హైదరాబాద్: కాంగ్రెస్ విభజన ప్రకటనతో రాష్ట్రంలో అన్ని పార్టీల పరిస్ధితి సందిగ్ధంలో పడిపోయిందని, ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన
పరిస్ధితి ఏర్పడిందని టెన్ టివి చర్చాకార్యక్రమంలో పాల్గొన్న పలు రాజకీయ పార్టీల నేతలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పై చర్చించే అవకాశమున్నప్పటికీ ఇరు ప్రాంతాలలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆయా పార్టీల నేతలు ప్రకటనలు చేస్తున్నారని చర్చలో పాల్గొన్న రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. పార్టీ పరంగా అన్ని పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నా విభజన విషయంలో ఇరు ప్రాంతాలలో ఒకే విధానాన్ని అనుసరిస్తున్నాయని అన్నారు. రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాల కోసం ఇరు ప్రాంత ప్రజలతో రాజకీయ క్రీడలు ఆడుతున్నాయని చెప్పారు. పార్టీలు తమ భవితవ్యం కోసం ఇటువంటి చర్యలు చేపట్టవచ్చు కానీ ఇరు ప్రాంతాల ప్రజలలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేయడం మానుకోవాలని సూచించారు. హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్పిన కాంగ్రెస్ విధివిధానాల గురించి ఎటువంటి ప్రకటన చేయలేదని అన్నారు. ఇరు ప్రాంతాల నేతలు ఆయా ప్రాంతాల ప్రజల అభీష్టం మేరకు నడచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అయితే తమ పార్టీ మొదటి నుంచి విభజన విషయంలో ఒకే స్టాండ్ తో ఉందని చర్చలో పాల్గొన్న వైసిపి నేత, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. ప్రజల అభీష్టం మేరకు తమ పార్టీ ఎమ్మెల్యేలు సమైక్యవాదానికి మద్దతు పలికారని తెలిపారు. ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవించకుండా కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వల్లే వారు రాజీనామాలు సమర్పించారని అన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగినా వారికి మద్దతుగా తమ పార్టీ పోరాడుతుందని చెప్పారు. జగన్ సమైక్య రాష్ట్రం కోరుతూ పార్లమెంటులో ఫ్లకార్డులు పట్టుకున్నది ఆ ప్రాంత ప్రజల వాంఛను తెలిపేందుకే అన్ని అన్నారు. ఆయా పార్టీల అధ్యక్షులు విభజన అంశంపై నిర్ణయం తీసుకోవడంలో విఫలం కావడం వల్లే అన్ని పార్టీలలో గందరగోళ పరిస్ధితులు ఏర్పడ్డాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రాంతా ప్రజలను సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం వల్లే సమైక్య ఉద్యమం వచ్చిందని అన్నారు. అయితే రెండు ప్రాంతాలను సమదృష్టితో చూడాల్సిన అవసరం తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఉన్నందువల్లే ఆయన ఆచితూచి మాట్లాడాల్సి వస్తుందని చర్చలో పాల్గొన్న టిడిపి ఎంపి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకే ఇరు ప్రాంతాల ప్రజాప్రతినిధులు వ్యవహరించాల్సివుంటుందని చెప్పారు. అందులో భాగంగానే తమ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేయాల్సివచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ సీమాంధ్ర ప్రాంత ఎంపీలంతా పార్లమెంటులో తమ నిరసనను తెలపాలని సూచించారు. సీమాంధ్రకు అన్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకుందని అన్నారు. దీన్ని తాము తప్పకుండా అడ్డుకుంటామని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ ను విలీనం చేస్తున్నామనే మాటలో వాస్తవం లేదని చర్చలో పాల్గొన్న ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు జితేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందే వరకు తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే ప్రసక్తే లేదని చెప్పారు. హైదరాబాద్ తో కూడిన 10 జిల్లాల తెలంగాణనే తాము కోరుకుంటున్నామని తెలిపారు.హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండేందుకు తాము అంగీకరించామని, సీమాంధ్రకు రాజధాని ఏర్పాటయ్యే వరకు ఇక్కడ తమ పాలనా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతే కాంగ్రెస్ లో విలీనం గూర్చి ఆలోచిస్తామని చెప్పారు. విభజన విషయంలో ప్రతీ పార్టీ రాజకీయ క్రీడలకు పాల్పడుతోందని చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే శేషారెడ్డి అన్నారు. హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని తాము కోరుతున్నట్లు చెప్పారు. సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలు కాపాడేవిధంగా తాము పార్టీని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఇరు ప్రాంతాల ప్రజలకు నష్టం జరుగకుండా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటుందన్నారు.

No comments:
Post a Comment