సినిమాలకి సామాజిక ప్రయోజనం ఉండాలని నమ్మే దర్శకుడు 'సునీల్ కుమార్ రెడ్డి'. అదే బాధ్యతతో తీసిన సినిమా 'వెయిటింగ్ ఫర్ యు'. 'ఒక రొమాంటిక్ క్రెమ్ కథ' ఆయన దర్శకత్వంలో యూత్ కి నెగటివ్ మెసేజ్ ఇస్తూ.. కమర్షియల్ సక్సెస్ సాధించిన తర్వాత 'వెయిటింగ్ ఫర్ యు'తో యూత్ కే కాకుండా రాజకీయ విమర్శకులకు దగ్గరవ్వాలని వచ్చారు. గాయత్రి, రవి, సాయి అనిల్, సోని చరిష్టా, ఎల్బీ శ్రీరామ్ ముఖ్య తారలుగా 'శ్రావ్య ఫిలిమ్స్' పతాకంపై 'సుఖీభవ సమర్పణ'లో యక్కలి రవీంద్ర బాబు నిర్మించిన 'వెయిటింగ్ ఫర్ యు' చిత్రం శుక్రవారం రిలీజయ్యింది..
కథ: అంబులెన్స్ సర్వీసెస్ లో ఉద్యోగం చేస్తూ ఆపదలో వుండే వారి ప్రాణాలను కాపాడాలని తాపత్రయ పడుతుంటాడు దేవా(రవి). అతని, హీరోయిన్ స్వప్న(గాయత్రి) మధ్య జరిగే సంఘటనలే ఈ సినిమా. ఒక బాంబ్ బ్లాస్ట్ ప్రమాదంలో స్వప్న తండ్రి గాయపడి మరణిస్తాడు. ఆ సమయంలో తండ్రి కోసం ఆసుపత్రికి వచ్చిన స్వప్న, దేవాకు పరిచయం అవుతుంది. దిక్కులేని స్థితిలో ఉన్న స్వప్నకు దేవా ఆప్తబంధువుగా మారుతాడు.. అలా వారి మధ్య ప్రేమ ఏర్పడుతుంది. ఆ తర్వాత క్రమంలో దేవా ఓ వ్యక్తి(షఫీ)ని కాపాడబోయి గాయపడతాడు. దీంతో స్వప్న తన కోసం ఈ ఉద్యోగాన్ని వదిలేయమంటుంది. ప్రతిక్షణం ప్రాణా పాయ పరిస్థితుల్లో బతికే జీవితం వద్దు అంటుంది. కానీ వృత్తిని ప్రేమించే వ్యక్తిగా దేవా ఆ పని చేయడు. అలా అతన్ని విడిచి వెళ్లిపోతుంది స్వప్న. మళ్లీ వారు కలుస్తారా .. ? చివరకు ఏమవుతుందనేది మిగిలిన కథ.
రివ్యూ: 'వెయిటింగ్ ఫర్ యు'. 'ఒక పెళ్ళి కాని అమ్మాయి ప్రేమ కథ' అనే ట్యాగ్ లైన్ చూసి సినిమా కి వెళ్తే కాస్త డిజప్పాయింట్ కావాల్సిందే.. ఎందుకంటే ఇది ప్రేమ కథ మాత్రమే కాదు. ఆపదలో వుండే వారిని ఆదుకునే అంబులెన్స్ సర్వీసెస్ వారి భావోద్వేగాల సమ్మేళనం.. ప్రాణం విలువ తెలిసిన మనిషి పడే తపన.. ఆ ప్రాణం కాపాడటం కోసం తన వారిని, ప్రేమను సైతం వదులుకొనే త్యాగం .. వంటి మానవీయ కోణాలను సృశిస్తూ సాగుతుంటుంది. మన వ్యవస్థలో వుండే అసమానతలు, రాజకీయ నాయకుల స్వార్ధాలు.. నేతలు, ఓట్ల రాజకీయం కోసం పార్టీలు చేసే తన్నులాటలో బలౌవుతున్న సామాన్య ప్రాణాల ఆత్మ ఘోషను తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు. బడా బాబుల స్వార్థ ప్రయోజనాల కోసం మనం ఎందుకు చస్తున్నామో తెలియని అమాయకుల కన్నీళ్లను దర్శకుడు సునీల్ తెరపై చూపించాడు. పంచ్ డైలాగ్స్ కోసం పాకులాడకుండా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా మాటలు ఉన్నాయి. ఎన్నో మాటలు మనలను ప్రశ్నిస్తాయి, నిలదీస్తాయి.
ప్లస్, మైనస్ లు: దర్శకునికి ప్రేమకథ కంటే సమాజంపైనే ప్రేమ ఎక్కువగా కనిపిస్తుంది. పాటలు బాగున్నాయి. దేవా పాత్ర ధారి నటన పాత్రోచితంగా సాగింది. రఘుబాబు తనకు అలవాటయిన నటనను అలవోకగా పలికించాడు. సినిమాకు ప్రధానాకర్షణ ఎల్.బి. శ్రీరామ్ అని చెప్పోచ్చు. ఆయన ఉన్నంత సేపు డైలాగ్స్ చాలా బాగుంటాయి . ప్రతి మాట మెసేజ్ ఇచ్చేదిగా ఉంటుంది. ఒక రకంగా ఆయన తన పాత్రలో జీవించాడని చెప్పవచ్చు. కానీ ఇబ్బంది ఏమిటంటే ఒక సమస్యను తీసుకోకుండా అనేక సమస్యలు తీసుకోవడంతో సినిమా న్యూస్ బులెటెన్ లా తయారయ్యింది. దీంతో ప్రేక్షకులు కొంత అసహనానికి గురవుతారు.. ప్రేమ కథ అనుకొని సినిమా కి వస్తే మాత్రం నిరాశ పడాల్సిందే. ఇంటర్వెల్ లో కట్ అయిన హీరోయిన్ పాత్ర క్లైమాక్స్ వరకూ రహస్యంగా వుంచాడు దర్శకుడు. ఇది ప్రేక్షకులకు అసంతృప్తికి కారణమైంది. కొని అనవసర సన్నివేశాలు ఉన్నట్లు కనిపిస్తాయి. అసలు సినిమాలో కీలక పాత్ర ఎంటనేది ప్రశ్నగా మారింది. ఎంటర్ టైన్ మెంట్ కంటే సమాజం మీద వున్న కమిట్ మెంటే సినిమా ని డామినేట్ చేసింది.. అయితే దర్శకుడు సినిమాను ప్రేమ కథగా తీయాలా.. మెసేజ్ ఇవ్వాలా.. లేక మాస్ గా ఉండాలా అనే కన్ఫ్యూజన్ సినిమాలో కనిపిస్తుంది. మొత్తానికి 'వెయిటింగ్ ఫర్ యు' అనేది ఆపదలో వున్న వారు చూసే ఎమెర్జెన్సీ సర్వీస్ అనిచెప్పవచ్చు. ఇక సినిమాకు '10టివి' ఇచ్చే రేటింగ్.. 1.5/5.

No comments:
Post a Comment