ్న! శరీరానికి సంబంధించిన ప్రతి చర్యకూ కర్త, కర్మ, క్రియ మెదడే. న్యూరాన్లమయమైన మనిషి మెదడు ఒక పెద్ద మిస్టరీ. మానవ మెదడు అపరిమిత జ్ఞాపకశక్తిని కలిగి ఉన్న ఒక హార్డ్ డిస్క్ లాంటిది. ఒక శక్తివంతమైన కంప్యూటర్ లా నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. దీన్ని కంప్యూటర్లకు అనుసంధానం చేస్తే అది కచ్చితంగా ఒక సంచలనమే అవుతుంది.
ఆ పనిలోనే శాస్త్రవేత్తలు...
కాలిఫోర్నియా యూనివర్సిటీ, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలకు ప్రస్తుతం ఇదే పని మీద ఉన్నారు. ఎవరి మనసులో ఏముందో..? ఎవరి మనసులో ఏ మర్మం దాగుందో..? కనిపెట్టేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఏదైనా విషయం గుర్తుపెట్టుకునేటప్పుడు.. మెదడులో పి-300 అనే తరంగాలు విడుదలవుతాయి. మన జ్ఞాపకశక్తికి ఈ తరంగాలే కారణం. ఈ తరంగాలను పసిగట్టగలిగితే ఇక ఆలోచనల పని పట్టొచ్చు. గేమ్ కంట్రోలర్ కి వాడే ఇంటర్ ఫేస్ ని మనసుకి అమర్చి రీడ్ చేయొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇలా ట్రేస్ చేయడం ద్వారా మనసులో ఏయే విషయాలు ఉంటాయో తెలుసుకునే అవకాశం ఉందట. ఎటిఎం కార్డు కంటి ముందు పెట్టినప్పుడు మనసులో మెదిలే పిన్ నెంబర్ ని ట్రేస్ చేసి కనిపెట్టేశారు. సుదూరాన గల కంప్యూటర్లలోని సమాచారం కొల్లగొట్టినట్లే మెదడులోని రహస్య సమాచారాన్ని సైతం హ్యాకర్లు కొల్లగొట్టేయగలరని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మెదడులోని సమాచారాన్ని కూడా తెలుసుకోగల ఎమోటివ్ బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ అనే పరిజ్ఞానం ఎలా పనిచేస్తుందో ఆక్స్ ఫర్డ్ వర్సిటీ, కాలిఫోర్నియా యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. ప్రయోగంలో పాల్గొన్న వలంటీర్లకు ఎమోటివ్ బీసీఐ హెడ్‌సెట్‌లను తొడిగి, వారిని కంప్యూటర్ తెరల ఎదుట కూర్చోబెట్టారు. ఈ పరికరం ప్రభావంతో కంప్యూటర్ తెరలపై వారి ఆలోచనల్లో ఉన్న చిత్రాలతో పాటు బ్యాంకు కార్డులు, వాటి ‘పిన్’ నంబర్లలోని అంకెలు సైతం కనిపించాయి. చెదురు మదురుగా కనిపించే ఈ సమాచారం ఆధారంగా మెదడుని 15 నుంచి 40 శాతం మాత్రమే శాస్త్రవేత్తలు చదవగలిగారు. ఇంత తెలుసుకున్న వారు మిగిలిన సమాచారం తెలుసుకోవడం కష్టమేమీ కాదు. బీసీఐ హెడ్‌సెట్ల ప్రయోగాలు మరింత మెరుగుపడితే, మెదడులోని సమాచారాన్ని మరింత తేలికగా తెలుసుకునే అవకాశం ఉంది.
బలం చేకూర్చిన 'టెలీపతీ'..
శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన ఒక వినూత్న ప్రయోగం.. ‘టెలీపతీ’ అనే మిథ్యావిద్యకు బలం చేకూర్చింది! ఆలోచనలను అనుసంధానం చేసే ఈ ప్రయత్నం చివరికి ‘మెదడు నియంత్రణ’కు ఉపకరిస్తాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలోని రెండు వేర్వేరు పట్టణాల్లో రెండు ఎలుకలను ఉంచారు. వాటికి ‘మైండ్ రీడింగ్ ఇంప్లాంట్లు’ అమర్చి ఇంటర్‌నెట్‌తో అనుసంధానం చేశారు. అంతే..! ఆ రెండు ఎలుకలు పరస్పరం ఒకదాని మెదడును ఇంకోటి చదువుకున్నాయి. భౌతికంగా ఎలాంటి సంబంధం లేకుండానే వేరొకరికి సమాచారం రవాణా చేయగలిగే ‘టెలీపతీ’ పద్ధతి సాకారం కోసం శాస్త్రవేత్తలు చేసిన వినూత్న ప్రయోగమిది. ఏదో ఓ రోజు ఎదుటి వ్యక్తి మెదడులో ఏ ఆలోచనలు ఉన్నాయో అవి కూడా చదివేసే టెక్నాలజీకి నాంది పలకనుంది.
'స్టీఫెన్ హాకింగ్' పై సరికొత్త ప్రయోగం...

స్టీఫెన్ హాకింగ్.. అనంత విశ్వంలో కృష్ణ బిలాల గుట్టు విప్పిన గొప్ప శాస్త్రవేత్త. కానీ.. మూడు దశాబ్దాలుగా శరీరం పనిచేయడం లేదు. ఆయన మాట కూడా మాట్లాడలేరు. ఆయన శరీరంలో కేవలం ఒక మెదడు మాత్రమే పనిచేస్తుంది. ఆ మెదడే ఆలోచిస్తుంది, విశ్లేషిస్తుంది, వివరిస్తుంది, వింతలు చేస్తుంది. 'మోటార్ న్యూరాన్' వ్యాధి శరీరాన్ని కబళిస్తున్నా.. చేస్తున్న పనికి శరీరం సహకరించక పోయినా.. ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు ఆయన సమాధానం చూపాడు. శాస్త్రవేత్తగానే కాక విధిని అనుకూలంగా మార్చుకున్న వ్యక్తిగా నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు. హాకింగ్ కదలికల్ని ఓ కంప్యూటర్ డీకోడ్ చేస్తుంది. కళ్ల జోడుకు అతికించిన ఒక సెన్సార్ ఆయన హావభావాల్ని వివరిస్తుంది. దశాబ్దాలుగా జరుగుతున్నది ఇదే. వ్యాధి సోకిన రెండేళ్లకే చనిపోతాడనుకున్న హాకింగ్ కొత్త విషయాలను ఆవిష్కరిస్తూ యావత్ ప్రపంచానికి ఒక రోల్ మోడల్ అయ్యాడు. అయితే.. స్టీఫెన్ హాకింగ్ దేహంలోకి మరో టెక్నాలజీ ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఆయన మేథస్సు, జీవితకాలాన్ని మరికొంత కాలం పొడిగించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఏం చేయాలి..? అనుకున్నప్పుడు ఓ ఐడియా వచ్చింది. దటీజ్.. 'ఐ-బ్రెయిన్'!
చలనం లేని సైంటిస్ట్ పై సంచలన ప్రయోగం..
ఈ ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్టు బ్రెయిన్ లోకి చొరబడింది ఒక చిప్. స్టాండ్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఐ-బ్రెయిన్ ని డెవలప్ చేశారు. ఈ సరికొత్త టెక్నాలజీ పరీక్షకు ఇప్పుడు సాక్షాత్తు హాకింగ్ దేహమే వేదికైంది. స్టీఫెన్ హాకింగ్ మేథస్సుని ఇది అనువదిస్తుంది. ఈ పరికరం మెదడు తరంగాలను సేకరించి కంప్యూటర్ ద్వారా బాహ్య ప్రపంచానికి హాకింగ్ ఆలోచనల్ని వివరిస్తున్నది. హాకింగ్ ఎడమ దవడలో సరిగ్గా పనిచేసే ఒక కండరమే ఇంతకాలం ఆయనకు ప్రపంచానికి మధ్య వారధిగా నిలిచింది. గొంతులో అస్పష్టంగా కదలాడే శబ్దాలను ఆ కండరం కదలికల రూపంలో మార్చి వాయిస్ 'సింక్రనైజర్' అనే పరికరానికి పంపుతుంది. అది ఆ కదలికల ఆధారంగా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో డీకోడ్ చేసి మాటల రూపంలో మనకు అందించేది. హాకింగ్ దవడ కండరాలు సరిగా పనిచేయడం మానేశాయి. దీంతో ఆయన ఆలోచనలను మాటల రూపంలోకి మార్చడం కష్టమైపోయింది. దీనికి ప్రత్యామ్నాయంగానే ఇప్పుడాయనకు 'ఐ-బ్రెయిన్' ని అమర్చారు. ఇది అగ్గి పెట్టే పరిమాణంలో ఉండే చిప్. దీంతో హాకింగ్ మెదడుకు ఎలాంటి నష్టం జరగదు. ఎందుకంటే దీని బరువు కూడా తక్కువే కాబట్టి తలపై భారం పడే ప్రసక్తే లేదట. అయితే స్టీఫెన్ హాకింగ్ గురించి తెలుసుకున్నాక మెదడులోకి చొరబడి మీ ఐడియాల్ని, ఐడియాలజీని దొంగిలించే మనుషులు భవిష్యత్తులో ఉంటారని నమ్మడంలో ఆశ్చర్యం ఏమీ లేదనిపిస్తోంది. అంటే.. ఒక ఐడియా మీ జీవితాన్నే కాదు.. ఎదుటివారి జీవితాన్నీ మార్చివేయొచ్చన్నమాట. ఐడియాల్ని కొట్టేయాలనే ఐడియా మనిషికి వచ్చేసింది. కలల్ని కాజేసే కంప్యూటర్ టెక్నాలజీ దగ్గర్లో ఉంది. మీ మైండ్ లో ఏముందో కనిపెట్టేస్తారు? మీ ఐడియాల్ని కొట్టేస్తారు? మీ కలల్ని ఓ కంప్యూటర్ ట్రేస్ చేస్తుంది. ఇది కల కాదు. ఎదుటివారి కలల్ని కనిపెట్టాలని మనిషి కంటున్న కల. ఇదే నిజమైతే ఇక మీ కలలు పదిలం. గుర్తుండీ గుర్తుండక మిగిలే కలలను ఇక వల వేసి పట్టుకోవచ్చు. అవసరమైతే కంప్యూటర్ హార్డ్ డిస్క్ లో సేవ్ చేసుకోవచ్చు. సినిమాలకు సీక్వెల్ ఉన్నట్లు మీ అందమైన కలలకూ సీక్వెల్ ప్లాన్ చేసుకోవచ్చు. మీ కలలకు ఇక కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం మీరే కావొచ్చు.
బ్రెయిన్ రీడింగ్ టెక్నాలజీ...
జర్మనీలోని మాక్స్ ప్లాక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్రెయిన్ సైన్సెస్ పరిశోధకులు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీల్లో ఏళ్ల పాటు సాగిన రిసెర్చ్ ఇది సాధ్యమేనని చెబుతోంది. అద్భుతమైన బ్రెయిన్ రీడింగ్ టెక్నాలజీని సైంటిస్టులు డెవలప్ చేస్తున్నారు. కలలకు మనం చేసే పనులకు ఎంతో సంబంధం ఉంటుందట. ఎలాంటి కలలు వచ్చాయో చెప్పటమే కాదు. ఆ కలల్ని చదివి సమీప భవిష్యత్తులో మనిషి ఏం చేస్తాడో చెప్పగలిగిన పవర్ ఫుల్ టెక్నిక్ ను సైంటిస్టులు కనుగొన్నారు. ఇందుకోసం హై రెజెల్యూషన్ బ్రెయిన్ స్కాన్స్ వినియోగిస్తారు. బ్రెయిన్ స్కాన్ కోసం సైంటిస్టులు ఫంక్షనల్ మాగ్నిటిక్ ఇమాజింగ్ రిసోనెన్స్(ఎఫ్ఎమ్ఆర్ఐ)గా పిలుస్తున్న ఈ అయస్కాంత క్షేత్రంలో ఓ వ్యక్తిని నిద్రించేట్టు చేస్తారు. గాఢ నిద్రలోకి వెళ్లగానే కలలో విహరిస్తాడు. ఆ సమయంలో మెదడులోని వివిధ భాగాలకు రక్త ప్రసరణ ఎలా అవుతుందో గమనిస్తారు. కలలో ఏవేవో వస్తుంటాయి. ఒక్కో భాగానికి ఒక్కోలా.. మెదడుకు అందే రక్త ప్రసరణలో తేడా ఉంటుంది. ఈ విధానంలో మనిషి కలలు దేనికి సంబంధించినవో తెలుసుకోవచ్చు. కలలో వస్తున్న ఆలోచనలు వాటికి మెదడులో కలుగుతున్న స్పందనలను బట్టి నిద్రావస్థలో కలల గుట్టు విప్పుతామని చెబుతున్నారు.
నేర పరిశోధనలోనూ సరికొత్త విప్లవం...
కలల ఆధారంగా ఒక మనిషి నేర ప్రవృత్తి ఉన్న వాడా కాదా అన్నది కూడా కనిపెట్టొచ్చట. దీని ఆధారంగా నేర పరిశోధనలో సరికొత్త విప్లవం మొదలు కానుంది. మనిషి మెదడుకు అలాంటి పరిమితులు లేవు. నిరంతరం అదొక శక్తివంతమైన కంప్యూటర్ లా పనిచేస్తూనే ఉంటుంది. దాన్ని కంప్యూటర్ల పనితీరుకు అన్వయిస్తే అది కచ్చితంగా ఒక సంచలనమే అవుతుంది. ఈ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్. దీన్ని సాధించేందుకు యూరోపియన్ యూనియన్ 'హ్యూమన్ బ్రెయిన్' ప్రాజెక్ట్ ని ప్రారంభించింది. విశ్వాన్ని జయించగల శక్తి మానవుడికి ఉంది. ఆ శక్తిని సుసాధ్యం చేసింది. జస్ట్.. 1350 గ్రాముల బరువుండే మెదడే! ఆ మానవ సూపర్ కంప్యూటర్ శక్తియుక్తులను తెలుసుకొనేందుకు అమెరికా శాస్త్రవేత్తలు నడుంబిగించారు. ఈ ప్రాజెక్టు కోసం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సుమారు 540 కోట్ల రూపాయలు కేటాయించారు. ఒక వైపు అమెరికా, మరో వైపు యురోపియన్ యూనియన్, ఇంకో వైపు ఏ దేశానికి ఆ దేశం మెదడు మీద పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మెదడు శక్తిని, కంప్యూటర్ యుక్తిని సమన్వయం చేయాలని తహతహలాడుతున్నాయి. ఇదే సాధ్యమైతే ఐడియాల్ని కొట్టేసే రోజు దగ్గర్లోనే ఉందన్నమాట.

No comments:

Post a Comment