Wednesday, July 31, 2013

ఈ వెబ్‌సైట్‌ మహిళలకు మాత్రమే

దేశం మొత్తంలో మొదటిసారిగా కేవలం మహిళల కోసం ఓ నెట్‌వర్క్‌ సైట్‌ను ప్రారంభించారు కొందరు హైదరాబాద్‌ వాసులు. హైదరాబాద్‌లోని బిట్స్‌- పిలానికి చెందిన యువకుల బృందం
ఒకటి ఈ కృషిని ప్రారంభించింది. ఈ బి.టెక్‌ పట్టభద్రులు ప్రముఖ సినీ నటుడు ఉదరు కిరణ్‌ భార్య విషితను తమ బృందంలో కలుపుకొన్నారు. వారు - ప్రత్యూష్‌, ప్రద్యుమ్న్‌, నయన్‌ , తేజేష్‌, ప్రణీత. విషిత, ప్రణీతలు ఇద్దరూ కమ్యూనికేషన్‌లో విల్లా మేరీ, సెయింట్‌ ఫ్రాన్సిస్‌ సంస్థల విద్యార్థులు.

'ఉమన్‌స్పేస్‌ డాట్‌ ఇన్‌'' వారు ఆరంభించిన నెట్‌వర్కింగ్‌ సైట్‌ పేరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయమహిళలను ఒకే గొడుగు క్రిందికి తేవడం వారి లక్ష్యం. చాటింగ్‌, బొమ్మలు పంచుకోవడం వంటి నిత్య కార్యకలాపాలతోబాటు ఈ మహిళల ప్రత్యేక వెబ్‌ సైట్‌ 8 మార్గాలలో విషయ జ్ఞానం అందిస్తుంది. షాపింగ్‌ చేయడం, ఉత్పత్తుల గురించిన సమాచారం పొందవచ్చు. ఆరోగ్య, సౌందర్య చిట్కాలు తెలుసు కోవచ్చు, వంటకాల సమాచారం ఇతరులతో పంచుకోవచ్చు. మంచి తల్లితండ్రులుగా ఎలా ఉండాలో తెలుసు కొంటూనే, పారిశ్రామిక వేత్తగా రాణించడానికి సంబంధించిన సలహాలూ పొందవచ్చు.
ఇన్ని విధాలుగా మహిళలకు సేవలను అందించడానికి ఉద్దేశించిన ఈ సైట్‌ ఆలోచన నేపథ్యాన్ని 23 ఏళ్ల నయన్‌ వివరిస్తూ, ''బి.టెక్‌ రెండో సంవత్సరం తరువాత మాకు ఈ ఆలోచన వచ్చింది. మహిళలకు ఏదైనా చేయాలన్న తపన కలిగింది మా అమ్మ గారి వల్లనే. ఆమె తన దైనందిన జీవితంలో ఎప్పుడూ ఘర్షణ పడుతుండడం చూశాను. అందరు మధ్య వయస్సు మహిళలకూ ఉపయోగపడేలాగా ఏదైనా చేయాలని ఆమె నన్ను పురమాయించారు. అప్పుడు మా స్నేహితులందరం కలిసి విషయ జ్ఞానాన్ని పంచుకొనే రీతిలో మహిళలకు ప్రత్యేకంగా సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ను తెరవాలని నిర్ణయించుకొన్నాం'' అని చెప్పారు.
''మహిళలకు ఏమి కావాలో తెలుసు కాబట్టి విషిత, ప్రణీతలను ఇందులోకి దించాలని అనుకొన్నాం'' అన్నాడు నెల్లూరుకు చెందిన తేజేష్‌. ''మాకు సాంకేతిక నైపుణ్యం ఉంది కాని కమ్యూనికేషన్ల నేపథ్యం ఉన్న వాళ్లు అప్పటి మా అవసరం. వాళ్లిద్దరి ఉనికి అలా తటస్థ పడింది'' అని తెలిపారు. ఆగస్టు 1 నుంచి అధికారికంగా ప్రారంభిస్తున్న ఉమన్‌స్పేస్‌ డాట్‌ ఇన్‌ను చిన్నగా ఈ ఫిబ్రవరిలో ట్రయల్‌ రన్‌లా ప్రారంభించారు. ఈ విషయాన్ని విషిత చెబుతూ, తాము విస్తారంగా సర్వే కూడా జరిపామనీ, 500 మంది మహిళల నుంచి అభిప్రాయాలు, సూచనలు అందాయని చెప్పారు. వాటి ప్రకారం మార్పులు, చేర్పులు చేశామని తెలిపారు.
తమ నిబంధనావళిని తామే రాసుకొన్నామని, తమ మిత్రుడొకరు ఆఫీసు ప్రదేశాన్ని ఇచ్చారని ప్రత్యూష్‌ వివరించారు. వెబ్‌ స్పేస్‌ కొనడానికి కూడా ఆయన సాయం పొందామని చెప్పారు. ఐతే వెబ్‌ స్పేస్‌కు అంతగా ఖర్చు కాలేదని తెలిపారు. ఈ సైట్‌ను మహిళలే వినియోగిస్తారని ఎలా చెప్పగలరు? అనేది ఇందులో కీలకం ప్రశ్న. ఈ నెట్‌వర్క్‌ కేవలం మహిళల కోసమే. అయితే, నెట్‌వర్క్‌ వాడుతున్నవారి లింగ నిర్ధారణకు తమకో సెక్యూరిటీ పద్ధతి ఉందని చెప్పారు.
అంతే కాకుండా యూజర్లను ఫేస్‌ బుక్‌, ట్విట్టర్‌ అకౌంట్లకు లింకు కలపాలని సూచించామనీ, దీనితో గుర్తింపు సులభమవు తుందనీ వారు చెప్పారు.
కెనడా మహిళ ఒరవడి
కేవలం మహిళల సోషల్‌ నెట్‌వర్క్‌ విషయంలో కెనడా మహిళ ఒరవడి సృష్టించారు. 'లులువైజ్‌ డాట్‌ కామ్‌' అనే వెబ్‌ సైట్‌ను ప్రత్యేకించి మహిళల కోసమే ఆమె 2011లో ప్రారంభించారు. ఈ సైట్‌ నుంచి పురుషులను బహిష్కరించారు. సులభంగా రిజిస్ట్రేషన్‌కు ఫేస్‌ బుక్‌ను లులువైజ్‌ ఉపయోగిస్తుంది. లులువైజ్‌ సమాచారాన్ని ఫేస్‌ బుక్‌ యూజర్లకు కూడా బహిరంగపరచరు. నిషేధిం చినప్పటికీ కొందరు పురుషులు ఆడ పేరుతో ఫేస్‌ బుక్‌ అకౌంట్‌ తెరిచి ఆ వేషంలోనే స్త్రీలతో నెట్‌వర్కింగ్‌ చేస్తూ చివరకు దొరికారు. ఇలా జరగకుండా ఫేస్‌ బుక్‌ అకౌంట్లపై నిఘా వేయాలి. ఇది ఆరంభంలో అరవై తొమ్మిది దేశాలకు చెందిన వెయ్యిమంది యూజర్లతో ఆవిష్కారమైంది.
మహిళల ముందంజ
మన దేశంలో సోషల్‌ నెట్‌వర్కింగ్‌లో మహిళలు ముందున్నారు. రోజరోజుకూ మహిళలు సోషల్‌ నెట్‌ వర్కింగ్‌లోకి అడుగుపెట్టడం మన దేశంలో పెరుగుతోంది. అసలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. 2011లో కేవలం మూడునెలల్లో సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో మహిళల ప్రమేయం 77 శాతం పెరిగింది. సామాజిక మీడియా ప్రపంచాన్ని మహిళలు శాసించబోతున్నారనడానికి దీనిని ఉదాహరణగా సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు.
సాధారణంగా ప్రపంచమంతటా మహిళలు సోషల్ నెట్ వర్కింగ్ లో దిగువ పేర్కొన్నట్లు కార్యకలాపాలు సాగిస్తున్నారని విజిపెన్ నివేదిక తెలిపింది.

  • సాంప్రదాయ ఇ మెయిల్ స్థానే సోషల్ నెట్ వర్కింగ్ కు మారుతున్నారు.
  • నడి వయస్సు, టీనేజ్ యువతులు అధికంగా సోషల్ నెట్ వర్కింగ్ చేస్తున్నారు.
  • సామూహిక సంభాషణల, కార్యకలాపాల పట్ల ఆసక్తి ఉండడంతో మహిళలు ఫెస్ బుక్ పట్ల ఆకర్షితులవుతున్నారు.
  • ప్రయాణ విశేషాలను తెలసుకోవడానికి వివాహిత మహళలు అవివాహితుల కంటే ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.

No comments:

Post a Comment