ఢాకా : బంగ్లాదేశ్ రాజ్యాంగ స్పూర్తికి విఘాతం కలిగిస్తున్నారంటూ దేశంలోని అతిపెద్ద మతవాద పార్టీ జమాత్ ఎ ఇస్లామీపై ఢాకా హైకోర్టు
సంచలన తీర్పునిచ్చింది. పార్టీ గుర్తింపును రద్దు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి గురువారం చారిత్రక తీర్పునిచ్చారు. ఈ తీర్పుతో వచ్చే జనవరి ఎన్నికల్లో 'ఇస్లామీ పార్టీ' పోటీకి అర్హతను కోల్పోయింది. కాగా, ఇతర పార్టీ కార్యాకలాపాల్లో పాల్గొనవచ్చని పేర్కొన్నది. ఎన్నికల్లో పోటీ చేయాలంటే నూతన సిద్ధాంతాలను, విధానాలను వివరిస్తూ ఎన్నికల సంఘానికి కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆరోపణలు...
లౌకిక భావనలకు విరుద్ధంగా పనిచేస్తూ హింసాత్మక కార్యకలాపాలకు ఇస్లామీ పార్టీ పాల్పడుతోందని ప్రధానంగా ఆరోపణ జరిగింది. మైనార్టీలకు, మహిళల హక్కులకు భంగం కలిగించే విధంగా పార్టీ విధానాలు ఉన్నాయని కోర్టులో వాదనలు జరిగాయి. పార్టీ గుర్తింపు రద్దు చేయాలంటూ జనవరి 25, 2009లోనే కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ప్రతిపక్ష పార్టీ తరిక్ ఫెడరేషన్ కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన తర్వాత నాలుగేళ్ళకు కోర్టు తుది తీర్పు గురువారం ఇచ్చింది.
దేశంలో అల్లర్లు...
పార్టీని నిషేధించాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. దీనిని నిరసిస్తూ ఇటీవల దేశంలో జరిగిన అల్లర్లలో 150 మంది మృతి చెందారు. తిరిగి ఇప్పుడు జమాతే ఇస్లామీ పార్టీని రద్ధు చేయడంతో మరోసారి దేశంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
1971 స్వాతంత్ర పోరాటంలో ఈ పార్టీ పాకిస్తాన్ కు సహకరించి సామూహిక హత్యలు, అత్యాచారాలు, మత ఘర్షణలకు కారణమైంది. అందుకు పార్టీ ముఖ్యనేత గులాం అజమ్ కు చనిపోయే వరకు జైలు శిక్ష గడిపారు. మరికొద్ది మంది నేతలకు మరణ శిక్షలు పడ్డాయి. నాయకులపై ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ దేశంలో అల్లర్లు జరిగాయి.
ప్రతిపక్షం కుట్ర...
పార్టీ ఎదుగుదలను అడ్డుకునేందుకు ప్రతిపక్షం కుట్ర చేసిందని పార్టీ నేతలు ఆరోపించారు. తమ పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా లేదని, అలా రద్దు చేయాల్సి వస్తే మరో 28 పార్టీలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.

No comments:
Post a Comment