Monday, August 5, 2013

హిరోషిమా విషాదగాధ....

మునుపెన్నడూ చరిత్రలో చూడనిది.. భవిష్యత్తులో చూడటానికి సాహసించలేనిది...వర్తమానంలో ఏ మాత్రం ఊహించాలన్నా వెన్నులో వణుకుపుట్టించేది.. . ప్రపంచాన అలాంటిది ఏదైనా ఉంటే.. ఒక్క హిరోషిమా.. విషాదమే..
1945ఆగస్టు... 6 సరిగ్గా.. 68 ఏళ్ళ క్రితం..మనిషి సాధించిన సాంకేతికత సాధన.. స్వార్ధశక్తుల చేతుల్లోపడి...బాంబు రూపంలో మానవాళిని కబలించిన రోజు అగ్రరాజ్యపు యుద్ధ దుర్నీతిని, రాక్షస కాంక్ష తీవ్రతను యావత్ ప్రపంచం..విస్తుపోయి చూసిన రోజు.. ఓ నియంత దేశం.. లక్షలాది అమాయక ప్రజల ప్రాణాలను విషపు వాయవుల్లో..కలిపేసిన రోజు.. హిరోషిమా.. చరిత్ర మరచిపోని చేదు జ్ఞాపకం.
 ఆగస్టు 6.. ఆగస్టు 9.. ఈ రెండు రోజుల్లో మానవాళికి జరిగిన నష్టాన్ని పూడ్చడం.. ఓ తరానికి సరిపోదేమో. హిరోషిమా....నాగసాకి నగరాలపై అణుబాంబు రూపంలో అగ్రరాజ్యం అమెరికా సాగించిన మారణకాండకు దాదాపు 70 ఏళ్ళు.ఏళ్ళుగడిచినా.. ఇప్పటికీ ఆ నగరాలకు చెందిన ప్రతి ఒక్కరినీ ఉలిక్కిపడేలా చేసిన ఓ మానవ ఉన్మాదం. మూడు రోజుల వ్యవధిలో... రెండు జపాన్‌లోని రెండు నగరాలు.. సర్వనాశనమైపోయాయి. కేవలం.. సాటి మానవాళిపై మానవుడి జరిపిన దాడిలో కనీసంగా నాలుగు లక్షలమంది బలైపోయిన అత్యంత విషాదకర సందర్భమది. ఇంతటి భయంకరమైన బాంబు చిమ్మిన రేడియేషన్ ప్రభావంతో జీవితకాలం ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొని తనువు చాలించిన వాళ్ళెందరో. హిరోషిమా ప్రపంచంలోని అణుయుద్దాలకు ఓ నాంది. దానికి శ్రీకారం చుట్టి.. ఇప్పటికీ అదే అణు రాజకీయాలను ప్రపంచమంతా విస్తరిస్తోంది అమెరికా...
అణుబాంబు.. మనిషి తయారు చేసిన ప్రపంచ వినాశకం
 
చరిత్రలో దేశాల మధ్య యుద్ధమంటే.. గాల్లో యుద్ధ విమానాలు తిరుగుతాయి.. లక్ష్యాన్ని గురిచూసి పేల్చడానికి యుద్ధ ట్యాంకర్లుంటాయి. విరోచితంగా పోరాడే సైనిక బలం ఉంటుంది. కానీ.. ఇప్పడు అమెరికా పరిభాషలో యుద్ధమంటే..ఓ అణుబాంబు. దేశ దేశాలను, లక్షలాది అమాయక ప్రజలను సర్వ నాశనం చేసే ఓ విస్పోట పాఠం. ప్రపంచంలోని అగ్రరాజ్యాలు మొదలుకొని.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న వర్ధమాన దేశాలు సైతం.. అణుబాంబులను తమ సైనిక స్థావరాల అమ్ముల పొదిలో పెంటుకుంటున్నాయి. అణ్వస్త్ర తయారీ అనేది ఓ అనివార్య అంశంగా మార్చేసుకుంటున్నాయి.. ఎందుకోసం???దేశదేశాలనే కాదు.. భూమండలాన్నే.. క్షణకాలంలో భస్మీపటలం చేసేశక్తిగల అణుబాంబుల్ని చిన్న చిన్న దేశాలు సైతం పెంచి పోషించుకోడానికిగల కారణాలేంటి?? మావవజాతిని నాశనం చేయగల అణుబాంబులాంటి అణ్వస్త్రాలను.. దేశ మనుగడ కోసం పక్కలో బల్లెంలా పెట్టుకుంటూ.. ప్రత్యక్షంగా పరోక్షంగా అణుబాంబు బలబలాలను ప్రదర్శించుకోడానికి గల కారణం ఎవరు??
  ఒకపక్క శాంతిపాఠాలను వల్లిస్తూనే.. దేశ దేశాల మధ్య అభద్రతాభావాన్ని నెలకొల్పుతూ అణ్వస్త్ర తయారీకి ఆజ్యం పోస్తున్న అమెరికా యుద్ధకాంక్షను ఎలా అర్ధం చేసుకోవాలి??అణుబాంబు తయారీ.. అణుబాంబు ప్రయోగం అనేది కేవలం రక్షణ కోసం మాత్రమే.. అంటూ..తనదైన రాజకీయ నేపథ్యంతో అణ్వస్త్రాల భూమిక కోసం ఉసిగొలిపుతున్నదెవరు? పొరుగు దేశాలమధ్యే యుద్ధోన్మాద కాంక్షను రగిలిస్తున్న అమెరికా ఏర్పరిచిన యుద్దక్రీడా వినోదపు బాటలో.. గతిలేని పరిస్థితుల్లో నడుస్తూ.. ఇప్పడు అనేక దేశాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. శత్రువులకేకాదు.. చివరికి తమకే భస్మాసర హస్తమయ్యే అణుబాంబుల్ని తలగడ కింద కత్తిలా పెట్టుకునే పరస్థితికి దేశాలను దిగజార్చిన ఘనకీర్తి అమెరికాదే. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాలంటూనే.. యుద్ధనీతిని సమూలంగా మార్చేసి.. అణుబాంబు కుంపటిలోకి నెడుతున్న అమెరికా చేసిన మహా మహా ఘోరకలే ... హిరోషిమా.. నాగసాకి అణుబాంబు దాడి. 70 ఏళ్ళ క్రితమే...మానవాళిని నిర్ధాక్షిణంగా చంపేసే మృత్యుక్రీడకు తెరలేపిన అమెరికా కుతంత్రానికి హిరోషిమా.. సజీవ సాక్ష్యమిది.
హిరోషిమా, నాగసాకి నగరాలపై అణుబాంబు ఎందుకు వేయాల్సివచ్చింది?
 
ఒక అర్ధంపర్ధంలేని ఆధిపత్యం.. లక్షలాది ప్రాణాలను బలిగొంది. ఒక మూర్ఖపు యుద్ధ దుర్నీతి.. పచ్చని రెండు నగరాలనే నామరూపాలు లేకుండా చేసేసింది. ప్రపంచ అగ్రదేశపు మారణకాండకు సజీవ సాక్ష్యంగా నిలిచిన హిరోషిమా ఘటనకు కారణాలేంటి?? పరిశీలించగా అసలు ఆ రోజేం జరిగింది?? ఒక భయంకర విస్పోటనానికి లక్షలాది జనసమూహం తట్టుకోలేక..నింగినంటేలా అరిచిన ఆర్తనాదాలవి. ఎక్కడ చూసినా.. గుట్టలుగా పడిన మానవ మృతదేహాలు..ఎముకలు మసిబొగ్గుల్లా మారిపోయి.. శరీర భాగాలు.. తునాతునకలైన రాళ్ళురప్పల్లో కలిసిపోయిన క్షణాలవి. ఆగస్టు 6, 1945 ప్రపంచ చరిత్రలోనే ఓ అత్యంత విషాదకరమైన రోజు. రెండో ప్రపంచ యుద్ధం ముగుస్తున్న సమయంలో అగ్రరాజ్యం అమెరికా ఒక్కసారిగా బుస కొట్టింది. తన యుద్దోన్మాదానికి పరాకాష్టగా లక్షలాది ప్రాణాలనే బలితీసుకోవడానికి విశ్వరూపం దాల్చిన రోజది. మానవుడి చేతిలో తయారైన అనుబాంబే.. అమెరికావాడి చేతిలో యమపాశంగా మారిపోయింది.ఫలితంగా క్షణాల్లోనే హిరోషిమా నగరం భస్మీపటలం అయింది. ఘటనలో.. లక్షా 40 వేలమందికి పైగా మృతి చెందారు. అమెరికా యుద్ధ దాహం అంతటితో తీరలేదు. ఇది జరిగిన మూడు రోజులకే ఆగస్టు 9 1945 నాడు నాగసాకిపై రెండో అణుబాంబును ప్రయోగించి ఆ ప్రాంతాన్నీ సర్వనాశనం చేసింది. దాదాపు లక్షమంది అమాయక ప్రజలు అణుబాంబు చిమ్మిన మంటలో మసైపోయారు. అంతేకాదు.. ఇంకా చాలా మంది సంవత్సరాల తరబడి రేడియేషన్ ప్రభావంతో క్యాన్సర్ కారణంగా తనువు చాలించారు. ఈ రెండు బాంబు దాడుల్లో సుమారు 4 లక్షలకు పైగా జనం మృతి చెందారు. మరెందరో శరీర అవయువాలు కోల్పోయి.. బతికుండగానే నరకాన్ని అనుభవించారు. లక్షలాది ప్రజల ప్రాణాలతోపాటు.. అణుబాంబు ధాటికి హిరోషిమాలోని భవనాల్లో సుమారు 69 శాతం నేలమట్టమయ్యాయి. 1942లో నాటికి 4 లక్షల పైచిలుకు ఉన్న ఆ నగర జనాభా అణు దాడితో లక్షా 37 వేలకు పడిపోయిందంటే అణుబాంబు ప్రభావం.. ఎన్ని ప్రాణాలను బలితీసుకుందో అర్ధం చేసుకోవచ్చు.
అసలేం జరిగింది? అమెరికాకు అణుబాంబు దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
 
జపాన్ లోని హిరోషిమా నగరానికి వందల ఏళ్ళ చరిత్ర ఉంది. 1589లో మోరి టెరిమోటో ఈ నగరాన్ని స్థాపించాడన్నది చరిత్ర. ఆ తర్వాత జరిగిన యుద్ధాల్లో ఈ నగరం మరెందరో రాజుల వశమైంది. బలమైన ఆర్థిక వ్యవస్థ, సైనిక వ్యవస్థను కలిగి ఉండటం ఈ నగరానికున్న ప్రత్యేకత. రెండో ప్రపంచ యుద్ధంలో చుగోకు ప్రధాన సైనిక స్థావరం హిరోషిమా నగరం కావడం విశేషం. సైన్యానికి సరఫరా చేసే అనేక ఆయుధ డిపోలు ఈ నగరంలోనే ఉండేవి. ఇలాంటి ప్రత్యేకతలుండటంతో ఈ నగరంపై అమెరికా కన్నుపడింది. సమయం కోసం వేచి చూసి మరీ.. ఈ నగరాన్ని నామరూపాలు లేకుండా చేయాలని క్రమంలో ఒక్కొక్కటిగా పావులు కదుపుతూ వచ్చింది. అందుకు ప్రపంచ యుద్ధం బాగా కలిసొచ్చింది. ఆ సమయం రానే వచ్చింది. 1945, ఆగస్టు 6 తేదీన ఉదయం గం.8.15 నిమిషాలకు బి-29 అనే బాంబర్ విమానం ద్వారా అణుబాంబును హిరోషిమాపై జారవిడిచింది. ఇలా మొదటిసారిగా అణుబాంబు ద్వారా ధ్వంసం చేయబడ్డ తొలి నగరంగా హిరోషిమా ప్రపంచ చరిత్ర పుటలకెక్కింది. అమెరికా జరిపిన మారణకాండకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. హిరోషిమా-నాగసాకి ఘటనలు పథకం ప్రకారమే అమెరికా సాగించిన హత్యాకాండలేనని చరిత్ర చెబుతోంది. పోలండ్ పై జర్మనీ దురాక్రమణతో 1939 సెప్టెంబర్ 1న రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. హిట్లర్ ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ ఒక్కటైనా... తన రేవు పట్టణం పెరల్‌హార్బర్‌పై జపాన్ దాడి చేసే వరకూ అమెరికా అంటీముట్టనట్లుగానే వ్యవహరించింది. ఆదిపత్యం కోసం.. ఒక వ్యూహాన్ని పన్ని..దానిలో భాగంగానే ఐన్‌స్టీన్ తదితరుల సహకారంతో 1939 అక్టోబర్‌లో అణుబాంబుల తయారీ ప్రక్రియను ప్రారంభించింది. 1945 ఏప్రిల్3 న యురేనియం, థోరియంలతో కూడిన రెండు రకాల బాంబులను మెక్సికన్ ఎడారిలో ప్రయోగాత్మకంగా అమెరికా పరీక్షలు జరిపింది. అణుబాంబులతో భారీ విధ్వంసాన్ని, మారణహోమాన్ని సృష్టించడం ద్వారా ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని భావించింది. జర్మనీని లక్ష్యం చేసుకుంటే తన సొంత జాతి ప్రజలే బలవుతారని భావించిన అమెరికా మంగోలులపై అంటే జపాన్ దేశాన్ని తన లక్ష్యంగా చేసుకుంది. బాంబులు ఎక్కడ వేయాలనే దానిపై అమెరికా ఓ కమిటీని వేసి మరీ తన మారణకాండకు శ్రీకారం చుట్టింది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న మూడు లక్షల జనాభా కలిగిన హిరోషిమాను, రెండు లక్షలకు పైగా జనాభా కలిగిన నాగసాకిని లక్ష్యం చేసుకుంది. థోరియం బాంబుకు మొదటి టార్గెట్‌గా కొకురా పట్టణం, ప్రత్యామ్నాయ టార్గెట్‌గా నాగసాకిలను నిర్ణయించింది. కొకురాపై మేఘాలు దట్టంగా ఆవరించివున్న కారణంగా దానిని వదిలి నాగసాకిపై బాంబు వేశారు.
  హిరోషిమా, నాగసాకి కి ముందుగానే.. 1945 ఫిబ్రవరిలో అమెరికన్, బ్రిటన్ వైమానిక దళాలు టోక్యో సహా జపాన్‌కు చెందిన 66 పట్టణాలపై కార్పెట్ బాంబింగ్ వేసి భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. సుమారు పది లక్షల మంది జపానీయులను పొట్టనబెట్టుకున్నాయి. 25 లక్షల భవనాలు ధ్వంసం కాగా కోటి మంది నిరాశ్రయులయ్యారు. ఈ భయంకరమైన విధ్వంసం నుంచి హిరోషిమా, నాగసాకి నగరాలను ఎందుకు మినహాయించారో.. తమపై ఎందుకు అమెరికా విమానాలు బాంబులు వేయడంలేదో.. అర్ధం చేసుకునేలోపే.. ఈ నగరానికి చెందిన లక్షలాది ప్రజలు అణుబాంబు దాడికి బలైపోయారు.మరేదైనా దేశమో.. నగరమో అయితే.. జీవితకాలంలో కోలుకుని ఉండకపోవచ్చు. కానీ.. అచంచలమైన ఆత్మవిశ్వాసంతో.. కేవలం పదేళ్ళలో ఈ నగరాలు పూర్వపు వైభవానికి మించి అమెరికా తలదించుకునేలా ఎదిగాయి. మానవ చరిత్రలోనే హిరోషిమా, నాగసాకి అత్యంత విషాదకరమైన ఘటనలు. ప్రతి సంవత్సరం ఆగస్టులో హిరోషిమా, నాగసాకి డేలను జరుపుకోవడం ద్వారా ప్రపంచం అప్పటి మృతులను స్మరించుకోవడం ఆనవాయితీ వస్తోంది. విచిత్రమేమంటే.. ఆధిపత్యం కోసం అంతటి మారణహోమానికి కారణమైన అమెరికా ఇపుడు మొసలి కన్నీరు కారుస్తూ.. పెద్ద శాంతి దూతగా తనకు తాను చిత్రించుకునేందుకు నానా తంటాలుపడుతోంది. అణు నిరోధకమనే పెద్దమనిషి తరహా మాటలతో ఒప్పందాలతో అమెరికా గత దశాబ్దాలుగా వ్యవహరించే అంశాలు లోకానకు తెలియనివికావు. జార్జిబుష్ అయినా.. ఒబామా అయినా అందరూ యుద్దోన్మాద ఎత్తుగడలో ఒకతానులో ముక్కలే. అణు ఆయుధాల తయారీ.. లేదా వ్యాప్తి, విస్తరింపు విషయంలో తన చూపే డైరెక్షన్లోనో లేదా గీసిన గీతలోనో మిగితా దేశాలను అదుపులో ఉంచాలనే రాజకీయ ఎత్తుగడలకు భారత్ లాంటి దేశాలు కూడా బుట్టలోపడిన సందర్భాలున్నాయి. ఏకంగా యూపీఏ1 నుంచి యూపీఏ 2 ప్రభుత్వంలోనూ.. అణు నిరోధక ఒప్పందాల విషయంలో అమెరికాకు స్పష్టమైన వైఖరిని చెప్పడానికి భారత్ మొహమాట పడుతూనే వచ్చింది. అణుబాంబును బూచీగా చూపే క్రమంలో తను కనుసన్నల్లో మెలిగే దేశాలతో ఒక తీరు.. లేదంటే మరోతీరుతో అణుచిచ్చు రగిలించడం కూడా అమెరికాకు కొట్టినపిండే.
 అణుబ్రహ్మ.. గా లోకాన ఖ్యాతిగడించిన అమెరికా.. హిరోషిమా, నాగసాకిల ఘటనలపై ఏనాడు చింతించలేదు. పైగా అణ్వస్త్ర రహిత ప్రపంచ సాధన కోసం జపాన్ తో కృషి చేస్తామని ఇప్పుడు ఒబామా చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టేనంటున్నాయి ప్రపంచ దేశాలు. గత ఏడాది నాగసాకిలో నిర్వహించిన సంస్మరణ సభకు మొట్టమొదటిసారిగా అమెరికా రాయబారి జాన్ రూస్ హాజరయ్యారు. కానీ ఇది ప్రజలకు రుచించలేదు. గో బ్యాక్ అంటూ ఛీకొట్టారు.కేవలం ప్రపంచాధిపత్యాన్ని చాటుకోవడానికి మారణహోమాన్నిసృష్టించిన అమెరికాకు మృతులకు నివాళులర్పించే అర్హత లేదని నిందించారు. దేశాల సార్వభౌమత్వాన్ని, స్థానిక పాలకుల ఆత్మగౌరవాన్నిమంటగలిపడంలో అమెరికాన మించిన దేశం లేదు. కానీ ఎప్పుడూ.. రోజులు ఒకేలా ఉండవు. ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా అమెరికా ఆధిపత్య ధోరణులపై తిరగబడుతున్నారు. మొన్న వియత్నాంలో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగానే నేడు ఆఫ్ఘనిస్తాన్‌లోనూ తీవ్ర ప్రతిఘటనతో బలగాలు వెనక్కి వెళ్లక తప్పని పరిస్థితి తలెత్తింది. రేపు సిరియాలోనూ, ఇరాన్‌లోనూ ఇదే పరిస్థితి తలెత్తొచ్చు. హిరోషిమాపై వ్యాసం రాయని పత్రిక, వార్తలు ప్రసారం చేయని ఛానల్ లేదు. ఆనాటి ఘటనని న్యూయార్క్ మ్యాగజైన్, ఆగస్టు31, 1946 నాటిక సంచిక మొత్తం హిరోషిమా సంగతులతో నింపేసింది. హిరోషిమాలో బాంబు దాడి తర్వాత అక్కడి ప్రజల జీవన స్థితిగతులను ఆ పత్రిక వివరించింది. ఎవరి సమాజపు దురవస్థల గురించి ఈ రచన చేయబడిందో, ఆ జపాన్ ప్రజలకు మాత్రం 1949 వరకూ ఈ రచన చదివే అవకాశం దక్కలేదు. అమెరికన్ ప్రభుత్వం ఈ రచనపై అప్రకటిత నిషేధాన్నిఅమలు చేసి.. నిజాన్ని మరింత దాచాలనే ప్రయత్నం చేసింది. యుద్ధమైనా.. పోరాటమైనా..మారణకాండకు తావిస్తే.. అది ప్రపంచం దృష్ఠిలో ఉగ్రవాదం కంటే పెద్ద అత్యంత ప్రమాదరకరమైన అంశం..హిరోషిమా.. నాగసాకిపై అమెరికా చేసిన అణుదాడికూడా అలాంటిదే.. ఈ రెండు దేశాలపై అమెరికా సాగించిన మారణహోమం కుట్రపూరితంగా సాగించిన ఉగ్రవాదమేనని చెప్పక తప్పదు.
 ఆనాటి నుంచి నేటిదాకా.. రకరకాల రూపాల్లో ప్రపంచ దేశాలపై అమెరికా సాగించిన దురాక్రమణ దాడులన్నీటెర్రరిజం కిందకే వస్తాయి. ఇలా కుటిల మార్గంలో అమెరికా ప్రపంచవ్యాప్తంగా అమెరికా జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు కనీసం కోటికి పైగా జనం మరణించి ఉంటారు. సన్నార్గమైన యుక్తికంటే.. దుర్మార్గమైన అణుశక్తితో గెలవాలన్నది అమెరికా నిరంతర ఆలోచన. కానీ.. హిరోషిమా.. నేర్పిన పాఠం.. గుణపాఠాన్ని మాత్రం.. ఎవ్వరూ మర్చిపోలేరు.....ప్రపంచంలో ఎవ్వరూ క్షమించరు.

2 comments:

  1. ఈ పోస్టు వాస్తవాలకంటే ఎక్కువగా అమెరికాపై మీకున్న విపరీత ద్వేషాన్ని చూపిస్తోంది. 1940ల కాలాన్ని చూసేటపుడు అప్పటి పరిస్థితులు కూడా గమనించాలి. బలమైన దేశాలన్నీ సామ్రాజ్యవాదంతో యుధ్ధాల్లో మునిగితేలిన రోజులవి. దీనికి యూరోపు జపాన్ లు కూడా మినహాయింపు కాదు. మనిషి తయారు చేసిన ప్రతి ఆయుధాన్ని ఎపుడో ఒకపుడు వాడుతాడు. అమెరికానే కాదు, అణ్వాయుధాన్ని అనకాపల్లివాడు తయారుచేసినా ఎపుడో ఒకపుడు ప్రజలమీదికి వదిలి నాలుక కరచుకొనేవాడు. 1940 ల తరువాత యుధ్ధాన్ని విరమించి అమెరికాతో స్నేహం మొదలుపెట్టిన జపాన్ వారూ బాగున్నారు. మీలాంటివారు మాత్రం ఒక దేశాన్ని విపరీతంగా ద్వేషిస్తూ మరికొందరికి దాన్ని ఎక్కిస్తున్నారు.

    ReplyDelete
  2. ఇంతకీ తెలివైన వాడి డబ్బు పిచ్చ లేదా తెలివైన వాడు తను మొదటి స్థానం ఆక్రమించాలి అనే ప్రయత్నం వల్ల జరిగిన నష్టం అంటారా?

    ReplyDelete