Thursday, August 22, 2013

ఈనెల 23న 'మద్రాస్ కేఫ్'


         
 హైదరాబాద్ : మొదటి ఎన్నో భారీ అంచనాల మధ్య మొదలైన చిత్రానికి వివాదాలు చుట్టుముట్టడంతో చిత్రం విడుదలవుతుందా ? లేదా ? అన్న సందిగ్థం నెలకొంది. చివరకు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమౌతోంది. ఆ చిత్రం..'మద్రాస్ కేఫ్'. దాదాపు 7 సంవత్సరాల పాటు నిరంతర పరిశోధనలు చేసి ఓ కథతో చిత్రాన్ని ప్రారంభించారు. మొదట్లో రాజీవ్ గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించారనే వదంతి వచ్చింది. ఇది రాజీవ్ గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించలేదని చిత్ర దర్శకుడు షూజిత్ సర్కార్ స్పష్టం చేశారు. శ్రీలంక లో జరిగిన అంతర్యుద్ధం, దానికి సంబంధించిన అంశాలను మాత్రమే తీసుకొని రూపొందించామని, రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించిన కొన్ని కీలక ఘట్టాలను మాత్రమే చిత్రీకరించామని..మిగతా చిత్రమంతా ఊహించి చిత్రించినవేనని దర్శకుడు షూజిత్ సర్కార్ చెబుతున్నారు. ఈనెల 23న ఈ చిత్రం విడుదలకు సిద్ధమౌతోంది.

            కానీ తమిళనాడులో మాత్రం 'మద్రాస్ కేఫ్' పై తీవ్ర దుమారం రేగుతోంది. ఎల్ టిటిఇ కార్యకర్తలను ఉగ్రవాదులుగా చూపించారని తమిళనాడులో నామ్ తమిళర్, ఎండిఎంకె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎల్ టిటిఇ దళాల సన్నివేశాలు ఈ చిత్రానికి కీలకమని సర్కార్ వాదిస్తున్నారు. ఈ చిత్రంలో జాతికి జరిగిన నష్టాన్ని మాత్రమే చూపిస్తున్నామని దర్శకుడు షూజిత్ సర్కార్ పేర్కొంటున్నారు. కండల వీరుడు, నటుడు జాన్ అబ్రహం తన సొంత బేనర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విడుదల కాకముందే వివాదాలు చుట్టుముట్టిన ఈ సినిమా, విడుదల తరువాత ఎన్ని వివాదాలు వస్తాయో వేచి చూడాల్సిందే.

No comments:

Post a Comment