ఆంధ్రప్రదేశ్ విభజనపై నిర్ణయం వెల్లడిస్తామని కాంగ్రెస్ అధిష్టానం
ప్రకటించడంతో మంగళవారం హస్తినలో హడావిడి నెలకొంది. తెలంగాణ, సీమాంధ్రకు
చెందిన నేతలు
బిజీబిజీగా గడిపారు. అధిష్టానం పెద్దలతో ఎడతెగని మంతనాలు
సాగించారు. సీమాంధ్రులు రాష్ట్ర సమైక్యత కోసం ఆఖరి ప్రయత్నాలు
సాగించగా.. తెలంగాణ నేతలు రాష్ట్ర విభజన నిర్ణయం పట్టుజారిపోకుండా భేటీసాలు
కొనసాగించారు. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న సంఘటనల పరిణామ క్రమం ఈ విధంగా
ఉంది..ఉదయం..
6.10 : ఢిల్లీ బయలుదేరిన రాష్ట్ర నేతలు
హైదరాబాద్ : రాష్ట్ర నేతలు ఢిల్లీ బాట పట్టారు. నేడు తెలంగాణపై ప్రకటన రానున్న నేపథ్యంలో ఇరు ప్రాంతాలకు చెందిన నాయకులు హస్తినకు క్యూ కట్టారు. కీలక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సిఎం కిరణ్,పిసిసి చీఫ్ బొత్సకు హైకమాండ్ నుండి పిలుపు వచ్చిందని తెలుస్తోంది. రాష్ట్ర విభజన అంశం చర్చకు రానున్న నేపథ్యంలో వీరిద్దరూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఇప్పటికే బొత్స ఢిల్లీలో పాగా వేశారు. అయితే సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు ఉదయం 9 గంటలకు హస్తినకు బయలు దేరనున్నారు. ఢిల్లీ చేరిన తరువాత పార్టీ పెద్దలను ఆయన కలుస్తారని సమాచారం. మరోపక్క ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా ఢిల్లీకి బయలుదేరుతున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని నివాసంలో యూపిఎ సమన్వయ కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశం ముగిసిన తరువాత సిడబ్ల్యుసి సమావేశం వుంటుంది. సోనియా నివాసం 10 జన్ పథ్ లో సాయంత్రం 5.30 నిమిషాలకు ఈ సమావేశం జరుగనుంది. సమావేశాలకు సంబంధించిన వివరాలను ఏఐసిసి మీడియా ప్రతినిధి వెల్లడించారు. అయితే ఈ సమావేశాల ఎజెండా తెలియలేదు. అయినప్పటికీ తెలంగాణ అంశమే ఈ సమావేశాల్లో ప్రధాన చర్చనీయాంశమని పార్టీ వర్గాలు ధృవీకరించాయి. ఇప్పటికే సీమాంధ్రకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో తిష్టవేశారు. సిడబ్ల్యుసి సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతాలకు చెందిన మంత్రులు కూడా ఢిల్లీకి పయనమవుతున్నట్లు తెలుస్తోంది.
8.30 : ముఖ్యమంత్రితో మంత్రులు అహ్మదుల్లా, బాలరాజు భేటీ
9.13 : ఢిల్లీలో బాపిరాజు నివాసంలో సీమాంధ్ర ఎంపీల సమావేశం
9.30: ఢిల్లీకి బయలుదేరిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
10.30 : దిగ్విజయ్ సింగ్ తో సీమాంధ్ర నేతల భేటీ
11.30 : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులను విడివిడిగా కలిసిన తెలంగాణ నేతలు
11.45 : ప్రధానితో సోనియా గాంధీ భేటీ, యుపిఎ సమన్వయ కమిటీ, సీడబ్ల్యూసీ సమావేశంపై చర్చ
మధ్యాహ్నం:
12. 10 : ఢిల్లీకి చేరుకున్న సిఎం
12.15 : ఎఐసిసి అధినేత్రి సోనియా గాంధీతో షిండే, ఆజాద్, దిగ్విజయ్ సింగ్ సమావేశం
12.55 : సోనియా గాంధీతో సీమాంధ్ర మంత్రులు, ఎంపీల భేటీ, దాదాపు 25 నిమిషాల పాటు ఈ సమావేశం సాగింది. నిర్ణయం ఇప్పటికే తీసుకున్నామని, సహకరించాలని సోనియా వీరిని కోరారు. అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
1.13 : ముఖ్యమంత్రితో తెలంగాణ ప్రాంత నేతల సమావేశం. ఎపి భవన్ లో సిఎం కలిసిన నేతలు. రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి.
1.55 : రాహుల్ తో సిఎం కిరణ్ భేటీ..
ఢిల్లీ: రాజధానిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, యువనేత రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు.అయితే సిడబ్ల్యూసి సమావేశం కన్నా ముందు సీఎం ,రాహుల్ గాంధీని కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమైక్యాంధ్ర నినాదాన్ని గట్టిగా వినిపిస్తున్న సీఎం మరో మారు రాహుల్ గాంధీ ముందు తన వాదన ను వినిపించనున్నట్లు సమాచారం.రాష్ట్రాన్ని విభజిస్తే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో గట్టి దెబ్బ తగులుతుందని కిరణ్ తెలపనున్నట్లు సమాచారం.
2.30 : దిగ్విజయ్ సింగ్ తో సిఎం కిరణ్ భేటీ..
ఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వారిరువురు తాజా రాజకీయ పరిస్ధితులపై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు యుపిఎ సమన్వయ కమిటీ భేటీకి గంటసేపు ముందు సిఎం దిగ్విజయ్ తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే యుపిఎ సమన్వయ కమిటీ భేటీ అనంతరం సిఎం ప్రధాని మన్మోహన్ సింగ్ తో సమావేశం కానున్నట్లు సమాచారం. మరోవైపు రాష్ట్ర విభజన అంశంపై పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి తమ తమ వాదనలు వినిపించేందుకు అటు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, ఇటు తెలంగాణ నేతలు పోటీ పడ్డారు. సోనియా తో భేటీ అనంతరం సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఇరు ప్రాంతాల ప్రజల మనోభావలను గౌరవిస్తూ సముచిత నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పిందని తెలిపారు. ఇరు ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం వెలుబడనుందని చెప్పారు. ఈ నేపధ్యంలో విభజన అంశంపై కాంగ్రెస్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
3.00 : ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు భేష్: షిండే
ఢిల్లీ: రాష్ట్ర విభజనపై నిర్ణయం వెలుబడనున్న తరుణంలో కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవాకాశమే లేదని చెప్పారు. తెలంగాణ అంశం 1956 నుంచి పెండిగ్ లోనే ఉందని, తెలంగాణ అంశంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చన్నారు.
3.10 : కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన తెలంగాణ నేతలు.
3.15 : తెలంగాణ బిల్లుకు మద్దతివ్వాలని సుష్మాకు ప్రధాని ఫోన్..
ఢిల్లీ:పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న తెలంగాణ బిల్లుకు మద్దతు పలకాలని లోక్ సభ విపక్ష నేత సుష్మాస్వరాజ్ ను ప్రధాని మన్మోహన్ సింగ్ కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన సుష్మా స్వరాజ్ కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు సుష్మాస్వరాజ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినట్లు సమాచారం.
3.41 : సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం తీసుకోవచ్చు. తీసుకోకపోవచ్చు అంటూ హోం మంత్రి షిండే వ్యాఖ్య.
3.50 : రాజీనామా వార్తలు ఊహాగానాలే అంటూ ఢిల్లీలో మరోసారి స్పష్టం చేసిన సిఎం కిరణ్
సాయంత్రం
4.00 : యుపిఎ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభం..
ఢిల్లీ: యుపిఎ సమన్వయ కమిటీ సమావేశం ప్రధాని నివాసంలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మంత్రులు షిండే, చిదంబరం, కమల్ నాధ్, ఆజాద్,దిగ్విజయ్ సింగ్, తో పాటు యుపిఎ మిత్రపక్ష నేతలు అజిత్ సింగ్ , శరత్ పవార్, ఫరూఖ్ అబ్దుల్లాలు హాజరయ్యారు. వీరితోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణను ఆహ్వానించారు.
5.15 : ముగిసిన యుపిఎ సమన్వయ కమిటీ సమావేశం
ఢిల్లీ: ప్రధాని నివాసంలో జరుగుతున్న యుపిఎ సమన్వయ కమిటీ భేటీ ముగిసింది. ఈసమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణను ఆహ్వానించారు. మంగళవారం సాయంత్ర 4 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం గంటపాటు సాగింది. ఈ సమావేశానికి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మంత్రులు షిండే, చిదంబరం, కమల్ నాధ్, ఆజాద్,దిగ్విజయ్ సింగ్, తో పాటు యుపిఎ మిత్రపక్ష నేతలు అజిత్ సింగ్ , శరత్ పవార్, ఫరూఖ్ అబ్దుల్లాలు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలుబడనుందన్న వార్తల నేపధ్యంలో సిఎం, పిసిసి చీఫ్ లను ఈ భేటీకి ఆహ్వానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు ఈ సమావేశంలో ఎన్ సిపి, ఆర్ ఎల్ డి లు తెలంగాణకు అనుకూలమని తెలిపారు.
5.20 : ప్రధాని మన్మోహన్ సింగ్, ఎఐసిసి అధినేత్రి సోనియాతో ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు భేటీ
5.25 : తెలంగాణ విభజనకే యూపీఏ ఓటు: అజిత్ సింగ్
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజనకే యూపీఏ సమన్వయ కమిటీ ఆమోదం తెలిపిందని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ అధినేత అజిత్ సింగ్ వెల్లడించారు. ఢిల్లీలో ముగిసిన యూపీఏ పక్షాల భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. యూపీఏ పక్షాలన్నీ ఏకగ్రీవంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సుముఖంగా ఉన్నాయని అజిత్ సింగ్ స్పష్టం చేశారు. అదేవిధంగా తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన కూడా ఈరోజే వస్తుందని పేర్కొన్నారు.
5.35 : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం
ఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నివాసంలో ఆ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి 21 మంది సిడబ్ల్యూ సి సభ్యులు హాజరయ్యారు. ఇప్పటికే తెలంగాణకు అనుకూలంగా యుపిఎ సమన్వయ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దిశానిర్ధేశం జరగనున్నట్లు తెలుస్తోంది. సిడబ్ల్యూసి భేటీ అనంతరం కాంగ్రెస్ చెప్పే అధికారిక ప్రకటన కోసం సర్వత్రా ఆసక్తి నెలకొంది.
6.40 : ముగిసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
ఢిల్లీ: సోనియా నివాసంలో మంగళవారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై ఏకగ్రీవ తీర్మానం చేశారు. దాదాపు అరగంట పాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణపై విస్తృత చర్చ జరిపారు. సాయంత్రం 7 గంటలకు ఈ విషయమై ఎఐసిసి ఒక అధికార ప్రకటనను వెలువరించనుంది.
7.20 : 29వ రాష్ట్రంగా తెలంగాణ: దిగ్విజయ్
ఢిల్లీ: పది జిల్లాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అటు యుపిఎ సమన్వయ కమిటీ, ఇటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్ల్యూసి) ఏకగ్రీవంగా అంగీకారం తెలిపింది. దీంతో 29 వ రాష్ట్రంగా ''తెలంగాణ'' ఆవిర్భవించనుంది. సిడబ్ల్యూసి సమావేశం అనంతరం మంగళవారం ఆ పార్టీ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ లు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం జరిగిపోయిందని చెప్పారు. పది సంవత్సరాల వరకు హైదరాబాద్ ఇరు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉంటుందని తెలిపారు. పదేళ్లలోపు అనుకూలమైన ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏర్పాటవుతుందని చెప్పారు.నదీ జలాలు, విద్యుత్, తదితర అంశాలపై ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర విభజనకై ఏర్పాటు చేసే మంత్రుల బృందం ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించనున్నట్లు చెప్పారు. సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయానికి ఇరు ప్రాంతాల ప్రజలు సహకరించాలని కోరారు. రెండు రాష్ట్రాలకు శాంతి భద్రతల నిర్వహణకు కేంద్రం సహకరిస్తుందని తెలిపారు. సీమాంధ్రుల రక్షణకు కేంద్ర ప్రత్యేక చట్టం తీసుకువస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా సిడబ్ల్యూసి తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదానికి పంపనున్నట్లు తెలిపారు. అప్పుడు కేబినెట్ ఒక మంత్రుల బృందాన్ని నియమిస్తుందని చెప్పారు. మంత్రుల బృందం నివేదికను కేంద్ర హోం శాఖకు పంపుతామని చెప్పారు. అక్కడి నుంచి ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీకి పంపిస్తామని తెలిపారు. అసెంబ్లీ ఆమోదం పొందిన తరువాత ఆ ప్రతిపాదనను కేంద్ర హోం శాఖ రాష్ట్ర పతి అనుమతికి పంపుతుందని చెప్పారు.రాష్ట్రపతి అనుమతితో కేంద్రం ఆమోదం తెలపాల్సివుంటుందని చెప్పారు. ఆ తరువాత రాష్ట్ర పతి ఆమోదంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అధికారికంగా జరుగుతుందని తెలిపారు.

No comments:
Post a Comment