Tuesday, August 13, 2013

ఆంటోని కమిటి కసరత్తు షురూ

న్యూఢిల్లీ : సీమాంధ్రలో ఆందోళనలు, పార్లమెంట్‌లో ఎంపీల నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఏఐసిసి నియమించిన ఆంటోని కమిటీ పని ప్రారంభమైంది. కీలక అంశాలపై సమాలోచనలు జరిపే కాంగ్రెస్‌ పార్టీ వార్‌ రూమ్‌లో
ఆంటోని కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆంటోని, దిగ్విజయ్, అహ్మద్‌పటేల్‌, వీరప్పమెయిలీలు హాజరయ్యారు. అనంతరం దిగ్విజయ్ విలేకరులతో మాట్లాడారు. సీనియర్ మంత్రులంతా పార్లమెంటు సమావేశాల్లో బిజీగా ఉన్నారు..అందువల్ల ఆంటోని కమిటి హైదరాబాద్ వెళ్లడం వీలుకాదు అని స్పష్టం చేశారు. తెలంగాణపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వెళ్లేదిలేదని దిగ్విజయ్‌ మరోసారి కుండబద్దలు కొట్టారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొన్నారు. అయితే ఈ ప్రక్రియ పూర్తికావడానికి ఎంతకాలం పడుతుందనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్ర విభజనకు సంబంధించి సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు లేవనెత్తుతున్న అభ్యంతరాలను వినేందుకు ఆంటోని కమిటి సమావేశం అయిందని తెలిపారు. ఈ సమావేశాలు మరో రెండు రోజులు కొనసాగుతాయన్నారు. దీనికి కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులను కూడా ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం 19,20 తేదీల్లోనూ భేటీ అయి చర్చిస్తామని వివరించారు. ఆంటోని కమిటీకి తమ సమస్యలను తెలపాలని అనుకుంటున్నవారు ముందుగా పీసీసీ అధ్యక్షుడికి సమాచారం ఇవ్వాలని వివరించారు. దాన్ని బట్టి కమిటీతో వారి సమావేశాల షెడ్యూలును ఖరారు చేస్తామని తెలిపారు. ఎపీఎన్జీవోలు వెంటనే సమ్మె విరమించి కమిటీ ముందుకు రావాలన్నారు. 

No comments:

Post a Comment