Wednesday, August 28, 2013

టాలీవుడ్ లో భారీ 'బడ్జెట్' చిత్రాలు..


తెలుగు ఇండస్ట్రీ తన మార్కెట్ ను విస్తరించుకుంటుంది. ప్రపంచీకరణలో భాగంగా ఇతర వ్యాపారాలు విస్తరించుకున్నట్లు గానే సినిమాలు కూడా మార్కెట్ ను విస్తరించుకుంటున్నాయి. దీనిలో భాగంగా సినిమా బడ్జెట్లు ఒక రేంజ్ లో పెరుగుతున్నాయి. అంతకు ముందు హీరోలకు వచ్చిన కలెక్షన్లను దృష్టిలో పెట్టుకొని సినిమా నిర్మించడం ఒక ఎత్తు అయితే.. ఆ హీరో మార్కెట్ ను పెంచడానికి భారీ బడ్జెట్ తో సినిమాలు నిర్మించడం మరో ఎత్తు. ఇలా ప్రస్తుతం టాలీవుడ్ లో దాదాపు అన్నీ సినిమాలు భారీ బడ్జెట్ తోనే వస్తున్నాయి. సాధారణంగా బాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో సినిమాలు నిర్మిస్తుంటారు. అదే బాటలో ఇప్పుడు మన టాలీవుడ్ కూడా పయనిస్తూ.. బాలీవుడ్ కే గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది.
             గతంలో తెలుగు ఇండస్ట్రీలోని చిత్రాలను చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మించే వారు. బడ్జెట్ తక్కువ ఉండడం వల్ల ఆ సినిమా యావరేజ్ గా ఉన్న నిర్మాణ ఖర్చు కంటే ఎక్కువ కలెక్షన్లు వచ్చేవి. దీని వల్ల ఎవరికి నష్టం ఉండేది కాదు. కానీ ప్రస్తుతం స్టార్ హీరోలతో నిర్మించే సినిమా బడ్జెట్ ను అంచనా వేయడమే కష్టంగా మారింది. మొదట ఒక చిత్రం తీయాలని అనుకుంటే కొంత బడ్జెట్ ను నిర్ణయిస్తారు. కానీ అది నిర్మాణంలోకి వెళ్లాక ఖర్చు ఎంత పెరుగుతుందో అటు దర్శకులకూ.. ఇటు నిర్మాతలకు అర్థకాకుండా మారిపోయాయి. కథలో దమ్ములేని చిత్రాలను కూడా కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నారు. దీంతో వాటికి సరైన కలెక్షన్లు రాకా అటు దర్శకులు, ఇటు నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శక్తి, షాడో, బద్రీనాథ్, వంటి సినిమాలు ఈకోవలోకే వస్తాయి. ఒకానొక సందర్భంలో నిర్మాతలు తమ ఆస్తులు అమ్ముకొనే పరిస్థితి మన సినీ ఇండస్ట్రీలో కనిపిస్తోంది.
            ఇండస్ట్రీలో హీరో మార్కెట్ ను చూడకుండా, సినిమాలో దమ్ములేకుండా సినిమాలు తీయడం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది. అయితే టాలీవుడ్ లో ప్రస్తుతం దాదాపు అన్నీ సినిమాలు భారీ బడ్జెట్ తోనే వస్తోన్నాయి. ఆ సినిమాలు ఎంటీ..?, ఆ హీరోల మార్కెట్ ఎంత..? అనేది మన ట్రెండ్ గురులో చూద్దాం..
భారీ బడ్జెట్ చిత్రాలు... బాహుబలి-రూ.150 కోట్లు?
          ప్రస్తుతం మన టాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న చిత్రం 'బాహుబలి'. ఈ చిత్ర నిర్మాణం కాకముందే బడ్జెట్ భారీగా వినిపిస్తోంది. మొదట రూ.100కోట్ల బడ్జెట్ నిర్మాణం ప్రారంభించిన 'బాహుబలి'.. ఇప్పుడు సుమారు రూ. 150కోట్ల బడ్జెట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈసినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహిస్తుండడంతో ఖర్చు తగ్గ ఫలితం వస్తుందన్న నమ్మకంలో ఆ చిత్ర బృందం ఉంది. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం కథ ఎక్కువగా ఉండడంతో రెండు పార్ట్ లుగా తీయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు సమాచారం. సో బాహుబలి బలం 150కోట్లు అన్నమాట.
మహేష్ 'వన్'-రూ. 70కోట్లు..
     'సుకుమార్, మహేశ్' కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'వన్'(నెం1..నేనొక్కడినే). ఈ సినమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. 'హై ఎక్స్ పెక్టేషన్స్' తో వస్తున్న ఈ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ కూడా హైలెవల్లోనే ఉంది. ఈ చిత్రం రూ.70కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే మాటల్లేకుండా రిలీజ్ చేసిన రెండు టీజర్లు హిట్ అవడంతో సినిమా భారీ హిట్ అవుతుందన్న నమ్మకంలో చిత్ర యూనిట్ ఉంది.
'పవన్' అత్తారింటికి దారేది..రూ.60కోట్లు..
        ఇక టాలీవుడ్ ఎక్జైటింగ్ గా వెయిట్ చేస్తున్న సినిమా 'అత్తారింటికి దారేది'. ట్రైలర్స్, టీజర్స్ తో హిట్ కొట్టిన ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టాలని ఫిక్స్ అయ్యింది. ఈ చిత్రం త్రివిక్రమ్, పవన్ కళ్యాన్ కాంబినేషన్లో రూ.60కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ఇప్పటి వరకు పవర్ స్టార్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా ఈ' అత్తారింటికి దారేది' చిత్రం నిలిచింది. పవన్ ఫ్యాన్స్ ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో ఎదురుచూస్తున్న ఈ సినమా రిలీజ్ పోస్ట్ పోన్ అయినా, సినిమా పై హైప్ ఏ మాత్రం తగ్గలేదు. సినిమా బడ్జెట్ లాగే కలెక్షన్లు కూడా భారీగా ఉంటాయని అంటోంది అత్తారింటికి దారేది టీం. కానీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యి వాయిదా పడ్డ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కాలేకపోయాయి. దీంతో అత్తారింటికి దారేది కూడా సేమ్ సీన్ ని రిపీట్ చేస్తుందా? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
చరణ్ 'ఎవడు, జంజీర్'-రూ.50కోట్లు...
          రామ్ చరణ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వస్తోన్న మరో చిత్రం 'ఎవడు'. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాణ బడ్జెట్ రూ. 50కోట్లు. మరి ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డా.. ఈసినిమా బడ్జెట్ కంటే డబుల్ వసూలు చేస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. ఇదే బాటలో చరణ్ నటించిన మరో చిత్రం జంజీర్. బాలీవుడ్ రీమేక్ అయిన ఈసినిమా తెలుగులో 'తుఫాన్' గా రిలీజ్ అవుతుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల తుఫాన్ కురిపిస్తుందా..? అనేది ప్రశ్న.
ఎన్టీఆర్ 'రామయ్యా'-రూ.50...
        ఇక రూ. 50కోట్ల బడ్జెట్ తో మరో రెండు సినిమాలు వస్తున్నాయి. వాటిలో హరీష్ శంకర్ , ఎన్టీఆర్ కాంబినేషన్ లో 'రామయ్యా వస్తావయ్యా' సినిమా వస్తోంది. రెండేళ్లుగా సరైన హిట్ లేక డీలా పడ్డ యంగ్ టైగర్ కు 'రామయ్యా వస్తావయ్యా'తో బాక్సాఫీస్ ని షేక్ చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. దీనితో పాటు గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క కీలక పాత్రలో నటిస్తున్న 'రుద్రమదేవి' కూడా రు. 50కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అయితే ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేస్తాయా..? లేక చతికలబడతాయా..? తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

No comments:

Post a Comment