ఢిల్లీ: క్రికెట్‌లో ఐపిఎల్ మాదిరిగా బ్యాడ్మింటన్‌లోనూ కమర్షియల్ లీగ్‌కు అంకురార్పణ జరిగింది. బ్యాడ్మింటన్‌లో ఐబిఎల్ టోర్నీ ఢిల్లీలో నేడు ప్రారంభం కానుంది. భారత బ్యాడ్మింటన్ స్టార్ ఆటగాళ్లకు ప్రోత్సాహకరంగా ఉన్న ఈ లీగ్‌తో బ్యాడ్మింటన్‌కు కూడా ఆదరణ పెంచాలన్నది నిర్వాహకుల లక్ష్యంగా తెలుస్తోంది.
భారత్‌లో క్రికెట్, టెన్నిస్ తర్వాత దేశంలో అత్యంత ఆదరణ ఉన్న ఆట బ్యాడ్మింటన్. గల్లీలు, కాలనీల్లో సరదాగా ఆడే ఈ ఆటకు గోపీచంద్, సైనా నెహ్వాల్, గుత్తా జ్వాల లాంటి క్రీడాకరులు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు. వీరితో పాటు కశ్యప్, సింధు వంటి యువ ఆటగాళ్లు కూడా ప్రపంచ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ దేశానికే గర్వకారణంగా నిలిచారు. ఇప్పుడు ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌తో ఆటకు కమర్షియల్ టచ్ ఇచ్చిన ఘనత కూడా హైదరాబాద్‌కు చెందిన గోపీచంద్‌కే దక్కుతుంది. న్యూఢిల్లీలో నేడు ప్రారంభం కానున్న ఐబిఎల్‌లో భారత స్టార్ క్రీడాకారులతో పాటు లీ చాంగ్ వీ, రత్‌చనోక్ ఇంటానోన్ వంటి ప్రపంచ ఉత్తమ ప్లేయర్స్ పాల్గొననున్నారు.
పోటీలో ఆరు జట్లు
15 రోజుల ఈ టోర్నీలో ఆరు జట్లు పోటీపడతాయి. ఈ ఆరు జట్లను ఆరుగురు ఫ్రాంఛైజీలు సొంతం చేసుకున్నారు. ప్రతి జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు, ఆరుగురు భారత ప్లేయర్స్, ఒక జూనియర్ క్రీడాకారుడికి చోటు లభిస్తుంది. 10 లక్షల డాలర్ల విలువైన ఈ టోర్నీ, బ్యాడ్మింటన్ చరిత్రలోనే అతి పెద్ద టోర్నమెంట్‌గా రికార్డు నెలకొల్పింది. భారత్‌లో యువ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ఇలాంటి భారీ టోర్నీలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. అయితే వర్ధమాన ఆటగాళ్లను ప్రోత్సహించడానికి బదులు వ్యాపారాన్ని పెంచుకునే లక్ష్యంతోనే ఈ టోర్నీని నిర్వహిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి జట్టును సొంతం చేసుకున్న ఫ్రాంచైజీలు ఆటగాళ్లపైనా లక్షలాది రూపాయలు గుప్పించి మరీ వేలం ద్వారా కొనుక్కున్నారు. ఈ వేలంతో దేశం కోసం ఆడాల్సిన క్రీడాకారులు ఫ్రాంచైజీల చేతిలో బందీలుగా మారే ప్రమాదముందని క్రీడా విమర్శకులు అంటున్నారు. మరో వైపు ప్రభుత్వం కనీస ప్రోత్సాహం కూడా అందించకపోవడంతో ఈ తరహా టోర్నీల ద్వారా అయినా ఆటకు పాపులారిటీ పెంచే వీలు కలుగుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

No comments:
Post a Comment