Thursday, August 22, 2013

సీట్ల కోసం ప్రజలతో ఆటలొద్దు: రాఘవులు

       
హైదరాబాద్: ఓట్లు, సీట్లకోసం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడొద్దని ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన పార్టీలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు సూచించారు. రాష్ట్ర విభజన సమస్యపై కేంద్రం అఖిలపక్షం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలని డిమాండ్ చేశారు. ఇరు ప్రాంతాల్లో భిన్న వాదనలు వినిపిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్న పార్టీల ముసుగులు తొలగించేలా ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. 'రాష్ట్ర విభజన – సీపీఎం వైఖరి' అన్న అంశంపై 'టెన్ టివి'లో జరిగిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో రాఘవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు, వివిధ పార్టీలు అనుసరిస్తున్న వైఖరి, సీపీఎం విధానం తదితర అంశాలపై స్పష్టమైన వివరాలు వెల్లడించారు. ఆ ఇంటర్వ్యూ పూర్తి వివరాలు....
ప్రశ్న: సమైక్యవాదానికి మొదటి నుంచీ మద్దతు పలుకుతున్న సీపీఎం.. ప్రస్తుత సమైక్యాంధ్ర ఉద్యమంలో ఎందుకు పాల్గొనట్లేదు..?
 జవాబు: ప్రస్తుతం సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమానికి స్పష్టత లేదు. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, టిడిపి, వైసిపి అవకాశ వాద ధోరణితో వ్యవహరిస్తున్నాయి. మొదట విభజనకు అంగీకారం తెలిపిన ఈ పార్టీలు.. ఇప్పుడు సమైక్య రాగం అందుకున్నాయి. టిడిపి ప్రణబ్ ముఖర్జీకీ లేఖ ఇచ్చింది. వైసిపి కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. తీరా నిర్ణయం తీసుకున్న తర్వాత.. సీమాంధ్రలో ఎక్కడ తమకు నష్టం జరుగుతుందోనన్న భయంతో సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్నాయి.
   ప్రశ్న: సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనడానికి సీపీఎంకు ఎదురయ్యే ఇబ్బందులేంటి..?
 జవాబు: తెలంగాణలో విభజనకు మద్దతు తెలిపిన పార్టీలే.. ఇప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీమాంధ్రలో గోల చేస్తున్నాయి. ఇంతకు మించిన అవకాశ వాదం లేదు. ఈ అవకాశవాదులను నమ్మి ప్రజలు,ఉద్యోగ సంఘాల నేతలు ముందుకు సాగుతున్నారు. జెండాలు, అజెండాలు పక్కన పెట్టి ఉద్యమించాలని మళ్లీ వారి వద్దకే వెళ్తున్నారు. ఇలాంటి ఉద్యమంలో పాల్గొంటే.. మేము కూడా ప్రజలను మోసం చేసినట్లే!అలా అని, మేము సమైక్య రాష్ట్రం ప్రయత్నించట్లేదని కాదు. రాజ్యసభలో మా పార్టీ నేత సీతారాం ఏచూరి ఈ విషయంపై సీపీఎం విధానాన్ని స్పష్టం చేశారు. శాసన సభలోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తాం. కానీ..ఇక్కడ ప్రజలు గుర్తించాల్సిన విషయం ఒక్కటే. విభజనకు మద్దతిచ్చిన పార్టీల్లోనే ఉండి, వారి పదవుల్లో కొనసాగుతూ.. మళ్లీ సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్నామనే వారి మోసపూరిత మాటలు నమ్మొద్దు. వారి అవకాశ వాద ధోరణిపై తిరగబడాలి. అదేవిధంగా ప్రజలకు నష్టం కలిగే ఆందోళన మేం కోరుకోవట్లేదు. ఆర్టీసీ సమ్మె వల్ల ఆ భారం మళ్లీ ప్రజలపైనే. ప్రైవేటు బస్సులు మాత్రం జోరుగా తిరుగుతున్నాయి. అదేవిధంగా చదువుల్లోనూ నేతల పిల్లలకు ఇబ్బందుల్లేవు. మళ్లీ సామాన్య విద్యార్థులే అవస్థలు పడుతున్నారు. ఈ విధంగా కొంతకాలం ఉద్యమాన్ని నడిపి, అలిసిపోయిన తర్వాత తమ పనులు చక్కబెట్టుకోవాలనే దురాలోచనలో పార్టీలు ఉన్నాయి. కొన్ని సంఘాలు కూడా ఈ విధంగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణలో విభజన కోసం, సీమాంధ్రలో సమైక్యత కోసం పోరాటం చేస్తున్నట్లు చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నాయి. ఈ విధమైన మోసపూరిత, అవకాశ వాద ఉద్యమాల్లో సీపీఎం పాల్గొనబోదు.
ప్రశ్న: ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాత వ్యతిరేకిస్తున్నారెందుకు..?
 జవాబు: కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. ఫలానా నిర్ణయం తీసుకోబోతున్నామని ఎవ్వరికీ చెప్పలేదు. ఎవ్వరినీ సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకుంది. విభజన వల్ల వచ్చే సమస్యలపై స్పష్టత ఇవ్వలేదు.అందుకే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. అఖిల పక్షం ఏర్పాటు చేసి, అన్ని రకాల సమస్యలపై చర్చించాలి. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మేం డిమాండ్ చేస్తున్నాం.
ప్రశ్న: ఏకపక్షంగా విభజన జరిగిందంటున్న టిడిపి, వైసిపి తీరును ఎలా చూస్తారు..?
 జవాబు: పచ్చి అవకాశ వాదానికి ఇది పరాకాష్ట. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పుడు టిడిపి ఎందుకు స్పష్టత గురించి మాట్లాడలేదు. సమన్యాయం లేదంటున్న వైసిపి నేతలు.. ఏ విషయంలో లేదో చెప్పాలి.ఇక అధికారంలో ఉండి.. తెలంగాణలో ప్రత్యేకం, సీమాంధ్రలో సమైక్యం పాట పాడుతున్న కాంగ్రెస్ తీరు అత్యంత హేయం. ఈ పార్టీల నేతలు తమ వైఖరి స్పష్టం చేయకుండా జనాన్ని అయోమయంలో పడేస్తున్నారు.సమన్యాయం లేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఈ పార్టీల నేతలు మాట్లాడుతున్నారు. అంటే.. సమన్యాయం చేస్తే విభజనకు ఒప్పుకున్నట్లే కదా..! ఇదంతా రాజకీయ అవకాశ వాదం తప్ప మరొకటి కాదు.
ప్రశ్న: సీపీఎం దృష్టిలో ఇరు ప్రాంతాలకూ న్యాయం అంటే ఏంటి..?
 జవాబు: మరోసారి స్పష్టం చేస్తున్నా.. మాది మొదటి నుంచీ సమైక్యవాదమే. అయితే.. తెలంగాణలో ఉన్న సమస్యలు పరిష్కరించకుండా సమైక్యవాదం అనడంలోనూ అర్థం లేదు. నీరు, విద్యుత్, ఉపాధి తదితర సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సీపీఎం మొదటి నుంచీ డిమాండ్ చేస్తోంది. వెనకబడిన ప్రాంతాల్లోని సమస్యలు పరిష్కారమైనప్పుడు మాత్రమే సమైక్యత సాధ్యపడుతుంది.
ప్రశ్న: బెంగాల్ లో గూర్ఖాలాండ్ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే, ఏపీలో విభజనను వ్యతిరేకిస్తున్నారన్న వాదనపై ఏమంటారు..?
 జవాబు: ఇది చాలా తెలివి తక్కువ విమర్శ. మేం 1946 నుంచీ భాషా ప్రయుక్త రాష్ట్రాలకు కట్టుబడి ఉన్నాం. ఆ సంవత్సరంలోనే పుచ్చలపల్లి సుందరయ్యగారు విశాలాంధ్ర పుస్తకాన్ని రాశారు. ఆ సమయంలోనే సమైక్య కేరళ, ఐక్య మహారాష్ట్ర, ఐక్య గుజరాత్ ఉద్యమాలు వచ్చాయి. వీటికి మా మద్దతు ఉంది. గూర్ఖాలాండ్ అంశం ఈ మధ్య వచ్చింది. 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడూ, 1973లో జై ఆంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు కూడా మేం భాషా ప్రయుక్త రాష్ట్రాలకే కట్టుబడి ఉన్నాం. ఇప్పుడూ అదే విధానాన్ని కొనసాగిస్తున్నాం. సమైక్య విధానమే దేశ భద్రతకు మేలు చేస్తుంది. అలాంటి మౌళిక విధానాలనే ప్రాతిపదికగా తీసుకుని ముందుకు సాగుతున్నాం. అప్పుడో మాట.. ఇప్పుడో మాట మాట్లాడడం మా విధానం కాదు. మేము అలాంటి అవకాశ వాదులం అసలే కాదు.
ప్రశ్న: ఇరు ప్రాంతాలకూ ఆమోద యోగ్యమైన పరిష్కారం సాధ్యమవుతుందంటారా..?
 జవాబు: ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరు ప్రాంతాలకు అంగీకారమైన పరిష్కారం సాధ్యం కాదు. విభజిస్తే సీమాంధ్రులకు కోపం. సమైక్యమంటే తెలంగాణ వారికి నచ్చదు. ఏ నిర్ణయం తీసుకున్నా సమస్య తప్పదు. అసలు..కాంగ్రెస్ పాలనలోనే ఈ దుస్థితికి బీజం పడింది. నీటి పంపిణీ సక్రమంగా చేయలేదు. చేసుకున్న ఒప్పందాలను అమలు పర్చలేదు. కేవలం హైదరాబాద్ ను అభివృద్ధి పరిచి, మిగిలిన ప్రాంతాలను వదిలేశారు. ఈ విషయంలో సీపీఎం స్పష్టమైన మార్గదర్శకాలు సూచించింది. ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిన నివేదిక నుంచి ఇప్పటి వరకూ మేము ఇచ్చిన లేఖలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ముందుగా తెలంగాణ ప్రాంత సమస్యలు పరిష్కరించాలని, అక్కడి ప్రజల అవసరాలు గుర్తించాలని చెప్పాం. వెనకబడిన ప్రాంతాల్లో అభివృద్ధికి నిధులు కేటాయించాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, డెవలప్ మెంట్ ప్లాన్ రూపొందించాలని పేర్కొన్నాం.రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటే ఎలాంటి పద్ధతులు పాటించాలో సూచిస్తూ వచ్చాం. కానీ.. కాంగ్రెస్, టిడిపి, వైసిపి.. మిగిలిన పార్టీలేవీ ఈ విషయాలపై మాట్లాడలేదు. ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ పబ్బం గడుపుకున్నాయి. సమస్యను ఇంత వరకూ సాగదీశాయి. రాష్ట్రాన్ని రావణకాష్టం చేశాయి.
ప్రశ్న: ప్రస్తుత ఉద్యమం ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా సాగుతుందన్న అభిప్రాయంపై మీ కామెంట్..?
 
జవాబు: విభజనవాదులకు కావాల్సింది అదే. కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు తిరుపతికి వెళ్లారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్కడి ప్రజలు చెప్పులతో దాడి చేశారు. కేసీఆర్ సైతం పలు మార్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఇరు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, తద్వారా విభజనను సులువు చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీన్ని సమైక్యవాదులు గుర్తించాలి. ఇరు ప్రాంతాల మధ్య సఖ్యత లేకపోతే సమైక్య ఉద్యమానికి బలం లేకుండా పోతుంది.
ప్రశ్న: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వెఖరిని ఎలా అర్థం చేసుకోవాలి..?
 జవాబు: దేశంలోనే అత్యంత అవకాశ వాద పార్టీ ఏదైనా ఉందంటే.. అది కాంగ్రెస్సే! 2009లో తెలంగాణ ప్రకటిస్తున్నట్లు చెప్పారు. మళ్లీ వెనక్కి తీసుకున్నారు. అప్పుడు సీమాంధ్రలోని కాంగ్రెస్ నేతలు బుద్ధిమాటలు చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాన్ని పాటించాలన్నారు. సోనియాను దేవతతో పోల్చారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం హైకమాండ్ ను తిట్టిపోశారు. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. రాష్ట్రాన్ని విభజించడంతో సీమాంధ్రులు అధిష్టానాన్ని లెక్క చేయడం లేదు. అప్పుడు తిట్టిన తెలంగాణ నేతలు ఇప్పుడు అధిష్టానాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ అవకాశవాదాన్ని ప్రజలు గుర్తించాలి.
ప్రశ్న: హైదరాబాద్ అంశంపై మీరేమంటారు..?
 
జవాబు: సమైక్యంగా ఉంటే సమస్య రాదు. ఒక వేళ విభజిస్తే.. హైదరాబాద్ అంశంపై అన్ని ప్రాంతాల వారినీ కూర్చోబెట్టి సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఇక్కడ అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారూ ఉన్నారు.అందుకే కేంద్ర పాలిత ప్రాంతం డిమాండ్ వస్తోంది. అందువల్ల చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమవుతుంది.
ప్రశ్న: నీటి సమస్యను కూడా మరికొందరు ముందుకు తెస్తున్నారు. దీనిపై ఏమంటారు..?
 జవాబు: విభజన అన్నప్పుడు తప్పకుండా సమస్యలు వస్తాయి. ఒక్క నీటి సమస్యే కాదు.. విద్యా సంస్థలన్నీ హైదరాబాద్ లోనే కేంద్రీకృతమయ్యాయి. అందువల్ల విద్య సమస్య కూడా వస్తుంది. అదేవిధంగా ఉద్యోగం,నీటి సమస్య చాలా వస్తాయి. అయితే.. సమస్యలు వస్తాయని చెప్తున్నవారికి ఒక్కటే ప్రశ్న. సమస్యలు లేకుండా విభజనకు అభ్యంతరం లేనట్లేనా..? వారు సమాధానం చెప్పాలి. సమస్యలు వస్తాయని మేము సమైక్య రాష్ట్రం కోరట్లేదు. దేశ సమైక్యతకు భంగం కలగకూడదన్నది మా ప్రధాన ఉద్దేశం. అదేవిధంగా సమైక్యంగా ఉంటేనే వెనకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనేది మా ప్రగాఢ విశ్వాసం.
ప్రశ్న: రాష్ట్ర విభజనకు మద్దతిస్తున్న బిజెపి వైఖరిని ఎలా విశ్లేషిస్తారు..?
 
జవాబు: బిజెపికి నియంతృత్వం కావాలి. ప్రజాస్వామ్యం కన్నా, అధ్యక్ష తరహా పాలనంటే ఆ పార్టీకి ఇష్టం. సమాఖ్య వ్యవస్థ విచ్ఛిన్నం అయితేనే.. దాని కోరిక తీరుతుంది. ప్రస్తుతం దేశంలో బలమైన రాష్ట్రాలు ఉన్నాయి.అందువల్ల దాని లక్ష్యం నెరవేరడం లేదు. అందుకే.. దేశంలో 60 రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇదే జరిగితే.. దేశంలో మతతత్వం పెచ్చరిల్లుతుంది. లౌకిక వాదం దెబ్బ తింటుంది. బిజెపి కోరుకునే మార్పు ఇదే. అందుకే ఆంధ్రప్రదేశ్ ను విభజించాలని గట్టిగా పట్టుబడుతోంది. తద్వారా ఇక్కడ బలపడాలని చూస్తోంది. దీన్ని ఇతర పార్టీలు, విభజన కోరుకునే వారు పట్టించుకోవట్లేదు.
ప్రశ్న: రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని భావిస్తున్నారు..?
 జవాబు: పార్టీలు నిజాయితీతో కూడిన వైఖరి తీసుకుంటే రాష్ట్రం సమైక్యంగా ఉంటుంది. కానీ.. ప్రస్తుతం పార్టీలన్నీ అవకాశ వాదంతోనే ముందుకు సాగుతున్నాయి. దీన్ని ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నా.

No comments:

Post a Comment