Friday, August 9, 2013

పోస్టర్లు వేశారు.. అద్వానీని మరిచారు..

హైదరాబాద్: బిజెపిలో అద్వానీ శకం ముగిసిపోయిందని అనధికారికంగా ప్రకటన వచ్చేసింది.. గతంలో గోవాలో జరిగిన ఆ పార్టీ సమావేశాల్లో అద్వానీ వ్యతిరేకించినా.. 
ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ సీటులో మోడీని కూర్చోబెట్టడం తెలిసిందే. దీంతో.. అద్వానీ పని అయిపోయినట్లేనన్న వార్త సర్వత్రా మార్మోగింది. తాజాగా మరో విషయంతో దీన్ని నిజం చేశారు. ఎక్కడ బిజెపి కార్యక్రమం జరిగినా, అక్కడ వేసే ప్రచార పోస్టర్లలో ఆ పార్టీ సీనియర్ నేతలు వాజ్ పేయి, అద్వానీ ఫొటోలు ఉంటాయి. కానీ.. ఇప్పుడు వారి స్థానాన్ని మోడీ ఆక్రమించేశాడు. ఆగస్టు 11న హైదరాబాద్ లో బిజెపి నిర్వహించనున్న సభకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్ నుంచి అద్వానీ ఫొటోను తొలగించారు. ఈ ఉదంతం ఇటు పార్టీలోనూ, బయట చర్చనీయాంశమైంది.
నయీ సోచ్.. నయీ ఉమ్మీద్..
 
క్తొత పోస్టర్ల మీద మోడీ ఫోటో పక్కన 'నయీ సోచ్.. నయీ ఉమ్మీద్' (కొత్త ఆలోచన.. కొత్త నమ్మకం) అనే స్లోగన్ ఉంచారు. ఈ పోస్టర్ కు బిజెపి ఎన్నికల ప్రచార కమిటీ కూడా ఆమోదముద్ర వేసినట్టు తెలుస్తోంది.దీంతో ఇప్పటి దాకా అద్వానీ ఫొటోతో ఉన్న పార్టీ అధికారిక పోస్టర్లకు ఇక కాలం చెల్లినట్టేనని తెలుస్తోంది.
అద్వానీ అనుచరుల ఆగ్రహం...
 
ఈ ఘటనతో అద్వానీ అనుచరులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. సీనియర్ నేత అయిన.. అద్వానీ పోస్టర్ లేకుండా పార్టీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేయడంపై గుర్రుగా ఉన్నారు. అయితే..ఈ పోస్టర్ ద్వారా బిజెపి ప్రధాని అభ్యర్థిగా మోడి పేరు ఖరారైందని చెప్పేందుకే ఈ విధమైన పోస్టర్ విడుదల చేశారని పలువురు భావిస్తున్నారు. 

No comments:

Post a Comment