టోక్యో : ఆధునికతతో పోటీ పడే జపాన్ పరిపాలన సూత్రాలను
పాటించడంలో వెనక్కి వెళుతోంది. మళ్ళీ రాజరికం పాలన దిశగా
పయనిస్తోంది. ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా దేశంలో
నిరంకుశ
పాలనను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.దేశ విధానాలలో ప్రజల భాగస్వామ్యం తగ్గించేందుకు కొత్త ప్రభుత్వం సిద్ధమవుతోంది. గద్దెనెక్కిన వాళ్ళకే సర్వాధికారాలు ఉండేలా చేసుకునేందుకు తీవ్ర కసరత్తు ప్రారంభించింది. ఈ దిశగా రాజ్యాంగంలో కీలక మార్పులు చేసి జపాన్‌ను నిరంకుశ దేశంగా మార్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.
-
చట్టంలో మార్పులు...
జపాన్ ఎగువసభ ఎన్నికల్లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ భారీ మెజారిటీ సాధించింది. ప్రధాని షింజో అబె నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బలంతో దేశాన్ని మరోవైపుకు నడిపించాలని భావిస్తోంది. ప్రస్తుత రాజ్యాంగానికి కీలక మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రజాస్వామ్యంపైనే అత్యధిక ప్రభావం చూపే ప్రజాతంత్ర హక్కులను హరించే నిబంధనలు రూపొందించాలని ప్రయత్నిస్తోంది. దీనికి తోడు ఇతర దేశాలపై ఆక్రమణకు వెళ్ళడాన్ని కూడా చట్టబద్ధం చేసుకునేందుకు చట్టాల్లో మార్పులు తేవాలని భావిస్తోంది.
-
రాజ్యాంగంలో మార్పులు...
రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోయి అమెరికా పాలనలో ఉన్న జపాన్ ఇప్పటికీ అమెరికా రూపొందించిన రాజ్యాంగాన్నే పాటిస్తోంది. మిలటరీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న ఆ దేశ పౌరులను అప్పటి అమెరికా ప్రభుత్వం శాంతింపజేసింది. స్వతంత్ర్య సమయంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం సూత్రాలకు నేతలు పెద్ద పీట వేశారు. ప్రజలకు పెద్ద ఎత్తున హక్కులను కట్టపెడుతూ చట్టాలను తయారు చేశారు.దీంతో పాటు అమెరికా ముందు చూపుతో తమ దేశంపై దండెత్తకుండా ఉండేందుకు 9వ అధికరణను రక్షణగా ఏర్పాటు చేసుకున్నారు. ఇపుడు ఈ రాజ్యాంగాన్ని సమూలంగా మార్పులు చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రధానికి కొత్తగా అత్యవసర అధికారాలు మంజూరు చేసింది. దేశాధినేతనే చక్రవర్తిగా పునరుద్ధరించడం లాంటి సంచలన నిబంధనలతో కూడిన ముసాయిదాను రూపొందించింది. ఎల్‌డీపీ రూపొందించి ఈ ముసాయిదాతో దేశవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. మరోవైపు అమెరికాపై యుద్ధం చేయకుండా నివారించేందుకు రాజ్యాంగంలోని 9వ నిబంధనను తొలగించే దిశగా జపాన్ ప్రభుత్వం పావులు కదుపుతోంది. - నిరంకుశత్వమే...
అమెరికా రూపొందించిన రాజ్యాంగంలో మార్పులు చేయాలంటే అది ప్రజాసామ్యయుతంగా ఉండాలి. ఇలా ప్రజల హక్కుల్ని హరించే విధంగా ఉండకూడదని జపాన్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిక మెజారిటీని ఆసరాగా చేసుకుని ఇలాంటి మార్పులు చేయాలనుకోవడం దేశాన్ని నిరంకుశత్వం దిశగా తీసుకెళ్ళడమేనని వారు అంటున్నారు. ఈ చర్యలతో జపాన్ సర్కారు జాతీయవాదాన్ని రెచ్చగొడుతోందని విమర్శించారు. అధికరణ 9ని రద్దు చేయడమంటే దేశాన్ని మరో యుద్ధంలోకి నడిపించేందుకు కుట్రలు చేయడమేనని జపనీయులు ఆరోపిస్తున్నారు. దేశాభివృద్ధికి ఉపయోగపడే మార్పులు జరగాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు. ప్రజాహిత మార్పులను అందనూ హర్షిస్తారన్నారు. కానీ ప్రజావ్యతిరేక నిర్ణయాలను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తామని హెచ్చరిస్తున్నారు. మరి జపాన్ ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

No comments:
Post a Comment