Wednesday, August 7, 2013

'కమిటీ' ఉత్తదే..


హైదరాబాద్:  కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీపై ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలే పెదవి విరుస్తున్నాయి. కమిటీ అభిప్రాయాలు తెలుసుకున్నాక విభజనపై
పునరాలోచన చేస్తారో లేదో చెప్పాల్సి ఉందని నాయకులంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కమిటీతో ఒరిగేదేమీ ఉండదని, అదంతా ఉత్తదే అని నేతలు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఇరు ప్రాంతాలకు న్యాయం జరగాలంటే దేశంలోని ప్రధాన పార్టీల నుంచి సభ్యులను ఎంపిక చేసి కమిటీని ఏర్పాటు చేయాలని, అప్పుడే న్యాయం జరుగుతుందని సుజనా చౌదరి, టీడీపీ ఎంపీ అభిప్రాయపడ్డారు. వైసిపి కూడా హైలెవల్‌ కమిటీపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. గతంలో కేంద్రప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణకమిటీ ఏమైందో అందరికీ తెలుసని ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. కమిటీలోని సభ్యులందరూ సోనియాని చూసి భయపడేవాళ్లే తప్ప ఎదిరించేవాళ్లు లేరని అన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, సిడబ్ల్యుసి సభ్యుడు ఆంటోని ఛైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో సోనియా రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జి అహ్మద్‌పటేల్‌, కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌ సింగ్‌, మాజీ ఇన్‌చార్జి వీరప్పమెయిలీ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రకటన వెలువడిన కొద్ది సేపటి తర్వాతే దిగ్విజయ్‌ సింగ్‌ కమిటీ పని తీరుపై కొంత క్లారిటీ ఇచ్చారు. సీమాంధ్రలో ఆందోళనలు చేస్తున్న ఉద్యోగులు,ఎన్జీవోలు, విద్యార్థులు, రాజకీయ నేతలు,.. ఇలా ఒకరేమిటీ అందరి వాదనలు, అభిప్రాయాలను హైలెవల్‌ కమిటీ తెలుసుకుంటుందని ఆయన ప్రకటించారు. హైలెవల్‌ కమిటీ ఎవరి అభిప్రాయాలు తీసుకుంటుందో క్లారిటీ ఇచ్చిన... దిగ్విజయ్‌ ఎప్పటి వరకు అభిప్రాయాలు తీసుకుంటారు..అప్పటి వరకు తెలంగాణ ప్రక్రియ కొనసాగుతుందా? లేదా? అన్న స్పష్టత మాత్రం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎంపీలు చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. హైలెవల్‌ కమిటీ అభిప్రాయాలు తెలుసుకునే వరకు తెలంగాణ ప్రక్రియ ఆగిపోతుందని లగడపాటి వ్యాఖ్యానించారు. కమిటీ నివేదిక తర్వాతే నిర్ణయం ఉంటుందని కేంద్ర మంత్రులు చెబుతున్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేసి రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నం చేయోద్దని కాంగ్రెస్‌ పార్టీని టిఆర్‌ఎస్‌ హెచ్చరించింది. పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టాలని టీఆర్‌ఎస్‌ నేత కోరుట్ల విద్యాసాగర్‌రావు డిమాండ్‌ చేశారు. ఏఐసిసి ప్రకటన, దిగ్విజయ్‌ సింగ్‌, కాంగ్రెస్‌ సీమాంధ్ర ఎంపీల వ్యాఖ్యలు, విపక్షాల విమర్శలు మరోసారి అనుమానాలను పెంచే విధంగా ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

No comments:

Post a Comment