Wednesday, August 7, 2013

ఆమోదయోగ్య నిర్ణయం తీసుకోవాలి


హైదరాబాద్: కాంగ్రెస్ విభజన ప్రకటన అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని టెన్ టివి చర్చా కార్యక్రమంలో
పాల్గొన్న పలువురు రాజకీయ, ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ గతంలోనే రాష్ట్ర విభజనపై ప్రకటన చేసి వెనక్కు తగ్గిందని చర్చలో పాల్గొన్న రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. ఆయా పార్టీల నేతలు పార్టీలో విభజనపై చర్చించకుండా రాజీనామాలు ఇచ్చి ఇరు ప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు ఆడుతున్న క్రీడలో ఉద్యోగులు సమిధలు అవుతున్నారని అన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు రాజీనామాలు సమర్పించిన ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులకు మద్దతు పలుకుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా తన పాత్రను పోషిండచంలో విఫలమైంది కాబట్టే రాష్ట్రంలో ఆందోళనకర పరిస్ధితులు ఏర్పడ్డాయని అన్నారు. హైలెవల్ కమిటీ పేరుతో విభజన నిర్ణయాన్ని వాయిదావేసే అవకాశం కనిపిస్తోందని చెప్పారు. ఏదిఏమైనా కాంగ్రెస్ పార్టీ ఇరు ప్రాంతాల ప్రజలలో నెలకొన్న సందేహాలను తీర్చాల్సిన అవసరముందన్నారు. ఇరు ప్రాంతాలలో సహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పేందుకు ఉద్యోగులు, నేతలు చొరవ చూపాలని కోరారు.

శాస్త్రీయత లేని నిర్ణయం...
తెలంగాణ ఏర్పాటు ప్రకటన కేవలం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం మాత్రమే నని చర్చలో పాల్గొన్న ఎపిఎన్జీవో నేత బాపిరాజు అన్నారు. సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు, ప్రజలు, నాయకులుతో ఎటువంటి చర్చలు,సంప్రదింపులు జరపకుండా కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని అన్నారు. కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం కాంగ్రెస్ ఈ నిర్ణయాన్ని తీసుకుందన్నారు. విభజన వల్ల హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు,పెన్షనర్లు నష్టపోయే ప్రమాదముందని అన్నారు. విభజన ప్రకటన శాస్త్రీయంగా లేదని చెప్పారు. విభజన పర్యవసానాలు నష్టదాయకంగా ఉంటాయని తెలిపారు. సిడబ్యూసి నిర్ణయాన్ని వెనక్కి తీసకునే వరకు తాము పోరాటం చేస్తామని అన్నారు. విభజన అనంతరం వచ్చే పరిణామాలపై తమకు ఉన్న అనుమానాలను తీర్చాలని డిమాండ్ చేశారు.
సీమాంధ్ర ఉద్యోగులకు ఆప్షన్స్...
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులకు ఆప్షన్స్ ఉంటాయని చర్చలో పాల్గొన్న టిఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలపై తాము గతంలో అనేక సార్లు పోరాడామని ఆ దిశలోనే 610 జివో సాధించుకున్నామని చెప్పారు. ఉద్యోగాల విషయంలో ఈ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ తాము గతంలో అనేక ఉద్యమాలు చేశామని అన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండే రానున్న పదేళ్లలో సీమాంధ్ర ఉద్యోగులు నిర్భయంగా విధులు నిర్వహించుకోవచ్చని అన్నారు. అయితే రానున్న పదేళ్లలో ఈ ప్రాంతంలో ఎక్కువ మంది సీమాంధ్ర ఉద్యోగులు పదవీవిరమణ పొందనున్నారని చెప్పారు. అందుకే విభజన వల్ల సమస్యలు వస్తాయని తాను భావించడంలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మరోమారు కాలయాపన చేసేందకే హైలెవల్ కమిటీని నియమించిందనే అనుమానాలు కల్గుతున్నాయన్నారు. ఇరు ప్రాంతాల ఉద్యోగులు, ప్రజల మధ్య సహృద్భావ వాతావరణం నెలకొనేలా అందరూ కృషిచేయాలని కోరారు.
చారిత్రక తప్పిదం...
రాష్ట్ర విభనపై కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన చేయడం చారిత్రక తప్పిదమని చర్చలో పాల్గొన్న ఆ పార్టీ నేత తులసీ రెడ్డి అన్నారు. విభజన ప్రకటన కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రకటన మాత్రమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ
రాష్ట్ర విభజనపై ఉన్నత స్ధాయి కమిటీ నియమించినందున తన రాజీనామాను వెనక్కి తీసకునే ప్రసక్తి లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని హైలెవల్ కమిటీని నియమిస్తే ఆ కమిటీకి విశ్వసనీయత ఉంటుందన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజీనామాలనేవి ప్రజా ప్రతినిధులకున్న బ్రహ్మాస్త్రాలని చెప్పారు. క్షేత్ర స్ధాయిలో ఉండే ప్రజలు చేస్తున్న నిరసనల వల్లే కాంగ్రెస్ ఈ కమిటీ వేసిందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే అన్ని సమస్యలకు పరిష్కారమని అన్నారు.

videos చూడగలరు:http://youtu.be/Pgg0DeYJ-VI

No comments:

Post a Comment