Saturday, July 27, 2013

తెరపైకి ప్రియాంక గాంధీ


ఢిల్లీ : రానున్న ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. మోడీ దూకుడుకు కళ్లెం వేసేందుకు ప్రియాంక గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ప్రచార ఎత్తుగడలతో ఇమేజ్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న మోడీకి చెక్ పెట్టడానికి కాంగ్రెస్ కసరత్తును మొదలుపెట్టింది. ఉత్తర ప్రదేశ్ లోని రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి ప్రియాంకగాంధీ పోటీచేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. 
తెరపైకి ప్రియాంక గాంధీ :
    అంతర్గత సర్వేలతో కంగుతిన్న కాంగ్రెస్ తెరమీదకు ప్రియాంక గాంధీని తీసుకువస్తోంది. 2014 ఎన్నికలకు కాంగ్రెస్ వ్యూహ కర్తలు పకడ్బందీ వ్యూహరచన చేస్తున్నారు. ఢిల్లీ సింహాసనం చేజిక్కించుకోవడంలో అత్యంత కీలకపాత్ర పోషించే ఉత్తర్ ప్రదేశ్ లో వీలైనన్ని సీట్లు సాధించేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. అచ్చం నాయనమ్మ ఇందిరాగాంధీ పోలికలతో ఉండే ప్రియాంకను రంగంలోకి దించితే సానుకూల ఫలితాలు సాధించవచ్చని ఆ పార్టీ భావిస్తోంది. అయితే, ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ఇప్పటిదాకా పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుండి కాంగ్రెస్ గట్టెక్కాంలంటే ప్రియాంకను పోటీలో దింపడం తప్ప వేరే గత్యంతరం లేదనే అభిప్రాయానికి కాంగ్రెస్ అధిష్టానం వచ్చింది. యూపీలో ప్రతికూల వాతావరణం ఉన్నట్లు అంతర్గత సర్వేలు కూడా హెచ్చరించడంతో ప్రియాంక కూడా పోటీ చేయడమే మంచిదనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలి నియోజకవర్గానికి ప్రియాంక ఇన్ ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు.
పనిచేయని రాహుల్ చరిష్మా
    రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవి చేపట్టడంతో మునపటిలా ఉత్తర్ ప్రదేశ్ మీద పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నారు. పార్టీని పటిష్టం చేసేందుకు రాహుల్ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, పెద్దగా ప్రయోజనం దక్కలేదు. దీంతో రాహుల్ జనాకర్షక శక్తిపై కాంగ్రెస్ వ్యూహకర్తలు డైలమాలో పడ్డారు. ప్రియాంకను కూడా తెరమీదకు తెచ్చేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రానున్న గడ్డుపరిస్థితుల్ని ప్రియాంక ఏవిధంగా గట్టేక్కిస్తోందో వేచిచూడాలి.

No comments:

Post a Comment