హైదరాబాద్: ప్రజల్లోకి వెళ్లలేక.. రాజకీయ లబ్ధికోసం సీమాంధ్ర నాయకులు రాజీనామాలు చేస్తున్నారు కానీ తెలంగాణకు వ్యతిరేకంగా కాదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ విభజన- సీమాంధ్ర
ప్రజాప్రతినిథుల రాజీనామాలకు సంబంధించి శుక్రవారం 'టెన్ టివి'లో జరిగిన 'న్యూస్ మార్నింగ్ ' చర్చలో పలు పార్టీల నేతలు పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకున్నారు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ అధిష్టానం సీమాంధ్ర ప్రాంతానికి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారో చెప్పలేదని అందుకే ఆ ప్రాంతంలో ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. కనుక ఈ విషయంలో మరింత స్పష్టత రావాలని పేర్కొన్నారు. నేతల అభిప్రాయాలు వారి మాటల్లోనే....
చందు సాంబశివరావు( టిడిపి సీనియర్ నేత): ''రాష్ట్ర విభజన జరుగుతుందని కాంగ్రెస్ నాయకులకు ముందుగానే తెలుసు. కానీ అప్పుడు ఎందుకు వీరు స్పందించలేదు..? ఇప్పుడు ఎందుకు రాజీనామాలు చేస్తున్నారు...? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకులపై ఉంది. ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేక రాజీనామాల డ్రామాలాడుతున్నారు. తమ ప్రాంతానికి న్యాయం చేయాలని కోరడంలో న్యాయం ఉన్నా...ఒక వైపు ఉద్యమం చేస్తూ... మరోవైపు రాజీనామాలు చేస్తూ ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారు. ముందుగా వారు క్లారిటీగా ఉండాలి. సీమాంధ్రలో ఇంతగా ఉద్యమం జరుగుతున్నా సిఎం, పిసిసి ఇప్పటి వరకు స్పందించక పోవడం సిగ్గుచేటు. రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం మరింత స్పష్టత ఇవాల్సి ఉంది. జల వనరుల పంపిణీ, విద్యుత్, ప్రాజెక్టులు, ఉద్యోగాలు వంటి వాటిపై స్పష్టత ఇవ్వడంలో కాంగ్రెస్ అధిష్టానం పూర్తిగా విఫలమయ్యింది. టిడిపి నేతలు కేవలం సీమాంధ్రకోసం ఏం చేస్తారో చెప్పాలని రాజీనామాలు చేశారు.''
వకులాభరణం కృష్ణమోహన్( కాంగ్రెస్ సీనియర్ నేత): ''రాష్ట్ర విభజన ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. గత ఐదు సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు, బలిదానాలు, చర్చలు, కమిటీల నివేదికలు, అన్ని పార్టీల, ప్రాంతాల అభిప్రాయాలు, సుదీర్ఘ ఆలోచనల తర్వాత రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్ర నేతలు, ఉద్యమం చేయడం సరికాదు. ఐదు సంవత్సరాలుగా రగులుతున్న ఈ సమస్యపై స్పందించని నేతలంతా ఇప్పుడు రాజీనామాలు చేయడం సరికాదు. ఇది కేవలం వారి రాజకీయ లబ్ధిలో భాగమే. సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం కావాలంటే కేంద్రం ప్రభుత్వంతో పోరాడాలి తప్ప ఉద్యమం పేరుతో విగ్రహాలు, ఆస్తులను ధ్వంసం చేయడం, రాజీనామాలు చేయడం సరికాదు. వనరులు పంపకాల కోసం ప్రత్యేక కమిటీ వేసి అందరికి న్యాయం జరిగేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి.''

No comments:
Post a Comment