మారిన టెక్నాలజీదృష్ట్యా ఇప్పుడు వస్తున్న కొన్ని చిత్రాలు చాలా ప్రయోగాత్మకంగా ఉంటున్నాయి. రొటీన్ కథా చిత్రాలే అయినా వాటికి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి హంగులతో చక్కటి చందమామ కథలా చూపించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకులు. సినిమా సాంకేతిక అంతగా అభివృద్ధి చెందని రోజుల్లోనే మేథస్సుతో
మేలైన చిత్రాలు తీసిన దర్శకులు తెలుగులో ఉన్నారు. కాలక్రమేణా వచ్చిన మార్పులతో ఇంగ్లీషులో వచ్చిన 'అవతార్' ఎంతటి జిమ్మిక్కులు చేసిందో తెలిసిందే. అటువంటి ప్రయోగాన్ని పలువురు ప్రయత్నించారు. తమిళనాడు సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో 'కొచ్చాడియన్' చిత్రం అటువంటిదే. దీనికి అవతార్ టెక్నాలజీ ఉపయోగించారు. అవి ఎలా రూపుదిద్దుకుంటాయో చూద్దాం.
సినీ ప్రేమికులు సినిమాలను థియేటర్లలో చూడటానికి ముందు తమ తమ జేబులు తడుముకుంటున్నారు. అలాంటప్పుడు కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ప్రేక్షకులు థ్రిల్‌కు గురయ్యే సంఘటనలు వుంటేనే సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. అందుకే స్టార్ హీరోలు వున్నా ప్రపంచవ్యాప్తంగా బిజినెస్‌ను సొంతం చేసుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆశ్రయించక తప్పటం లేదు. ఆ తరహాలోనే జేమ్స్ కెమరూన్ అవతార్ సినిమాను మోషన్ క్యాప్చర్ విధానాన్ని ఉపయోగించి అద్భుతం సృష్టించారు. ఇదే క్రమంలో రజనీకాంత్ అవతార్‌ను డ్యూయల్ హీరోగా చేస్తూ తమిళ చారిత్రాత్మక కథతో 'కొచ్చాడియన్' రూపొందుతోంది. ఈ చిత్రానికి సౌందర్య.ఆర్.అశ్విన్ దర్శకులు. కె.ఎస్.రవికుమార్ కథను అందించారు. దీపికా పదుకొనే, శోభన, జాకీష్రాఫ్, నాజర్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. మిగతా పాత్రలు కూడా వారి వారి అవతార్‌లే వుంటాయా లేక బౌతికంగా నటించారా అనేది మాత్రం సినిమా విడుదలయ్యేవరకు వేచి చూడాల్సిందే. రాజీవ్ మీనన్ కెమెరా అందించిన ఈ చిత్రం మోషన్ క్యాప్చర్ పద్దతిలో 3డిలో నిర్మించబడింది. తెలుగులో 'విక్రమసింహా'గా వస్తున్న ఈ చిత్రం హక్కులను లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ చేజిక్కించుకోవడం విశేషం. భారతీయ చరిత్రతో కూడిన పాండ్యరాజు కొచ్చాడియన్ రణధీర్ చుట్టూ అల్లిన కల్పిత కథ ఇది. ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళంలోనే కాకుండా హిందీ, జపనీస్, ఇటాలియన్, స్పానిష్ భాషల్లోకి అనువదిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ లండన్, హాంకాంగ్, లాస్‌ఏంజిల్స్‌లో జరుగుతోంది.
కొచ్చాడియన్‌కు ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం
కొచ్చాడియన్ చిత్రాన్ని భారతీయ చలన చిత్ర చరిత్రలో ఇంతవరకు రానివిధంగా ఫర్ఫార్మెన్స్ క్యాప్చర్ పద్దతిలో నిర్మించారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలిస్తే నటుడిని గ్రీన్ మ్యాట్ ముందు నిలబెట్టి అతనికి కొన్ని పరికరాలు అమర్చి దాదాపు 48 కెమెరాలతో 50 యాంగిల్స్‌లో అతని కదలికలను డిజిటల్‌లో క్యాప్చర్ చేస్తారు. ఆ తర్వాత రజనీకాంత్‌గా రూపొందించిన రజనీకాంత్ అవతార్(ఇమేజ్)కు ఆ కదలికలను మ్యాచ్ చేస్తారు. దీని వలన రజనీకాంత్ బొమ్మ (అవతార్) రజనీకాంత్ ఎక్స్‌ప్రెషన్స్, రజనీకాంత్ బాడీలాంగ్వేజ్, రజనీ స్టైల్స్ లాంటివన్నీ రజనీనే అనుకరిస్తుంది ఆ అవతార్. ఇలాగే మిగతా కేరెక్టర్ల రూపకల్పనకు కూడా ఇదే పద్దతిని ప్రయోగిస్తారు. నటుడి ఎక్స్‌ప్రెషన్స్, చేతి వేళ్ల కదలికలు, లాంటి ప్రతి చిన్న విషయాన్ని మోషన్ క్యాప్చర్ ద్వారా రికార్డు చేసుకోవచ్చు. మోషన్ క్యాప్చర్ నటుని కదలికలను, యాక్షన్‌ను మాత్రమే రికార్డు చేస్తుంది అతని ఫిజికల్ అప్పియరెన్స్‌ను కాదు. గతంలో 'ది లార్డ్ ఆఫ్‌ది రింగ్స్', 'అమెరికన్ పాప్' చిత్రాల్లో రోటో స్కోప్‌ను ఉపయోగించారు. రోటో స్కోప్‌కు అడ్వాన్స్ వెర్షనే మోషన్ క్యాప్చర్. దీన్ని ఉపయోగించడానికి సపరేటు సాప్ట్‌వేర్ కావలసి వుంటుంది. చిన్న సంస్థలు ఇలాంటి సినిమాలు నిర్మించడం చాలా కష్టం.ఈ టెక్నాలజీ గురించి 'జీన్స్' సినిమాలో శంకర్ ఒక పాత్ర పరంగా చూపించారు కూడా. జీన్స్‌లో 'కన్నులతో చూసేది గురువా...' అనే పాటలో రాజు సుందరం కొన్ని పరికరాలు అమర్చుకొని ప్లే చేస్తుంటే ఐశ్వర్యరారు అవతార్ స్టేజ్‌పై డాన్స్ చేస్తున్న విషయాన్ని మనం పరిశీలించవచ్చు. .
ఫేసియల్ మోషన్ క్యాప్చర్:
'ఒక నటుడి హావభావాలను డిజిటల్‌లోకి మార్చడాన్ని ఉపయోగించే పద్దతే ఫేసియల్ మోషన్ క్యాప్చర్ విధానం. దీని వలన నూరు శాతం ఎక్స్‌ప్రెషన్స్ పొందవచ్చు. దీన్ని కంప్యూటర్ గ్రాఫిక్స్‌లో మల్టీ యాంగిల్స్‌లో పొందవచ్చు. 900 మంది నిపుణులు అవతార్ కోసం పనిచేశారు. 'అవతార్', 'ది అడ్వంచర్ ఆప్ టిన్ టిన్' చిత్రాలను నిర్మించిన ఫర్‌ఫార్మెన్స్ క్యాప్చర్ పద్దతిలో కొచ్చాడియన్ చిత్రాన్ని కూడా నిర్మించారు. ఈ చిత్రం జనవరి 15న ప్రారంభమైంది. ఈ చిత్రం కోసం ముందు రజనీకాంత్ బాడీకి సంబంధించిన బాడీ లాంగ్వేజ్, ఫర్ఫార్మెన్స్‌లను మోషన్ క్యాప్చర్ ద్వారా రికార్డ్ చేశాం. ఈ చిత్రంలో రజనీకాంత్ హెయిర్ స్టైల్ గతంలో చేసిన దళపతి కంటే చాలా బాగుంటుంది' అని కే.ఎస్. రవికుమార్ చెప్పారు. రెండో షెడ్యూల్‌ను తిరువనంతపురం చిత్రాంజలిలో, విస్మయాస్ మ్యాక్‌లో చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని రూపొందించడానికి 48 కెమెరాలను ఉపయోగించారు. ఫర్ఫార్మెన్స్ క్యాప్చర్ చేయడానికి 48 యాంగిల్స్‌లో చిత్రీకరించారు. ఆరో 3డి సౌండ్ టెక్నాలజీతో రూపొందుతున్న మూడో భారతీయచిత్రం. ఈ చిత్రం కోసం నాలుగు గ్రాఫిక్ టీమ్స్, చెన్నై నుండి లండన్ వరకు పాల్గొన్నారు. దీపికాపదుకొనే తన సొంత గాత్రంతోనే డబ్బింగ్ చెప్పుకుందని వార్తలు వచ్చాయి కానీ తర్వాత ఆమె హిందీ వెర్షన్‌కు మాత్రమే చెప్పిందని తెలిసింది. ఈ సినిమాలో సముద్రం మధ్యలో రజనీకాంత్ డాల్ఫిన్స్‌తో చేసే ఫైట్ అద్భుతంగా వుంటుందని చిత్ర యూనిట్ తెలిపారు.
కొచ్చాడియన్ బిజినెస్: నిర్మాతలు కార్బన్ మొబైల్స్‌తో బిజినెస్ డీల్ చేసుకున్నారు. కొచ్చాడిన్ స్క్రీన్‌సేవర్స్, సిగేచర్ మ్యూజిక్, మొబైల్ బ్యాక్‌లో రజనీకాంత్ సిగేచర్. ట్రైలర్స్, మేకింగ్ సి.డి.ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో రజనీకాంత్ వాయిస్‌ను వాడుకుంటారు. ఏ. ఆర్. రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రం కోసం వైరముత్తు రాసిన ఫిలాసఫీ థీమ్ సాంగ్‌ను రజనీకాంత్ ఆలపించారని వార్తలు వస్తున్నాయి.ఈ పాటకు సంబంధించి 200 ట్రాక్స్‌తో వున్న ఆర్గెస్ట్రాను హాలీవుడ్ సౌండ్ ఇంజనీర్ జియోఫ్ ఫాస్టర్ మిక్స్ చేశారని తెలిసింది. ఈ సినిమాకు సంబంధించి యు.ఎస్.ఎ. థియేటరికల్ రైట్స్ అటోమస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, తెలుగు రైట్స్‌ను లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ పొందారు. భారీ ఫ్యాన్సీ రేట్లకు జయ టి.వి. శాటిలైట్ రైట్స్ కొన్నట్లు సమాచారం.

No comments:
Post a Comment