హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులు నిండు కుండల్ని తలపిస్తున్నాయి. గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం 53 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. ఖమ్మం జాయింట్ కలెక్టర్ సురేంద్ర మోహన్, సబ్ కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా పరిస్థితులను సమీక్షించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు వరదనీరు 58 అడుగులకు చేరే అవకాశం ఉందని వెల్లడించారు. కాళేశ్వరం, పెన్ గంగ, ఇంద్రావతి జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. తాలిపేరు ప్రాజెక్టు నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు.
ఆదిలాబాద్ జిల్లాలో గురువారం 8.1 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. బజార్ హత్నూరు మండలంలో అత్యధికంగా 16.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పెన్ గంగా, ప్రాణహిత నదుల్లోకి భారీగా వరద చేరుతోంది. దీంతో సరిహద్దు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్వర్ణ, గడ్డెన్న, కొమరంభీం, మత్తడివాగు, కడెం ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు చేరుతోంది. వర్షాలతో సింగరేణి వ్యాప్తంగా 15 ఉపరిత గనుల్లో 1.50లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వస్తుండడంతో 26 గేట్ల ద్వారా కిందకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి మాత్రం వరదనీటి ప్రవాహం తగ్గడంతో ఔట్ ఫ్లో తగ్గించారు. ఆలమట్టి నుంచి కూడా నీటి విడుదల తగ్గించారు. జలాశయం నుంచి 1.68 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

No comments:
Post a Comment