Wednesday, August 14, 2013

పొట్టులోనూ పోషక విలువలు

తాజా కూరగాయల తొక్కల్లోనూ, కొన్ని రకాలైన పళ్ళ తొక్కల్లోనూ, గింజధాన్యాల పొట్టులోనూ పోషక విలువలు లభిస్తాయని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. బీరకాయ, లేత సొరకాయ తొక్కలను ఉపయోగించి, చట్నీ నూరవచ్చు. ఆ తొక్కలను

పారేయకుండా పచ్చి మిర్చి, ఉప్పు, కొత్తిమీరలను ముందుగా దంచి, దానిలో సొర, బీర తొక్కలను కచ్చా పచ్చాగా దంచి, వాటిని ఎండలో పెట్టాలి. అవి బాగా ఎండిన తర్వాత నిలవచేసి, వాటిని నూనెలో వేయించి, వడియాల లోనూ, ఆధరువు గానూ అన్నంలో తినవచ్చు. అవి ఎంతో రుచిగా ఉండడమే కాకుండా ఆ తొక్కలలోని పోషక పదార్థాలు నష్టపోవు. ముల్లంగి, క్యారెట్‌, టమాటో, చిలగడ దుంప లాంటి వాటిని తొక్క తీయకుండానే వాడాలి. బంగాళాదుంప (ఆలూ)ను తగినంత నీటిని పోసి ఉడికించిన తర్వాతనే పైనున్న తొక్కను వేరు చేయాలి. అప్పుడే తొక్క అడుగు భాగాన నిక్షిప్తమై ఉన్న పోషక పదార్థాలను నష్టపోకుండా కాపాడవచ్చు.
గింజ ధాన్యాలైన పెసలు, శనగలు, వేరు శెనగ పప్పులు, బాదం పప్పులు లాంటివి నానపెట్టి తినడం వల్ల వాటిలోని పోషక పదార్థాలు శరీరానికి చేరుతాయి. అయితే వాటికి పై తొక్క తీయకుండా అలా తినడమే ఆరోగ్యకరం. పెసలు, సెనగల లాంటివి నానపెట్టి, మొలకలొచ్చిన తినడం కూడా మంచిది. ఆహారపదార్థాల తయారీలో కూడా నానేసిన గింజ ధాన్యాలతో చట్నీ నూరితే ఎంతో రుచిగా ఉంటుంది. వేరుశెనగపప్పును వేయించినప్పుడు వాటిపై పొట్టును తీయకుండానే తినాలి.
గోధుమపిండిని జల్లించకుండా అల్లాగే వాడాలి. ఒకవేళ తప్పనిసరిగా జల్లించాలనుకుంటే పిండి జల్లించగా వచ్చిన పైపొట్టును పారెయ్యకుండా బజ్జీలు, పకోడీలు తయారు చేసే పిండిలో కలపవచ్చు.
ఇక పండ్ల విషయానికి వస్తే వాటి తొక్కలను పారేయకుండా సౌందర్య సాధనాలుగా వాడవచ్చు. రసం తీసేసిన నిమ్మపండు చెక్కను స్నానం చేసే నీటిలో వేసి, ఆ నీటితో స్నానం చేస్తే చర్మ వ్యాధులు రావు. చర్మం దురద పుట్టదు. ఆ నీటితో తలస్నానం చేస్తే, వెంట్రుకల ఆరోగ్యం బాగుంటుంది.
రసం తీసేసిన నిమ్మపండు డొప్పతో మోకాళ్ళు, మోచేతుల మీద రుద్దినట్లయితే నలుపు తగ్గిపోతుంది. నిమ్మడొప్పలను ఎండబెట్టి, పొడికొట్టి ఆ పొడిని కుంకుడు రసంలో కానీ, కుంకుడుకాయల పొడి లేదా సీకాయ పొడిలో కానీ కలిపి తలకు రుద్దుకుంటే వెంట్రుకలు రాలిపోకుండా ఉంటాయి.
కమలాఫలం తొక్కలను ఎండబెట్టి పొడిచేసి సున్నిపిండిలో ఆ పొడిని కలిపి రుద్దుకుంటే చర్మం కాంతిమంతంగా మారడమే కాక సువాసన భరితంగా ఉంటుంది. అదేవిధంగా కమలాఫలం తొక్కల పొడిని కుంకుడు పొడి, సీకాయ పొడిలో కలిపి తలకు రుద్దుకుంటే వెంట్రుకలు పరిమళాలను వెదజల్లుతాయి.
బత్తాయి, నారింజ, నిమ్మ, కమలాఫలం తొక్కలను ఉపయోగించి ఫేస్‌ప్యాక్‌ తయారు చేసి ముఖానికి రాసుకుంటే చర్మం కాంతిమంతంగానూ, మృదువుగానూ మారుతుంది. 

No comments:

Post a Comment