Sunday, August 18, 2013

భగత్ సింగ్ 'షహీద్' కాదా?

హైదరాబాద్: యువతకు ప్రేరణగా నిలిచిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లకు అమరవీరులుగా గుర్తింపు పొందే అర్హత లేదని భారత ప్రభుత్వం చెబుతోంది. దేశస్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని అమరవీరులుగా గుర్తించే సాంప్రదాయం
మనకు లేదంటోంది. ప్రభుత్వ ప్రకటనతో భగత్‌సింగ్‌ ముని మనవడు ఆగ్రహానికి గురయ్యారు. భగత్ సింగ్ ను అమరవీరుడిగా గుర్తించాలని, లేనియెడల ఆందోళనకు దిగుతానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆర్టీఐ వివరణ కోరిన యాదవేంద్ర సింగ్‌
భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను అమరవీరులుగా గుర్తించారా లేదా అని భగత్ సింగ్ మునిమనవడు యాదవేంద్ర సింగ్‌ ఇటీవల ఆర్టీఐ కింద హోంశాఖను సమాచారం కోరాడు.ఇందుకోసం ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలేమిటని ప్రశ్నించారు. దీంతో హోం శాఖ ఆ ముగ్గురినీ అమరవీరులుగా గుర్తించలేదని స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకొంటుందో కూడా తమకు తెలియని సమాధానం ఇచ్చింది.
దేశవ్యాప్త ఆందోళన చేపడతా: యాదవేంద్ర సింగ్
హోంశాఖ ఇచ్చిన సమాధానంతో యాదవేంద్ర సింగ్‌ నివ్వెరపోయాడు. దేశం మొత్తం తన ముత్తాతను షహీద్‌గా పిలుస్తుంటే.. అది ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.ఒకవేళ స్వాతంత్ర సంగ్రామంలో ప్రాణాలు అర్పించిన వారిని అమరవీరులుగా గుర్తించడం ప్రభుత్వ విధానం కాదంటే, ఆ విధానాన్ని మార్చాలన్నారు. ఒకవైపు కోట్లాది మంది భగత్‌సింగ్‌ను షహీద్‌గా గుర్తిస్తుంటే.. ప్రభుత్వం మాత్రం అందుకు నికాకరించడం దురదృష్టకరం అని యాదవేంద్ర సింగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై యాదవేంద్ర.. రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రపతిని కలవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.అవసరమైతే ఇందుకోసం దేశవ్యాప్త ఆందోళన చేపట్టేందుకు వెనకాడనని ఆయన పేర్కొన్నారు.
హోంశాఖ వాదన మరోలా..
ఈ విషయంపై హోంశాఖ వాదన మాత్రం మరోలా ఉంది. స్వాతంత్ర సంగ్రామంలో మరణించిన వారెనెవరినీ అమరవీరులుగా గుర్తించడం మన విధానం కాదని, కేవలం సైనిక దళాలకు చెందిన వారినే ఇప్పటివరకూ అలా గుర్తిస్తున్నారనీ హోంశాఖ చెబుతోంది.
దేశ వాప్తంగా నిరసనలు..
భగత్‌సింగ్‌ను అమరుడు కాదని కేంద్రప్రభుత్వం ప్రకటించడం పట్ల దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ చర్యకు నిరసనగా ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు క్యాంపస్‌లో ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ చిన్నవయసులోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న మహనీయుడు భగత్‌ సింగ్‌ అని తెలిపారు. పెట్టుబడిదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన యోధుడిని కేంద్ర ప్రభుత్వం కించపరిచిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం భగత్‌సింగ్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

No comments:

Post a Comment