ఈ ఆధునిక యుగంలో ప్రపంచీకరణ నేపథ్యంలో వేగం ఎక్కువని అందరికీ తెలిసిందే! మరీ ముఖ్యంగా మహా నగరాలు, నగరాల్లో జీవించేవారు గంటల తరబడి ప్రయాణాలతో అలసిసొలసి
కార్యాలయాలలో విధులు నిర్వహించి ఇంటికి చేరి ఉస్సూరని నిట్టూర్చుతూ ఉంటారు. వారాంతపురోజుల్లో మాత్రమే (చాలామంది ఐ.టి. ఉద్యో గుల్లాంటివారు) కూరలు, పచారీ సరుకులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మరి కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు వంటివి నిల్వచేసుకోవాలి. ఎలా?
కొంతమంది సరదాగా 'ఐస్‌పెట్టి' అని 'చద్దిపెట్టె' అని సరదాగా పిలుచుకునే 'ఫ్రిజ్' ఉండనే ఉంది. ఫ్రిజ్‌ని ఎడా పెడా వాడితే నిల్వ ఉంచిన పదార్థాలు, ఫ్రిజ్ రెండు పాడవు తాయి. అందుచేత కొన్ని విషయాలు తెలుసుకుంటే వస్తువులు పాడవకుండా ఆదా చేయొచ్చు. ఫ్రిజ్‌ని దీర్ఘకాలం మన్నేట్లు జాగ్రత్తపడొచ్చు. మరి ఫ్రిజ్ వాడకంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో చూద్దామా!
1) 24 గంటలు ఫ్రిజ్‌ను ఆన్ చేసి, ఉంచాలి. (ఈ పవర్ కట్ సమయంలో మనము చేయగలిగేది లేదు). కొంతమంది మధ్యమధ్యలో స్విచ్ ఆపితే కరెంట్ ఆదా అవుతుంది అనుకుంటారు. అయితే కరెంటు ఆదా కాకపోగా ఫ్రిజ్ పాడయ్యే అవకాశమే ఎక్కువ.
2) ఫ్రిజ్ సరిగా పనిచేయడానికి మూలం వెనుక బిగించిన కంటెన్సరే జీవం. కాబట్టి దానిని అప్పుడప్పుడు స్విచ్ ఆఫ్ చేసి శుభ్రపరచుకోవాలి.
3) ఫ్రిజ్ కవర్లు అందాన్ని ఇవ్వడమేగాక మరకలు పడకుండా ఎల్లప్పుడూ 'ఫ్రిజ్‌లోంచి తీసినా యాపిల్'లా ఫ్రిజ్‌ను మెరిసేలా ఉంచుతాయి.
4) వేడి పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. పూర్తిగా చల్లారిన తరువాతనే పెట్టాలి.
5) మాల్స్‌లో కూరగాయలు కొనడం ఫ్యాషన్ అయింది ఈనాడు. అక్కడా ప్యాక్ చేసిన కవర్లను తెచ్చి, వాటిని అలాగే ఫ్రిజ్‌లో పెట్టగూడదు. కవర్లలో నుంచి తీసే యాలి. రైతుబజార్లు, మార్కెట్ల నుండి తెచ్చిన కూర గాయలు కూడా ఎంతో కొంత తడిగా ఉంటాయి. కాబట్టి కూరగాయలని తడిలేకుండా తుడిచి, ఆరిన తర్వాత వేరే కవర్లలో ఉంచి, ఫ్రిజ్‌లో ఉంచాలి.
6) ఆకుకూరలని కూడా శుభ్రంగా కడిగి, తడి లేకుండా ఆరిన తరువాత పాలిథిన్‌కవర్లో పెట్టాలి. ఆకు కూరల వేర్లు తీసివేయమని చెప్పవలసిన అవసరం లేదు.
7) కూరగాయాలు, పళ్ళు, పూలు వంటి వాటిని కవర్లలో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచితే మిగిలిన పదార్థాలకు వీటి వాసన సోకకుండా ఉంటుంది. (పూల సువాసన ఆహారపదార్థాలకు సోకితే తినబుద్ధేస్తుందా? ఒక్కసారి ఊహించండి).
8) పాలు, పెరుగు, వెన్న, ఇడ్లీ, దోసెల పిండిని పాత్రలలో ఉంచి మూతలు పెట్టిన తర్వాత మాత్రమే ఫ్రిజ్‌లో పెడితే ఫ్రిజ్‌లో దుర్వాసన వచ్చే పరిస్థితి నివారించుకోవచ్చు.
9) మంచినీరు, డ్రింకులు వంటి వాటిని సీసాలు మూతలు బిగించి పెట్టాలి. లేకుంటే అవి ఒలికి ఫ్రిజ్‌లోని వస్తువులు తడిసి, పాడవుతాయి. మనము ఫ్రిజ్‌ను ఎందుకు ఉపయోగించుకుంటున్నామో ఆ ఆశయం నెరవేరదు.
10) సరే కూరలు, పళ్ళు, ద్రవపదార్థాలు, పాలు, పిండి, వగైరాలు నిల్వ ఉంచుకోవచ్చు కదా! ఫ్రిజ్ ఖాళీ లేకుండా ఇరికించి పెడితే అవి ముఖ్యంగా కూరలు, పళ్ళు, రాపిడికి గురై కుళ్ళిపోతాయి. కాబట్టి మనము ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుకునే పదార్థాల పరిమాణాన్ని బట్టి మనకు అవసరమైనంత కెపాసిటీ ఉన్న ఫ్రిజ్‌ను కొనడం మంచిది.
11) మరో ముఖ్య విషయం. ఈ రోజుల్లో ఇద్దరూ ఉద్యోగాలకు వెళుతున్నారు. (చాలా కుటుం బాల్లో) పిల్లలు ఇంట్లోని అన్ని వస్తువులను యథేచ్ఛగా ఉపయోగించడం తప్పనిసరి. కాబట్టి పిల్లలకు కూడా ఈ మెలకువలను తెలియజెప్పాలి.
12) ముఖ్యంగా ఫ్రిజ్ తలుపులు ఎక్కువసేపు తెరచి ఉంచకూడదని, అలాచేస్తే కరెంటు ఖర్చు ఎక్కువ అవు తుందని, కూలింగ్ కెపాసిటీ తగ్గి, కండెన్సరు పాడవు తుందని తెలియజెప్పాలి.
13) చివరిగా పాతతరం ఫ్రిజ్ అయితే నెలకు రెండు, మూడు సార్లు డ్రీఫాస్ట్ చేసి లోపల, బయట శుభ్రంగా తుడుచు కోవాలి. ఈ మధ్యకాలంలో ఆటోమాటిక్ డ్రీఫాస్ట్ జరిగే ఫ్రిజ్‌లు దొరుకుతున్నాయి. అయితే శుభ్రం చేసుకోవడం మాత్రం ఆటోమాటిక్ కాదు. అది గమనించాలి. అయినా ఈ పవర్‌కట్ యుగంలో ప్రతిరోజు ఎంతో కొంతమేర ''ఫ్రిజ్ డీఫ్రాస్టింగ్‌కు'' సాయం చేస్తున్న విద్యుత్‌శాఖని, ప్రభుత్వాన్ని మెచ్చుకుని తీరాలనిపించడం లేదా! సరే ఈ విషయంలో ఎవరి అభిప్రాయం వారిది.
ఈ విధంగా ఫ్రిజ్ వాడుకోవడానికి ఈ జాగ్రత్తలను తీసుకుంటే మనము నిల్వ ఉంచుకునే పదార్థాలూ భద్రం..! మనకూ భద్రం..! ఇవేకాకుండా ఇంకా ఇతరత్రా తెలిసిన జాగ్రత్తలను పాటించడం మంచిది. ఫ్రిజ్ ఉంది కదా అని వండినపదార్థాలని మరీ ఎక్కువరోజులు నిల్వ ఉంచొద్దు. అలా చేస్తే అది అప్పుడు 'అనారోగ్యాన్నిచ్చే చద్దిపెట్టే' అవుతుంది. తస్మాత్! జాగ్రత్త సుమీ!!

No comments:
Post a Comment