Saturday, August 17, 2013

వివాహాల రిజిస్ట్రేషన్ ను తప్పనిసరి...

హైదరాబాద్: భారత సమాజంలో, ఇప్పటి వరకూ పెళ్లి వాటికి సంబంధించిన ఇతర వ్యవహారాలన్నీ ఇప్పటి వరకు ఆయా కుల, మతాల కట్టుబాట్లకు అనుబంధంగానే జరుగుతూ వస్తున్నాయి. కానీ మారుతున్న కాలానికనుగుణంగా, అనేకానేక కారణాల
రీత్యా వైవాహిక జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు ఎదురైనా ఇరుపక్షాల వారికి సౌకర్యంగా ఉండేలా ప్రభుత్వం వివాహాల రిజిస్ట్రేషన్ ను తప్పని సరి చేసింది. వివాహాల రిజిస్ట్రేషన్ ను తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన సవరణ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించింది. అన్ని మతాల వారు తప్పనిసరిగా వివాహాలను రిజిస్టర్ చేయించుకోవాలని బిల్లులో స్పష్టం చేసారు. ప్రస్తుతం జనన, మరణాలను మాత్రమే కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించాలనే నిబంధన ఉంది, ఇప్పుడు వివాహాన్ని కూడా తప్పనిసరి స్తూ ఈ బిల్లు అమలులోకి రానుంది.
హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశమంతటా ఘనంగా జరిగాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన వివిధ కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలు ప్రాంగణంలో రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పెరేడ్ ఆకర్షణీయంగా జరిగింది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చంచల్ గూడ జైలులో నిర్వహించిన పెరేడ్ లో మహిళా పోలీసు బృందం చేసిన విన్యాసాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. సాధారణ విన్యాసాల నుండి అసాధారణ సాహసాల దాకా వారు చేసి చూపిన ప్రదర్శన మహిళల శక్తి సామర్థ్యాలను చాటి చెప్పాయి.
సమస్యలతోనే ముందుకు...
క్రీడాకారులు మంచి ఆహారం తీసుకుంటూ, పుష్టిగా ఉంటారు. పోషకాలున్న పదార్థాలనే తింటూ ఆరోగ్యంగా ఉంటారు అనేది సహజంగా మనకుండే భావన. క్రీడాకారులు పౌష్టికాహారాన్నే తీసుకుంటారనే విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇది అందరి విషయంలో కాదనే కఠోర వాస్తవం ఇటీవలే వెలుగు చూసింది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో భారత కీర్తిని రెపరెపలాడించిన మహిళా హాకీ క్రీడాకారుల విషయంలో నిజం కాదని తెలిసింది.
హాకి ప్రపంచకప్ లో భారత జూనియర్ మహిళల జట్టు కాంస్య పతకం సాధించింది. అయితే ఈ జట్టులో ఏడుగురు అమ్మాయిలు రక్తహీనతతో బాధ పడుతున్నారని సీనియర్ పురుషుల జట్టు మాజీ చీఫ్ కోచ్ మైకెల్ నాబ్స్ వ్యాఖ్యలు చేసారు. రక్తహీనతతో బాధ పడుతున్నప్పటికీ, చక్కటి ప్రతిభ కనబరిచి యూరోపియన్ జట్టుతో పోరాడి విజయం సాధించారని ఆయన వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల్లోని మెజార్టీ మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారనేది మనందరికీ తెలిసిన విషయమే. కానీ పూర్తి ఫిట్ నెస్ ఉంటారనుకునే క్రీడాకారిణులు కూడా రక్తహీనతతో బాధపడుతుండడం విషాదకరం. ప్రభుత్వాలు ఒకటి,రెండు క్రీడలపైనే అతి ప్రేమను, ఇతర క్రీడల పట్ల, క్రీడాకారుల పట్ల, ముఖ్యంగా క్రీడాకారిణుల పట్ల చిన్న చూపు చూడటం దారుణం. పేద క్రీడాకారిణుల ఆర్థిక సమస్యలను తీర్చలేకపోవడం శోచనీయం. ఇకనైనా ప్రభుత్వాలు స్పందించాలని, క్రీడాకారిణుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
'ఆరడుగుల రాకెట్' సింధు...
అంతర్జాతీయ బాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో మొన్నటి దాకా సైనా మాత్రమే ఆశాకిరణం. ఇప్పుడు ఆ వరుసలోకి ఆరడుగుల రాకెట్ రూపంలో పి.వి.సింధు దూసుకొచ్చింది. ప్రపంచ బాడ్మింటన్ షిప్ లో ఫేవరెట్స్ గా బరిలోకి దిగిన ఇతర క్రీడాకారులు ఓటమి చవిచూసినా, తెలుగుతేజం సింధు మాత్రం సంచలనాన్ని నమోదు చేసింది. భారత బాడ్మింటన్ చరిత్రలో చెరగని సంతకం చేసింది. ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్ షిప్ సింగిల్స్ లో పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సాధించింది. 36 నిమిషాల్లో ముగిసిన సెమీస్ లో రట్చనోక్ తో పోటీపడి ఓడినా, కాంస్య పతకాన్ని సాధించుకుంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేందుకు కృషి చేస్తానని పి.వి.సింధు అంటోంది. యువతరానికి ఉత్సాహాన్ని, స్పూర్తిని కలిగిస్తూ సింధు సాధించిన ఈ విజయాన్ని చూసి, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది కోచ్ గోపిచంద్ వల్ల మాత్రమే సాధ్యమైందని అంటున్నారు. ఇక బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సింధుకి అభినందనలు తెలపగా, సహచర ప్లేయర్లు సైనా, జ్వాల, అశ్వినిలు ప్రశంసల వర్షం కురిపించారు. బ్యాడ్మింటన్ లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ దూసుకెళ్తున్న పివి సింధు పేరును సెలక్షన్ కమిటీ అర్జున అవార్డుకు సిఫారసు చేసింది.
అథ్లెటిక్స్ కు గుడ్ బై చెప్పనున్న ఎలెనా ఇసిన్ బయేవా
కెరీర్ లో అత్యంత ప్రతిభను కనబరిచే క్రీడాకారులు ఇక ఆటకు గుడ్ బై చెప్పినప్పుడు, వారి అభిమానులు నిరాశకు గురవుతారు. తిరిగి అంతటి సంచలనాలను రికార్డు చేసే క్రీడాకారులు ఎవరొస్తారా? అని ఎదురుచూస్తారు. ఇప్పుడు అలా అభిమానుల వీడ్కోలు అందుకుంటున్న వరుసలో అథ్లెట్ ఎలెనా ఇసిన్ నిలిచింది. పోల్ వాల్ట్ లో వరల్డ్ రికార్డు నెలకొల్పి ప్రపంచ అథ్లెటిక్స్ లో విశిష్ట స్థానం సాధించిన ఎలెనా ఇసిన్ బయేవా తన కెరీర్ కు గుడ్ బై చెప్పటానికి నిర్ణయించుకుంది. రష్యాకు చెందిన బయేవా ఆల్ టైం గ్రేట్ అథ్లెట్ గా గుర్తింపు పొందడమే కాకుండా ఒలంపిక్స్, ప్రపంచ ఛాంపియన్ షిప్ లో రెండు స్వర్ణాలు, ప్రపంచ అథ్లెటిక్ ఫైనల్స్ లో ఐదు పసిడి పతకాలు సాధించింది. పోల్ వాల్ట్ లో 5.06 మీటర్లతో బయేవా నెలకొల్పిన వరల్డ్ రికార్డును ఇప్పటికీ ఎవరూ అధిగమించలేక పోయారు.
దూసుకొస్తున్న ముస్లిం మహిళలు...
అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు ముందుకు దూసుకుపోతున్నా, వారు నేటికీ సమస్యల వలయాలను ఛేదించాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ముస్లిం దేశాల్లో నేటికీ మహిళల మీద, వారు నిర్వహిస్తున్న విధుల మీద ఏదో ఒక రూపంలో ఆంక్షలు కొనసాగుతున్న స్థితి. ఆ స్థితిని ధైర్యంగా ఎదుర్కున్నారు అక్కడి మహిళలు. ఆప్ఘనిస్తాన్ లోని సర్ ఇ పోల్ ప్రావిన్స్ లో, మహిళల చేత, మహిళల కోసం ఒక రేడియో నిర్వహించడం విశేషం. ఈ రేడియో ప్రజల అభిమానాన్ని కూడా చూరగొంది. అయితే ఈ రేడియో ప్రసారాలను ఈ ఏడాది జూలై నెలలో నిలిపి వేసారు. పోలీసులు డిమాండ్ చేసిన లంచం ఇవ్వటానికి నిరాకరించినందుకు రేడియో ప్రసారాలను ఆటంక పర్చి చివరికి మూసివేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ ప్రమాదాన్ని పసిగట్టిన యాజమాన్యం చొరవతీసుకుని, రేడియో ప్రసారాలు తిరిగి ప్రారంభించుకునేందుకు ప్రయత్నించి, సఫలీకృతమయింది.
అతివలు అన్నిరంగాల్లో అడుగుపెడుతున్నారు. తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నారు. అయినా నేటికీ అన్ని మతాల్లోనూ, ఆధ్యాత్మిక కార్యక్రమ నిర్వహకులుగా మహిళలను దూరంగా ఉంచుతున్న స్థితి. ఈ సనాతన సంప్రదాయాన్ని మార్చేందుకు ఐఎమ్ఐ సంస్థ సభ్యులు సిద్ధమవుతున్నారు . పురుషాధిక్యతా భావజాలం జీర్ణించుకుపోయిన సమాజంలోనే, స్త్రీలు తమ ఉనికిని చాటుకుంటున్నారు. ముఖ్యంగా ముస్లిం దేశాల్లో పిత్రుస్వామిక భావజాలం నుంచి బయట పడేందుకు మహిళలు చేస్తున్న ప్రయత్నాలు అనుకూల ఫలితాలు చూపుతున్నాయి. పురుషులకు మాత్రమే పరిమితమైన మసీదుల్లో నమాజులు, ప్రార్థనలునిర్వహించేందుకు మహిళలు కూడా ముందుకొస్తున్నారు. లండన్ లో ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ఐఎమ్ఐ సభ్యులు ఈ కొత్త పద్ధతికి ‘ఇంక్లూజివ్ మాస్క్ ఇనీషియేటివ్’ అని నామకరణం చేసారు. ఈ విధానంలో స్త్రీ,పురుషులు ఒకే చోట ప్రార్థనలు చేస్తారు.. ఆడామగా కలిసి ప్రార్థనలు చెయ్యకూడదని, ఆడవాళ్లు వాటిని నడిపించకూడదనే నియమం ఖురాన్ లో లేదని నిర్వాహకులు వాదిస్తున్నారు .
మహిళలపై పెరుగుతున్న దాడులు...
చిన్నారులపై, యువతులపై యాసిడ్ దాడులు కేవలం ఏ ఒక్క ప్రాంతానికో, ఏ ఒక్క దేశానికో పరిమితమై లేవు. ఈ దురాగాతలు అన్ని దేశాల్లోనూ విషాన్ని చిమ్ముతున్నాయి. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా యాసిడ్ దాడి ఘటనలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన టాంజానియా దేశంలోని జంజీబర్ పట్టణంలో బ్రిటన్ కు చెందిన ఇద్దరు యువతులపై, గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడి జరిపారు.దాడికి గురయిన ఇద్దరు యువతులు, స్వచ్ఛందంగా జంజీబర్ సిటీలో టీచర్లుగా పనిచేస్తున్నారు. అమ్మాయిలపై యాసిడ్ దాడులు నిత్యకృత్యమవుతున్న స్థితిలో, ప్రపంచ దేశాలన్నీ ఈ విషయంపై సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
'సింధు'పై 'సైనా' విజయం....
ఢిల్లీ లో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ మొదలైంది. గురువారం జరిగిన తొలిమ్యాచ్ లో సైనా, సింధు మధ్య జరిగిన పోరు సర్వత్రా ఉత్కంఠ రేకిత్తించింది. హైదరాబాద్ కు చెందిన ఈ ఇద్దరుబ్యాడ్మింటన్ స్టార్ ల మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు కనువిందు చేసింది. ఈ ఆసక్తికరమైన మ్యాచ్ లో 3 -2 స్కోరుతో సింధుని ఓడించి సైనా విజయాన్ని సొంతం చేసుకుంది.
ట్రెడిషనల్ వేర్ కి ప్రాధాన్యత....
టీనేజ్ పిల్లలు ఎన్ని మోడ్రన్ డ్రస్ లు వేసినా, ఎంత కొత్త ట్రెండ్స్ ఫాలో అయినా ప్రత్యేక సందర్భాల్లో మాత్రం ట్రెడిషనల్ వేర్ కే ప్రాధాన్యతనిస్తుంటారు. ట్రెడిషనల్ వేర్ లో హాఫ్ సారీది ప్రత్యేక స్థానం.
ఆ టేస్టే వేరు...
లంచ్ కి డిన్నర్ కి మధ్య స్నాక్స్ తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది. అయితే ఈ స్నాక్స్ లో మంచి పోషకాలు అందేలా చూసుకోవటం ముఖ్యం. పోషకాలున్న పదార్థాలను రెగ్యులర్ గా తినాలంటే బోర్, కాంబినేషన్మారితే ఆ టేస్టే వేరు. జానకీస్ డైటిప్స్ లో ఆ స్నాక్స్ వివరాలను తెలుసుకోవచ్చు.

No comments:

Post a Comment