Monday, August 12, 2013

'వాద్రా' అక్రమాలపై దర్యాప్తు కోరిన కాంగ్రెస్ ఎంపి

న్యూఢిల్లీ : ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న కాంగ్రెస్ కు తాజాగా సోనియా అల్లుడు తలనొప్పిగా మారాడు. సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా హర్యానాలో భూములను ఆక్రమించుకున్నాడంటూ అనేక ఆరోపణలు
వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై విచారణ జరపాలని ఓ వైపు ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుంటే తాజాగా సొంత పార్టీకి చెందిన నేతలే వాద్రా అక్రమాలపై దర్యాప్తు కోరడంతో కాంగ్రెస్ ఇరుకునపడింది.
దోషిగా తేలితే శిక్షించాలి - ఇందర్ జిత్
 
గుర్గావ్ కు చెందిన లోక్ సభ సభ్యుడు రావ్ ఇంద్రజిత్ సింగ్ రాబర్ట్ వాద్రా భూ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హర్యానా ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, పలు అక్రమ లావాదేవీలు జరిగాయని ఆయన ఆరోపించారు. రాబర్ట్‌ వాద్రా దోషిగా తేలితే ఆయనను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంలో హర్యానా సిఎం భూపీందర్‌ సింగ్‌ పాత్రపై ఇందర్ జిత్ అనుమానాలు వ్యక్తం చేశారు.
 రియల్ ఎస్టేట్ సంస్థ డిఎల్ఎఫ్ తో వాద్రా జరిపిన భూ లావాదేవీలపై పలు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణాన్ని ముందుగా వెలుగులోకి తెచ్చిన ఐఎఎస్ అధికారి అశోక్ ఖేమ్కా పై హర్యానా సర్కార్ బదిలీ వేటు వేసింది. ఈ వ్యవహారంలో వాద్రా ఎటువంటి అనుచిత లావాదేవీలకు పాల్పడలేదంటూ హర్యానాలోని హుడా సర్కార్ ఆయనను పలుమార్లు వెనుకేసుకు వచ్చింది. దీంతో వాద్రా అక్రమాలకు హర్యానా ప్రభుత్వం పూర్తిగా సహకరించిందని కొంత కాలంగా వార్తలొస్తున్నాయి. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయల భూములను తప్పుడు డాక్యుమెంట్లతో ఆక్రమించుకున్నాడని వాద్రాపై ఆరోపణలొచ్చాయి. దీనిపై విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తూనే ఉన్నాయి. .
ఖేమ్కా కమిటీ నివేదిక
 
హర్యానాలో పలు భూ అక్రమాల్లో వాద్రాకు ప్రమేయముందని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐఎఎస్‌ అధికారి ఖేమ్కా నేతృత్వంలో హర్యానా ప్రభుత్వం అక్టోబర్‌లో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఖేమ్కా ఇచ్చిన నివేదికలోనూ వాద్రా అవినీతికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. వాద్రా తప్పుడు డాక్యుమెంట్లతో గుర్గావ్‌లోని మూడున్నర ఎకరాల స్థలాన్ని సొంతం చేసుకున్నారని ఖేమ్కా ప్రభుత్వానికి నివేదించారు. 

1 comment:

  1. కాంగ్రెస్ గోవేర్నమేంట్ లో ఎన్ని స్కంలు వచ్చిన ప్రజలు కాంగ్రెస్ కు votes వేయడము మానరు. కాంగ్రెస్ స్కామ్లు చేయక మారారు.

    ReplyDelete