'పునాది రాళ్ల' తో వెండితెరకు పరిచయమై.. సినీరంగాన్ని ఓ 'ఛాలెంజ్'గా
తీసుకుని 'విజేత' గా మారిన 'ఖైదీ' మన చిరంజీవి. గాడ్ ఫాదర్
లేకుండా 'స్వయంకృషి' తో ఎదిగిన మన గ్యాంగ్ లీడర్ పుట్టిన రోజు ఈరోజు.
చిరంజీవి.. తన కెరిర్ మొదటి నుండి చివరి వరకు ప్రతి సినిమాలోనూ తాను చేసిన పాత్రపై ఎంతో మమకారం పెంచుకున్నాడు. తెలుగు సినిమా మార్కెట్ ను తన స్టెప్పులతో దేశవ్యాప్తంగా విస్తరించాడు. తన నటనతో,నాట్యంతో మాస్ ప్రేక్షకులకు దగ్గరై 'మెగాస్టార్' గా ఎదిగాడు. ఓ వైపు ఫాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటూనే.. మరో పక్క అవార్డులు సాధిస్తూ టాలీవుడ్ కు మకుటం లేని మహారాజుగా మారాడు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసే సత్తా తన సొంతం అని నిరూపించుకున్నాడు.
'క్లాస్' నూ మెప్పించాడు
మాస్ హీరోగా ఎంత ఫాలోయింగ్ తెచ్చుకున్నాడో.. క్లాస్ సినిమాల్లో నటించి అంతే సత్తా చూపించాడు. పాత్ర ఏదైనా ప్రేక్షకులకు దగ్గరయ్యే సినిమాలనే ఎంచుకునేవాడు. అందుకోసం తన ఇమేజ్ ను సైతం పక్కన పెట్టిన సందర్భాలూ ఉన్నాయి. మాస్ హీరోగా ఫుల్ ఫాంలో ఉన్నసమయంలోనే.. ఆరాధన, స్వయంకృషి, రుద్రవీణ లాంటి సినిమాలతో నటుడిగా తానేంటో నిరూపించుకుని అవార్డులు సైతం అందుకున్నాడు.
అతిలోకసుందరికి జంటగా..
కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఆపద్భాంధవుడు' సినిమా చిరు కెరీర్లో మంచి సినిమాగా గుర్తింపుపొందింది. ఈ సినిమాలో చిరు కనబర్చిన అభినయం అద్భుతం అనే చెప్పాలి. ఈ సినిమాకు మెగాస్టార్ నంది అవార్డును అందుకున్నాడు. ఇక తెలుగు సినిమా చరిత్రలో ఓ అద్వితీయం 'జగదేకవీరుడు అతిలోకసుందరి' చిత్రం. కమర్షియల్ సినిమాకు ఉండాల్సిన అన్ని అంశాలూ ఈ సినిమాలో కనిపిస్తాయి. ఈ చిత్రంలో చిరంజీవి, శ్రీదేవి జంట కన్నులపండుగగా ఉంటుంది. అప్పటి వరకూ ఉన్న ఎన్నో రికార్డులను తుడిచివేసిన సినిమా ఇది.
ఠాగూర్ గా సంచలనం
ఒక దశలో వరుస పరాజయాల కారణంగా చిరంజీవి కెరీర్ ముగిసినట్లే అనే రూమర్లు కూడా వచ్చాయి. కానీ 'హిట్లర్' సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చి మళ్లీ విజయాల బాట పట్టాడు. చూడాలని ఉంది, బావగారూ బాగున్నారా, మాస్టర్ లాంటి డిఫరెంట్ సినిమాలు చేశాడు. అనంతరం చిరు సామాజిక అంశాలతో కూడిన సినిమాలను చేశాడు. ఇందులో 'ఠాగూర్' ఆల్ టైమ్ బెస్ట్ సినిమాగా మిగిలిపోతుంది. లంచాన్ని రూపుమాపేందుకు ఓ సాధారణ లెక్చరర్ చేసే పోరాటం నేపథ్యంలో వచ్చిన 'ఠాగూర్' ఓ సంచలనం సృష్టించింది.
రాజకీయాల్లో వెనుకంజలోనే..
తర్వాత చేసిన స్టాలిన్, శంకర్ దాదా..ఎంబిబిఎస్ కూడా చిరు కెరిర్ లో సూపర్ హిట్స్ గా నిలిచాయి. అయితే కెరీర్ చివరిలో చేసిన శంకర్ దాదా జిందాబాద్ సినిమా మాత్రం అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. తర్వాత చిరంజీవి సినీ రంగం నుండి రాజకీయ రంగంలోకి ప్రవేశించాడు. కానీ ఇప్పటికీ 'మెగాస్టార్' స్థానాన్ని మాత్రం టాలీవుడ్ లో ఎవరూ భర్తీ చేయలేకపోయారు. అయితే సినీ రంగంలో తారాజువ్వలా దూసుకుపోయిన చిరంజీవి రాజకీయ రంగంలో మాత్రం వెనుకంజలో ఉన్నారనే చెప్పాలి.. దాదాపు దశాబ్ధంన్నరపాటు సినీలోకాన్ని ఏలిన మెగాస్టార్.. రాజకీయంలోనూ రాణించాలని కోరుకుంటూ.. ఈ'అంజనీ పుత్రుని'కి పుట్టిన రోజు శుభాకాంక్షలు..

No comments:
Post a Comment