Thursday, August 1, 2013

శోభాడే క్షమాపణలు చెప్పాలి - శివసేన


ముంబయి:   ప్రముఖ రచయిత 'శోభాడే' చేసిన ట్వీట్స్ పై నాయకులు మండి పడుతున్నారు.  గురువారం శోభాడే నివాసం ఎదుట శివసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. వెంటనే క్షమాపణలు
చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసినట్లు మహరాష్ట్ర నుండి ముంబాయిను వేరు చేయాలని శోభాడే ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై శివసేన కార్యకర్తలు భగ్గుమంటున్నారు. శోభాడే చేసిన ట్వీట్‌పై శివసేన,మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన పార్టీల నేతలు ఉద్దవ్‌ థాకరే, రాజ్‌ థాకరేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగిన మైకంలో ట్వీట్ చేసి ఉండవచ్చని శివసేన ఘాటుగా స్పందించింది. శోభాడే వ్యాఖ్యలపై తాము కేసు పెడతామన్నారు. మహారాష్ట్ర గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించే వారికి తమదైన శైలిలో సమాధానం చెబుతామని శివసేన అధికార ప్రతినిధి సంజయ్‌ రావత్‌ హెచ్చరించారు. రాష్ట్రాన్ని విభజించడమంటే భర్త నుంచి విడాకులు తీసుకున్నంత సులభం కాదు..ఆ విషయాన్ని శోభాడే తెలుసుకోవాల్సిన అవసరం ఉందని రాజ్ థాకరే తెలిపారు.
శోభాడే వివరణ : ఆ తర్వాత తన వ్యాఖ్యలపై శోభాడే వివరణ ఇచ్చుకున్నారు. తాను సరదాగా వ్యాఖ్యానించానని..ముంబాయిని విడదీయమని ఎక్కడా చెప్పలేదని శోభా డే తెలిపారు. దేశంలో ఆ మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛ ఉందన్నారు. ఎన్నికల కోసం..స్వార్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రయోజనాలను పొందుతారోననే విషయాన్ని తెలుపాలన్నదే తన ఉద్దేశమని శోభాడే పేర్కొన్నారు. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని శోభాడే తేల్చిచెప్పారు. 

No comments:

Post a Comment