14 ఏళ్ళ లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య అందించాలన్న ఉద్దేశంతో ప్రణాళికలు రూపొందుతున్నాయి. అయితే.. ఏవేవో కారణాలు వీరిని నిరక్షరాస్యులుగా ఉంచుతున్నాయి. పుట్టిన ప్రతీ బిడ్డా బడికెళ్ళాలి. అది ప్రాథమిక హక్కు. కానీ.. బడికెళ్ళే బాలికల శాతం మాత్రం చాలా తక్కువగా ఉంటోంది. దీనికి కారణాలు ఏమిటి అన్న విషయంపై 'టెన్ టివి' ప్రత్యేక చర్చను 'వేదిక' ద్వారా చేపట్టింది. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నేత జి. ఉషారాణి, ప్రముఖ గైనకాలజిస్టు మంజుల పాల్గొన్నారు. ఈ చర్చలో వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు...
ఆర్థిక ఇబ్బందులే కారణం: ఉషారాణి
'డ్రాపవుట్స్...' పాఠశాలలో చేరి మధ్యలో చదువు మానేసిన వారిని ఈ విధంగా పిలుస్తారు. ఇందులో అమ్మాయిల శాతమే ఎక్కువ. అదికూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ. దీనికి ఆర్థికాంశాలు ప్రధానమైన కారణంగా కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో చిన్నారులను చదవించలేకపోతున్నారు. ఫలితంగా వారిని చదువు మాన్పించి ఏదో ఒక పనిలో చేర్పిస్తున్నారు. దీంతో పిల్లలు బాలకార్మికులుగా మారిపోతున్నారు. చదువుకోవాలన్న ఆశ ఉన్నప్పటికీ, పని చేయక తప్పని పరిస్థితుల్లో బడికి దూరమవుతున్నారన్నారు. అంతేకాకుండా.. ఆడపిల్లలపై తరతరాలుగా ఉన్న వివక్ష కూడా కారణమవుతోంది. ఇంట్లో పనులు చేయడానికి, ఇంట్లో ఉన్న మిగతా వారిని చూసుకోవడానికే కొందరు అమ్మాయిలను కేటాయిస్తున్నారు. దీని వల్ల కూడా బడికి వెళ్లే అమ్మాయిల సంఖ్య తగ్గుతోంది. అంతే కాకుండా.. ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాలు పట్టణాలకు వలస వస్తుంటారు. ఇలా వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో.. ఎప్పటికప్పుడు స్థలాలు మారుతూ ఉండటం కూడా చిన్నారుల చదువుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సమస్యను ప్రభుత్వాలే పరిష్కరించాలి. పేదలకు ఆర్థిక పుష్టి కల్పించగలిగితే ఆడపిల్లలు బడికి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ పరిస్థితికి మరో కారణం మద్యం. మద్యం షాపులు పెరిగినంత వేగంగా బడులు పెరగడం లేదు. మద్యపానాన్ని నిషేధిస్తే కుటుంబంలో ఎన్నో మార్పులు వస్తాయి. తద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించే అవకాశం కలుగుతుంది.
సౌకార్యల లోపమూ కారణమే : మంజుల
ఆడపిల్లలు బడికి దూరం కావడానికి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పాఠశాలల్లో టాయిలెట్ ఫెసిలిటీస్ లేకపోవడం చాలా పెద్ద సమస్య. అదేవిధంగా.. ఇంటి పనులతో స్కూలుకు వెళ్లకపోవడం కూడా ఒక సమస్యగా మారుతోంది. ఈ అంశాలను అనేక సంఘటనలు రుజువు చేశాయి. చేస్తున్నాయి. పాఠశాలల్లో సరైన మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంతో వారు చాలా ఇబ్బంది పడుతూ 'ఆ.. ఐదు రోజులు' ఇంట్లో ఉండిపోవడం జరుగుతోందని చెప్పారు. అంతేకాకుండా సామాజికంగా ఆడపిల్లలు సామాజికంగా చదువు విషయంలో ఎక్కువగా ఆసక్తి చూపరు. అనాదిగా వస్తున్న కట్టుబాట్లు దీనికి ప్రధాన కారణం. దీంతో ఇంట్లో తల్లిదండ్రులకు సహాయం చేయడానికే చాలా మంది అమ్మాయిలు పరిమితమవుతున్నారు. ఆడపిల్ల రజస్వల అయిన తర్వాత ఇంట్లోనే వుండాలి. బయటికి వెళ్ళకూడదు అనే ఆంక్షలు నేటికీ వున్నాయి. సామాజికంగా పురుషులు కుటుంబ పెద్దలుగా వున్నారు. కానీ.. వారు ఆడపిల్లల చదువుకు ప్రాముఖ్యం ఇవ్వకపోవడం లేదు. దీనివల్ల అమ్మాయిలు బడికి దూరం అవుతున్నారు.

No comments:
Post a Comment