Wednesday, August 21, 2013

ఘనంగా 'బాలయ్య' రెండో కుమార్తె వివాహం..

'నందమూరి బాలకృష్ణ' ఇంట్లో కళ్యాణ కాంతులు విరజిమ్మాయి. బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని, భరత్ ల వివాహం హైదరాబాద్ లోని హైటెక్స్ ప్రాంగణంలో వైభవంగా జరిగింది. భరత్ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మనవడు.
బంధుమిత్రులతో పాటు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. శ్రీరస్తు..శుభమస్తు.. అంటూ పెద్దలు దీవించారు..
       హైటెక్స్ కొత్త అందాలతో విరజిమ్మింది..చక్కటి పందిళ్లు..పచ్చటి తోరణాలు..కొత్త శోభతో పెళ్లి పందిరి ఇంద్రలోకాన్ని తలపించింది. బాలకృష్ణ - వసుంధర లు కళ్యాణ వేడుకకు వచ్చిన అతిథులకు స్వాగతం పలికారు. 'శ్రీభరత్'ను తల్లిదండ్రులు, బంధుమిత్రులు తీసుకొచ్చి పెళ్లి పీఠలపై కూర్చొబెట్టగా బాలకృష్ణ సతీమణి వసుంధర అల్లుడి పాదాలను కడిగి కన్యాదాన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇక పెళ్లి కూతురు..'తేజస్విని'హంసతూలికా పల్లకీలో వేదిక వద్దకు తీసుకొచ్చారు. పెళ్లి కూతురు తీసుకొచ్చే దృశ్యాలు అలరించాయి. అందాల భరిణెను చూస్తూ మైమరిచిపోయారు. సరిగ్గా టైం..8.52..వేద మంత్రాల సాక్షిగా...పండితులు..వధూవరులతో జీలకర్ర బెల్లం పెట్టించారు. అనంతరం జరిగిన వధూవరుల తలంబ్రాల ముచ్చట అందర్నీ అలరించింది. పోటీ పడి ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకున్నారు. బాలకృష్ణ దంపతులు, కుమారుడు మోక్షజ్ఞ ఈ వేడుకను చూస్తూ అతిథులంతా మురిసిపోయారు.  
          ఇక పెద్దల్లుడు 'లోకేష్' పెళ్లి పనులు చూసుకుంటూ బిజిబిజిగా గడిపారు. ఇక బాలకృష్ణ కుమారుడు 'మోక్షజ్ఞ' పెళ్లి మంటపం వద్ద నిలబడి పెద్దలకు సహకరించాడు. బాలకృష్ణ సోదరి కేంద్ర మంత్రి పురంధేశ్వరి హోదాను పక్కన పెట్టి పెద్దలను పలకరిస్తూ బంధుమిత్రుల్లో కలిసిపోయారు. బాలయ్యకు బావ, వియ్యంకుడు, ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తూ ఉల్లాసంగా గడిపారు.
     తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. దర్శకరత్న దాసరి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, తమ్మారెడ్డి, కృష్ణంరాజు దంపతులు, మోహన్ బాబు కుటుంబం, హీరోలు వెంకటేష్,గోపిచంద్, మురళిమోహన్, పరుచూరి బ్రదర్స్, జయసుధ, రాఘవేంద్రరావు, రామానాయుడు ఇంకా అనేక మంది తారలు, సినీ దిగ్గజాలు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈనాడు అధినేత రామోజీరావు,ఈనాడు ఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పురంధేశ్వరి, చిరంజీవి, జైపాల్ రెడ్డి , తమిళనాడు గవర్నర్ రోశయ్య హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, కనుమూరి బాపిరాజు, రాయపాటి సాంబశివరావు, టిడిపి నేతలు యనమల రామకృష్ణుడు, ఎర్రబెల్లి దయాకర్ రావు, అంబికా కృష్ణ, దేవినేని ఉమా, కరణం బలరాం, బిజెపి నేతలు బండారు దత్తాత్రేయ తదితరులు హాజరయ్యారు.
          కళ్యాణ వేడుకలను ఆస్వాదిస్తూనే అతిథి మర్యాదల్లో బాలయ్య కుటుంబం తరించింది. అందరి ఆశీర్వాదాలతో నూతన వధూవరులు శోభాయమానంగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు...

No comments:

Post a Comment