Sunday, July 28, 2013

'రాయల'పై బిజెపి రూటు ఎటువైపు?

హైదరాబాద్ : పార్లమెంటులో రాయల తెలంగాణను బిజెపి అడ్డుకుంటుందంటూ ప్రచారం చేసుకునేందుకే కాంగ్రెస్ ఎత్తుగడ వేస్తోందని కమలనాథులు 
అనుమానిస్తున్నారు. తెలంగాణపై పార్లమెంటులో బిల్లు పెడితే ప్రధాన ప్రతిపక్షం బిజెపి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించింది.  కాంగ్రెస్ ఒకవేళ రాయల తెలంగాణకు బిల్లు తెస్తే  ఆ పార్టీ ఎలా స్పందిస్తుందని ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలో ఇప్పుడు ఇదే అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే రాష్ట్ర విభజన అనివార్యమైతే తాము రాయల తెలంగాణకు మద్దతు నిస్తామని గతంలోనే ఎంఐఎం ప్రకటించింది. అధిష్టానం విభజనపై తన నిర్ణయాన్ని ప్రకటంచనప్పటికీ ఊహాగానాలు మాత్రం ఊపందుకుంటున్నాయి. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రతిపాదన లీకేజీలను ముందుకు తెస్తుందనే అభిప్రాయంలో ఆయా పార్టీల నేతలున్నారు.
మరోవైపు రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకించి  పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకు ఉద్యమించాలని కూడా బిజెపి నేతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాయల తెలంగాణ ప్రతిపాదనను టిఆర్ఎస్, టిజెఎసి, ఎంఆర్ పిఎస్ వ్యతిరేకించాయి. ఇదే విషయమై కాంగ్రెస్ విన్యాసాలపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాయల తెలంగాణపై  ప్రధాన ప్రతిపక్షం బిజెపి ఎటువంటి స్టాండ్ తీసుకుంటుందోనని  అందరూ వేచిచూస్తున్నారు. 
అయితే రాయల తెలంగాణ అంశాన్ని తెరమీదకు తేవడమంటే సమస్య మరింత జఠిలం చేయడమనే అభిప్రాయంలో బిజెపి నేతలున్నారు. ఈ ప్రతిపాదన వల్ల సమస్య పరిష్కారం కాకపోగా, మరిన్ని కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని ఆ పార్టీ నేతలు అయోమయంలో ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు రాయలసీమకు చెందిన కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేసే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు ప్రచారం జోరందుకుంటోంది. ఈ విషయంపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇన్ చార్జ్ గులాంనబీ ఆజాద్ ఇప్పటికే  కొంతమంది నేతలతో మాట్లాడినట్లు కూడా ప్రచారం సాగుతోంది.అయితే కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఈ ప్రతిపాదనకు సానుకూలంగా ఉన్నారనే ప్రచారమూ నడుస్తోంది. కానీ, పార్లమెంటులో బిల్లు పాస్ కావాలంటే ప్రధాన ప్రతిపక్షం బిజెపి మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. దీంతో దాని వైఖరి ఎటువైపు ఉంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

No comments:

Post a Comment