Friday, August 16, 2013

క్రీడా చరిత్రలో ఎందరో దిగ్గజాలు


క్రీడా చరిత్రలో ఎందరో దిగ్గజాలు
ప్రపంచ క్రీడా పటంలో ప్రత్యేకంగా కనిపించే భారత్ కు ..క్రీడా రంగంలో ఖ్యాతి తెచ్చిన దిగ్గజాలు ఎందరో ఉన్నారు.66 సంవత్సరాల క్రీడా రంగాన్ని ఓసారి పరిశీలిస్తే..అలనాటి
హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ నుండి..క్రికెట్ దేవుడిగా ఆరాధింపబడుతున్న సచిన్ వరకూ ఎందరో అరుదైన క్రీడాకారులు కనిపిస్తారు.క్రీడా ప్రపంచంలో దిగ్గజాలుగా నిలిచిన వారిపై ప్రత్యేక కథనం.

ఛాంపియన్లు కొందరే
 భారత దేశం క్రీడారంగంలో ఎంతో వెనుకబడి ఉంది. 1928 ఆమ్ స్టర్ డామ్ ఒలింపిక్స్ నుండి కేవలం హాకీ ద్వారా మాత్రమే బంగారు పతకాలు గెలుచుకుంటూ వచ్చిన భారత్.. వ్యక్తిగత విభగంలో సైతం స్వర్ణ పతకాలు సాధించే స్థాయికి ఎదిగింది.అయితే వివిధ క్రీడల్లో ఛాంపియన్లుగా నిలిచిన క్రీడాకారులు మాత్రమం అతికొద్దిమందే..
8 పతకాలు హాకీ ద్వారానే
 పేరుకు మన దేశ జాతీయ క్రీడ హాకీ అయినా..క్రికెట్టే జాతీయ క్రీడ అన్నట్లుగా పాతుకుపోయింది. 1983లో భారతజట్టు తొలిసారిగా వన్డే ప్రపంచకప్ ను సొంతం చేసుకుంది. అప్పటి నుండి క్రికెట్ అంటే భారతీయుల్లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. అయితే ఇప్పటి వరకు భారతదేశానికి ఎక్కువ బంగారు పతకాలు అందించిన ఘనత హాకీకే దక్కుతుంది. ఒలింపిక్స్ చరిత్రలో ఇప్పటివరకు భారత జట్టు 9 బంగారు పతకాలను సొంతం చేసుకుంటే.. ఇందులో 8 పతకాలు హకీలో వచ్చినవే.
ధ్యాన్ చంద్ జయంతిరోజే పురస్కారాల ప్రదానం
 మనదేశానికి ఒలింపిక్స్ లో వరుసగా మూడుసార్లు పసిడి పతకాలను అందించిన ఏకైక కెప్టెన్ గా హకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ చరిత్రకెక్కాడు.ఆయన దేశానికి చేసిన ఎనలేని సేవలను గుర్తిస్తూ..ధ్యాన్ చంద్ జయంతి రోజునే జాతీయ క్రీడా పురస్కారాలు, రాజీవ్ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్ చంద్ అవార్డులు ప్రదానం చేయడం ఆనవాయితీగా వస్తోంది.
క్రికెట్ లో ఎందరో..
 భారత్ లో అత్యంత జనాదరణ పొందుతున్న క్రికెట్ ప్రతిష్టను దశదిశలా వ్యాప్తి చేసిన క్రీడాకారుల్లో తెలుగుతేజం సికె నాయుడు నుండి..1983 ప్రపంచ కప్ కెప్టెన్ కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, సెహ్వాగ్, యువరాజ్, ధోనీ, విరాట్ కోహ్లీ..ఇలా అనేక మంది ఉన్నారు. అయితే భారత క్రికెట్ లో ఎందరు ఆటగాళ్లు ఉన్నా..వారంతా సచిన్ తర్వాతే వస్తారు. సచిన్ భారత దేశ క్రీడా రంగానికే ఓ ఐకాన్ గా నిలిచాడు. భారత దేశానికి ప్రపంచకప్ ను అందించాలని పరితపించాడు. తన కలను నెరవేర్చుకోవడానికి 22 ఏళ్లు ఎదురుచూశాడు. 2011లో మనదేశంలోనే జరిగిన వన్డే ప్రపంచకప్ టైటిల్ ను టీం ఇండియా సొంతం చేసుకోవడంలో మాస్టర్ కీలక పాత్ర పోషించాడు. టెస్ట్ లు, వన్డేలు కలిపి వంద సెంచరీలు సాధించిన ఒకే ఒక్క క్రికెటర్ గా సచిన్ చరిత్ర సృష్టించాడు.
సచిన్ తర్వాత ధోనీ
 క్రికెట్ లో భారత దేశానికి తొలి ప్రపంచ కప్ ను అందించిన కెప్టెన్ గా కపిల్ దేవ్ చరిత్ర సృష్టిస్తే..కష్టాల్లో ఉన్న భారత జట్టును రెండు సార్లు విశ్వవిజేతగా నిలిపిన జార్ఖండ్ డైనమైట్ మహేందర్ సింగ్ ధోనీ చరిత్రను తిరగరాశాడు. సచిన్ తర్వాత ధోనీ అంతటి రేంజ్ లో పాపులర్ అయ్యాడు.
చదరంగంలో విశ్వనాధన్
 ఇక చదరంగ రారాజు విశ్వనాధన్ ఆనంద్ .ఇప్పటి వరకు ఐదు సార్లు ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ టైటిల్ ను సొంతం చేసుకుని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.
బ్యాడ్మింటన్ లో ప్రకాశ్ మించిన వారు లేరు
 బ్యాడ్మింటన్ లో ప్రకాశ్ పదుకొనే ఎన్నో అరుదైన రికార్డులను నెలకొల్పారు. 1980లో తొలిసారిగా ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్ ను సొంతం చేసుకున్న తొలి భారతీయుడిగా ప్రకాశ్ రికార్డుకెక్కాడు.ఇప్పటి వరకూ బ్యాడ్మింటన్ లో ప్రకాశ్ ను మించిన ప్లేయర్లు లేరంటే అతిశయోక్తి కాదు.
అభినవ్ ఘనత
 షూటింగ్ లో రైఫిల్ షూటర్ అభినవ్ బింద్రా, విజయ్ కుమార్ ప్రతిభ కనబరుస్తున్నారు.అభినవర్ బింద్రా..28 సంవత్సరాల తర్వాత భారత దేశానికి బంగారు పతకాన్ని అందించిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.2008 బీజింగ్ ఒలింపిక్స్ లో తన సత్తా చూపించి దేశానికే గర్వకారణంగా నిలిచాడు.
కబడ్డీలో మనమే ఫస్ట్
 ఇక మనదేశంలో పుట్టిన కబడ్డీ ఆటలో భారత జట్టు హవానే కొనసాగుతోంది. కబడ్డీలో నెంబర్ వన్ మనమే. 2004 నుండి 2012 వరకు జరిగిన ఐదు కబడ్డీ ప్రపంచ కప్ టైటిల్స్ ను మనదేశమే సొంతం చేసుకుంది. 2012లో తొలిసారిగా జరిగిన మహిళల ప్రపంచకప్ ను సైతం భారత జట్టే సొంతం చేసుకుంది.
 ఇక బిలియర్డ్స్ లోనూ భారత్ కు ప్రత్యేక స్థానముంది. మైఖేల్ ఫెరారియా, గీత్ సేధీ కూడా బిలియర్డ్స్ లో అద్భుతంగా రాణించారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ లో.. అశ్వినీ నాచప్ప, పిటి ఉష పరుగుల రాణులుగా పేరు తెచ్చుకున్నారు. పురుషుల్లో మిల్కాసింగ్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు.
 రజ్లింగ్ లో యోగేశ్వర్ దత్, సుశీల్ కుమార్ ముందంజలో ఉన్నారు. టెన్నిస్ లో సానియా, పేస్ తమ ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నారు. ఇప్పటి వరకు 117 ఏళ్ల చరిత్ర గల ఒలింపిక్స్ లో భారత దేశం మొత్తం 26పతకాలు మాత్రమే సాధించగలిగింది. ఇందులో తొమ్మిది బంగారు పతకాలు, ఆరు వెండి పతకాలు, 11 కాంస్య పతకాలు ఉన్నాయి. 2000 సిడ్నీ ఒలింపిక్స్ లో మన తెలుగుతేజం కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ లో కాంస్య పతకాన్ని సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 2012 లండన్ లో జరిగిన ఒలింపిక్స్ లో భారతదేశం అత్యధికంగా 6 పతకాలు సాధించింది. ఎక్కడో మారుమూల ప్రాంతంలోని ఓ పేద కుటుంబంలో పుట్టిన మేరీకామ్ ప్రపంచ చాంపియన్ గా అవతరించింది.

No comments:

Post a Comment