Tuesday, July 2, 2013

ప్రజానుకూల ప్రత్యామ్నాయం


కాంగ్రెస్‌, బిజెపిలకు వ్యతిరేకంగా విధానాల ఆధారంగా ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక రూపకల్పనకు లౌకిక పార్టీలు, ప్రజా సంఘాలు ముందుకు రావాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి. ప్రత్యామ్నాయ ఆర్థిక, సామాజిక, విదేశాంగ విధానాల ఆధారంగానే ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు సాధ్యమౌతుందని స్పష్టం చేశాయి. ఈమేరకు పది ప్రత్యామ్నాయ విధానాలతో కూడిన డిక్లరేషన్‌ను నాలుగు వామపక్ష పార్టీలు సోమవారమిక్కడ విడుదల చేశాయి. ఈ ప్రత్యామ్నాయ విధానాలపై దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేపట్టాలని, ఈ విధానాల ఆధారంగా ప్రజాతంత్ర శక్తులను సమీకరించాలని నిర్ణయించాయి. సిపిఎం, సిపిఐ, ఫార్వర్డ్‌బ్లాక్‌, ఆర్‌ఎస్‌పి ఆధ్వర్యంలో సోమవారం ఇక్కడి మావలాంకర్‌ ఆడిటోరియంలో రాజకీయ సదస్సు జరిగింది. ప్రత్యామ్నాయ విధానాలతో కూడిన డిక్లరేషన్‌ను సదస్సులో తొలుత సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌ కారత్‌ ప్రతిపాదించారు. తొమ్మిదేళ్ళ యుపిఎ పాలనలో ఆర్థిక వ్యవస్థ మరింతగా తిరోగమనంలోకి వెళ్లిపోయిందని, నిత్యావసరాలతో పాటు అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని ఈ సందర్భంగా కరత్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలే ఈ పరిస్థితికి మూలకారణమని పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతోన్న తరుణంలో చిల్లర వర్తకంలోకీ ప్రభుత్వం విదేశీ పెట్టుడులను అనుమతిస్తోందన్నారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళల పరిస్థితులు దిగజారుతోంటే యుపిఎ ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు వరాలు కురిపిస్తోందన్నారు. గత ఐదేళ్లలో నిరుద్యోగం ఎన్నడూ లేని విధంగా పది శాతానికి మించి పోయిందన్నారు. కెజి బేసిన్‌ గ్యాస్‌లో ఉత్పత్తి అవుతోన్న గ్యాస్‌ ధరను రిలయన్స్‌కు అనుకూలంగా యూనిట్‌కు 250 నుండి 500 రూపాయలకు పెంచుతూ కేంద్రం ఇటీవల తీసుకున్న నిర్ణయం ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతోందన్నారు. ప్రజలపై, ఆర్థిక వ్యవస్థపై మరిన్ని భారాలు తప్పవని తెలిసీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసు కుందని విమర్శించారు. యుపిఎ హయాంలో దేశంలోని సహజ వనరుల దోపిడీ తీవ్రమయ్యిందని, ఫలితంగానే భారీ కుంభకోణాలూ రోజుకొకటిగా వెలుగు చూస్తున్నాయని పేర్కొన్నారు. ఆర్థిక విధానాలు, అవినీతిలో కాంగ్రెస్‌, బిజెపిలకు తేడా లేదన్న విషయంలో ఇటీవల మరింత స్పష్టమయ్యిందన్నారు. ఎన్‌డిఎ హాయంలో ప్రారంభించిన విధానాలను యుపిఎ ప్రభుత్వం మరింత ముందకు తీసుకెళ్లిందన్నారు. కర్ణాటకలో పరాకాష్టకు చేరిన బిజెపి ప్రభుత్వ అవినీతిని దేశమంతా గమనించిందన్నారు. అమెరికా అనుకూల విదేశాంగ విధానం అమలు చేయడం ద్వారా యుపిఎ ప్రభుత్వం దేశ సార్వభౌమత్వాన్నే తాకట్టు పెడుతోందన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌, బిజెపిలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం ఏర్పడాల్సిన అవసరం ముందుకొచ్చిందన్నారు. 'ఎన్నికల సర్దుబాట్లు, ఎన్నికల అనంతర ఒప్పందాల ఆధారంగా ఇటువంటి రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు సాధ్యం కాదు. గత రెండు దశాబ్దాల అనుభవమూ ఇదే చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ విధానాల ఆధారంగానే రాజకీయ ప్రత్యామ్నాయం సాధ్యమౌతుందన్నది స్పష్టం' అని కరత్‌ వ్యాఖ్యానించారు. గుజరాత్‌ నమూనా పేరుతో కార్పొరేట్‌ శక్తులకు నరేంద్ర మోడీ చేసిన సేవను ఇప్పుడు బిజెపి జాతీయ స్థాయిలోనూ అమలు చేయాలని చూస్తోందన్నారు. ఈ నేపథ్యంలోనే ముకేష్‌ అంబానీతో సహా బడా కార్పొరేట్‌ సంస్థల అధిపతులందరూ మోడీని స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. 'రాజకీయంగా చూస్తే ఇప్పుడు యుపిఎ, ఎన్‌డిఎ అంతర్గత కలహాలతో బలహీనమయ్యాయి. వామపక్షాలుగా మేం సూచిస్తోన్న ప్రత్యామ్నాయ విధానాలపై ఈపాటికే పోరాటాలు నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులోనూ పోరాటాలు ఉధృతం చేస్తాం. ఈ విధానాలను ముందుకు తీసుకెళ్లడానికి జాతీయ స్థాయిలో రాజకీయ ప్రత్యామ్నాయం అవసరం. అటువంటి ప్రత్యామ్నాయం ఏర్పాటుకు ముందుకు రావాలని ప్రజాతంత్ర శక్తులు, లౌకిక పార్టీలకు పిలుపునిస్తాం. అటువంటి ప్రత్యామ్నాయం ఏర్పాటుకు మాతో కలిసి పనిచేయండి ' అని కరత్‌ పిలుపునిచ్చారు. యుపిఎ పాలనలో పేద-ధనిక తేడాలు మరింత పెరగడమే ప్రభుత్వ విధానాలకు అద్దం పడుతోందని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి పేర్కొన్నారు. 'ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన పదిమందిలో నలుగురు భారతీయులున్నారు. అత్యంత పేదల్లో 30 శాతం మందీ దేశంలోనే ఉన్నారు. సంస్కరణల అమలుతోనే ఈ పరిస్థితి మరింత పెరిగింది' అని పేర్కొన్నారు. విధానాలపై చర్చ జరగకుండా కేవలం రాహుల్‌గాంధీ, మోడీలపై పోటీకే కార్పొరేట్‌ మీడియా పరిమితమవ్వడం ఉద్దేశపూర్వకంగానే జరుగుతుందన్నారు. వామపక్షాలు లేకుండా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాటూ సాధ్యం కాదని సురవరం స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం పేరుతో దేశంలో పెట్టుబడిదారీ విధానం అమలౌతోందని ఆరు దశాబ్దాల అనుభంలో ప్రజలు తెలుసుకున్నారని ఫార్వర్డ్‌బ్లాక్‌ ప్రధాన కార్యదర్శి దేవబృత బిశ్వాస్‌ వ్యాఖ్యానించారు. కార్పొరేట్‌ సంస్థలకు దేశ వనరులను అమ్మేందుకు రాజకీయ పార్టీల నేతలు, అధికారులూ అమ్ముడుపోతున్నారని విమర్శించారు. దేశంలో ప్రస్తుతం నేతలకు కొరత లేదని, ప్రజానుకూల విధానాలు లేకపోవడమే పెద్దలోపమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. 'ద్రవ్యలోటు ఐదు లక్షల కోట్ల రూపాయలకు చేరడం వల్లే సబ్సిడీల్లో కోతలు విధిస్తున్నామని, ప్రజానుకూల చర్యలు చేపట్టలేకపోతున్నామని ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి ఈ ఏడాది బడ్జెట్‌లో ఐదున్నర లక్షల కోట్ల రూపాయలను కార్పొరేట్‌ సంస్థలకు పన్ను మినహాయింపుగా ఇచ్చారు. ఈ పన్నులే వసూలు చేస్తే దేశంలోని బాలబాలికలందరికీ ఉచిత విద్య అందించడానికి, పేదలందరికీ ఆహారధాన్యాలు అందించడానికి నిధులుండేవి. వామపక్షాలు ప్రచారం చేస్తోన్న ప్రత్యామ్నాయాలు ఇవే' అని ఏచూరి వ్యాఖ్యానించారు. నాలుగు పార్టీల నేతల ప్రసంగాలూ పూర్తైన తర్వాత కరత్‌ ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ విధానాల డిక్లరేషన్‌ను సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. సదస్సు ముగింపులో ఉత్తరాఖండ్‌ బాధితులకు రెండు నిమిషాలు సంతాపం ప్రకటించారు. వామపక్ష పార్టీల ఎంపీలందరూ తమ ఎంపీలాడ్స్‌ నిధుల నుండి ఉత్తరాఖండ్‌ బాధితుల కోసం 50 లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు సదస్సులో ప్రకటించారు. బృందాకరత్‌ (సిపిఎం), అమర్‌జిత్‌కౌర్‌ (సిపిఐ), అబనీరారు (ఆర్‌ఎస్‌పి), వరుణ్‌ముఖర్జీ (ఫార్వర్డ్‌బ్లాక్‌) సదస్సుకు అధ్యక్షత వహించారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రామచంద్రన్‌ పిళ్లై, ఎకె పద్మనాభన్‌, సిపిఐ జాతీయ నేత డి.రాజా తదితరులు సదస్సులో పాల్గొన్నారు. నాలుగు వామపక్ష పార్టీల కార్యకర్తలు అంచనాలకు మించి హాజరవ్వడంతో ఆడిటోరియం కిటకిటలాడింది. 

No comments:

Post a Comment