Thursday, August 1, 2013

ఆర్టిఐ పరిధినుండి రాజకీయపార్టీలకు మినహాయింపు

హైదరాబాద్ : గత జూన్ నెలలో రాజకీయ పార్టీలు సమాచార హక్కు పరిధిలోకి వస్తాయని కేంద్ర సమాచార కమిషన్ సంచలన తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం
ఈ చట్టం పరిధి నుండి రాజకీయ పార్టీలకు మినహాయింపు ఇచ్చింది. దీంతో కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాలను కేంద్రం తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. కాగా, అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేబినెట్ పేర్కొంది.
2005లో సమాచార హక్కు చట్టం
 
ప్రభుత్వ సంస్థల్లో పాదర్శకతను పెంచేందుకు 2005లో ప్రభుత్వం సమాచార హక్కు చట్టం తీసుకొచ్చింది. అయితే రాజకీయ పార్టీలు కూడా వివిధ రూపాలలో ప్రభుత్వ సహాయం పొందుతున్నాయి. నామమాత్రపు ధరలకే పార్టీలకు భూములు కేటాయించిన సందర్భాలు కూడా వున్నాయి. అందువల్ల రాజకీయ పార్టీలను కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలంటూ సుభాష్ అగర్వాల్, అనిల్ బైర్వాల్ అనే సామాజిక కార్యకర్తలు సమాచార కమిషన్ ను ఆశ్రయించారు. రాజకీయ పార్టీల నిధుల వ్యవహారాలు, వివిధ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు ప్రక్రియకు సంబంధించిన వివరాలను ఈ చట్టం ప్రకారం వెల్లడించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో సమాచార కమిషన్ రాజకీయ పార్టీలను కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకొస్తూ ఆదేశాలిచ్చింది. దీనిని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి.
ప్రజాస్వామిక ప్రక్రియలో జోక్యం
రాజకీయ పార్టీల వాదనలు మరో రకంగా ఉన్నాయి. తాము ప్రభుత్వరంగ సంస్థలం కామని, కార్యకర్తల అండదండలతోనే రాజకీయ పార్టీలు నడుస్తాయని, నాయకత్వాన్ని కూడా కార్యకర్తలే ఎన్నుకుంటారని, పార్టీలు కార్యకర్తలకే జవాబుదారీగా వుంటాయని చెప్పాయి. పార్టీకి సంబంధించిన అన్ని అంతర్గత అంశాలను వారికి మాత్రమే వివరిస్తామని, బయట వ్యక్తులకు చెప్పాల్సిన అవసరం లేదని తెలిపాయి. అందుకే పార్టీలు సమాచార హక్కు పరిధిలోకి రావంటూ నేతలు వాదించారు. రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావడం అంటే ప్రజాస్వామిక ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే అని పేర్కొన్నారు. పార్టీల అంతర్గత వ్యవహారాలలో ఇతరులు జోక్యం చేసుకోవడం ప్రజాస్వామిక సంప్రదాయాలకు గొడ్డలిపెట్టు వంటిదని వాదించారు. పార్టీల అభిప్రాయాలతో ఏకీభవించిన కేంద్ర కేబినెట్ రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధి నుంచి తప్పించాలని నిర్ణయించింది. 

No comments:

Post a Comment