Tuesday, July 30, 2013

నేడే విడుదల

హైదరాబాద్: మరికొన్ని గంటల్లో రాష్ట్ర విభజనపై ప్రకటన వస్తుందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో హస్తినలో హడావిడి ఎక్కువైంది. రాష్ట్రంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ఇస్తున్నారంటూ
కథనాలు వస్తుండడంతో సీమాంధ్ర మంత్రులు, నేతలు ఆఖరి ప్రయత్నంగా అధిష్టానం పెద్దలను కలుస్తున్నారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, నేతలు భారీ సంఖ్యలో ఢిల్లీలో మకాం వేశారు. ఇక సీమాంధ్రలో నిరసన సెగలు గట్టిగానే ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రజలు వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు. విభజన నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసు శాఖ ఇప్పటికే గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది.
ఢిల్లీ బాటలో రాష్ట్ర నేతలు..
రాష్ట్ర నేతలు ఢిల్లీ బాట పట్టారు. నేడు తెలంగాణపై ప్రకటన రానున్న నేపథ్యంలో ఇరు ప్రాంతాలకు చెందిన నాయకులు హస్తినకు క్యూ కట్టారు. కీలక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సిఎం కిరణ్, పిసిసి చీఫ్ బొత్సకు హైకమాండ్ నుండి పిలుపు వచ్చిందని తెలుస్తోంది. రాష్ట్ర విభజన అంశం చర్చకు రానున్న నేపథ్యంలో వీరిద్దరూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఇప్పటికే బొత్స ఢిల్లీలో పాగా వేశారు. అయితే సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు ఉదయం 9 గంటలకు హస్తినకు బయలు దేరనున్నారు. ఢిల్లీ చేరిన తరువాత పార్టీ పెద్దలను ఆయన కలుస్తారని సమాచారం. మరోపక్క ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా ఢిల్లీకి బయలుదేరుతున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని నివాసంలో యూపిఎ సమన్వయ కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశం ముగిసిన తరువాత సిడబ్ల్యుసి సమావేశం వుంటుంది. సోనియా నివాసం 10 జన్ పథ్ లో సాయంత్రం 5.30 నిమిషాలకు ఈ సమావేశం జరుగనుంది. సమావేశాలకు సంబంధించిన వివరాలను ఏఐసిసి మీడియా ప్రతినిధి వెల్లడించారు. అయితే ఈ సమావేశాల ఎజెండా తెలియలేదు. అయినప్పటికీ తెలంగాణ అంశమే ఈ సమావేశాల్లో ప్రధాన చర్చనీయాంశమని పార్టీ వర్గాలు ధృవీకరించాయి. ఇప్పటికే సీమాంధ్రకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో తిష్టవేశారు. సిడబ్ల్యుసి సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతాలకు చెందిన మంత్రులు కూడా ఢిల్లీకి పయనమవుతున్నట్లు తెలుస్తోంది.
నేటి ప్రకటన కాంగ్రెస్ అభిప్రాయమే: శైలజానాథ్
సిడబ్ల్యూసి సమావేశం అనంతరం వచ్చే ప్రకటన కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రకటనేనని ప్రాథమిక విద్యాశాఖ మంతి శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ...కేంద్రం ప్రకటనను ప్రభుత్వ ప్రకటనగా భావించరాదని స్పష్టం చేశారు. మంగళవారం వచ్చే ప్రకటన సమైక్యానికి వ్యతిరేకంగా వస్తే సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా కలిసి భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. మరో వైపు చంద్రబాబు పై మండి పడుతూ...రాష్ట్రంలో అనిశ్చితికి కారణం టిడిపియే అని విమర్శించారు.
రాజీనామాలు అవసరం లేదు: లగడపాటి
రాష్ట్ర విభజన జరిగితే రాజీనామా చేస్తానని నిన్నటి దాకా ప్రకటిస్తూ వస్తున్న విజయవాడ ఎంపి లగడపాటి ప్రస్తుతం మాటమార్చారు. అధిష్టానం తెలంగాణా దిశగా అడుగులు వేస్తుండటం, తెలంగాణ వస్తుందన్న ఊహాగానాలు వెలువెత్తుతున్న తరుణంలో లగడపాటి మాట మార్చి పదవులకు రాజీనామాలు చేసే అవసరం లేదని తెలిపారు. పార్లమెంట్ లోనూ, అసెంబ్లీలోనూ తమ వాదాన్ని గెలిపించుకునేందుకు సీమాంధ్ర నేతలు ముందుకు రావాలన్నారు. ఇందుకోసం ఓటింగ్ కు ప్రయత్నించాలని వివరించారు.
అందరితో సంప్రదించాలి: వైసిపి
అందరితో సంప్రదించిన తరువాతే రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోవాలని వైఎస్ఆర్ సిపి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ  మైసూరా రెడ్డి,బాలినేని శ్రీనివాస రెడ్డి, గొల్లబాబూరావు, పేర్లతో సోమవారం ఓ లేఖ విడుదల చేసింది. ఎవరికీ అన్యాయం జరగకుండా అందరికీ ఆమోదయోగ్యంగా వుండేలా నిర్ణయం తీసుకోవాలని గతంలో తమ పార్టీ కేంద్రాన్ని కోరినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే యూపిఎ ఎవరినీ సంప్రదించకుండా నియంతృత్వ పోకడతో రాష్ట్రంలో గందరగోళం సృష్టిస్తోందని విమర్శించారు. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్, డ్యామ్ ల కారణంగా రాష్ట్రానికి నీళ్లు అందడం లేదని తెలిపారు.ఇటువంటి పరిస్థితుల్లో ఏకపక్షంగా ఇంకో రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే.. శ్రీశైలం ప్రాజెక్టుకు, నాగార్జునసాగర్ కు నీళ్లు ఎక్కడ నుంచి వస్తాయని ప్రశ్నించారు. రాష్ట్రం పై భాగం ఒకరికి, కింది భాగం ఒకరికి అనే పద్దతిలో విభజిస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రం నీళ్లు తప్పా మంచి నీళ్లు వుండవని వారు పేర్కొన్నారు..
రాహుల్ తో సిఎం భేటీ..
రాజధానిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, యువనేత రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు.అయితే సిడబ్ల్యూసి సమావేశం కన్నా ముందు సీఎం ,రాహుల్ గాంధీని కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమైక్యాంధ్ర నినాదాన్ని గట్టిగా వినిపిస్తున్న సీఎం మరో మారు రాహుల్ గాంధీ ముందు తన వాదన ను వినిపించనున్నట్లు సమాచారం.రాష్ట్రాన్ని విభజిస్తే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో గట్టి దెబ్బ తగులుతుందని కిరణ్ తెలపనున్నట్లు సమాచారం.
తెలంగాణకు వ్యతిరేకం: నేషనల్ కాన్ఫరెన్స్
ప్రత్యేక తెలంగాణకు తాము వ్యతిరేకమని నేషనల్ కాన్ఫరెన్స్ స్పష్టం చేసింది. రాష్ట్ర విభజనకు మద్దతివ్వమని జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. కాగా, ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకమన్న ఆ పార్టీ యుపిఎలో భాగస్వామిగా ఉంది. తెలంగాణకు తాము వ్యతిరేకమని నేషనల్ కాన్ఫరెన్స్ తెలపడంతో ప్రభుత్వం ఈ అంశంపై ఎలాంటి ప్రకటన చేస్తుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సీమాంధ్రలో ఆందోళనలు...
కేంద్రం విభజనకు అనుకూల నిర్ణయం తీసుకుంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో సమైక్యాంధ్రలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో విద్యార్ధులు నిరసన తెలిపారు. సీమాంధ్ర నాయకులు, ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామాలు సమర్పించాలని డిమాండ్‌ చేశారు. విద్యాసంస్థలను బంద్ చేయించిన జెఎసి నేతలు ర్యాలీ నిర్వహించారు. బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదంటూ నిరసన తెలిపారు. మరోవైపు హిందూపురంలో సమైక్యవాదానికి మద్దతుగా విద్యార్ధులు భారీ ప్రదర్శన చేపట్టారు. అనంతరం సోనియాగాంధీ దిష్టిబొమ్మను ఊరేగించి తగలబెట్టారు. సమైక్యాంధ్ర కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. అటు సమైక్యాంధ్ర విద్యార్ధి జెఎసి బుధవారం సీమాంధ్రలో విద్యాసంస్ధల బంద్ కు పిలుపునిచ్చింది.
పారామిలటరీల ఆధీనంలో రాష్ట్రం..
కేంద్రం, రాష్ట్ర విభజన పై ఓ నిర్ణయం తీసుకుంటుందన్న నేపథ్యంలో రాష్ట్రంలో భారీ ఎత్తున భద్రతా బలగాలు మోహరించాయి.అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బలగాలు సంసిద్ధమయ్యాయి. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బలగాలు గస్తీ కాస్తున్నాయి. విఐపిలు, ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు భారీ భద్రత ఏర్పాటు చేశారు.దీంతో ఎప్పుడు ఉద్యమం ఎగసి పడినా ఎదుర్కొనేందుకు బలగాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇప్పటికే రాష్ట్రానికి వెయ్యి పారామిలటరీ బలగాలను కేంద్రం తరలించింది.
పారామిలటరీ వివరాలు
ఒక్కొక్క పారామిలటరీ కంపెనీల్లో దాదాపు 250మంది ఉంటారు. ఇందులో డ్రైవర్,వంట మనుషులు కూడా ఉంటారు.  పారామిలటరీ బలగాల్లో ప్రధానంగా బిఎస్ఎప్, సిఆర్ పిఎఫ్,ఇండియన్ స్పెషల్ ఫోర్స్ ,మొదలయినవి కేంద్రం ఆధీనంలో ఉంటాయి. దేశంలో ఎక్కడైనా ఎన్నికలు ,ఆందోళనలు జరుగుతున్న సమయంలో ఈ బలగాలు బందోబస్తు నిర్వహిస్తాయి. ఇక ఎపిఎస్ పి బెటాలియన్లు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి.
ఆందోళనలను ఎలా అదుపు చేస్తారు.?
దేశంలో ఎక్కడైనా ఆందోళనలు జరుగుతుంటే కేంద్రం అక్కడికి పారామిలటరీలను పంపుతుంది. బందోబస్తుకు మాత్రం ఎక్కువగా ఎపిఎస్పి బెటాలియన్స్ వెళ్తారు. వీటికి స్థానిక పోలీస్టేషన్ లకు అటాచ్ చేస్తారు. స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ప్లాటూన్ ల కదలికలు ఉంటాయి. ఇక కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చే రాపిడాక్షన్ ఫోర్స్ లను అత్యంత సున్నిత ప్రాంతాల భద్రతకు వినియోగిస్తారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వడం, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడం వంటి ఘర్షణలను వీరు వెంటనే కంట్రోల్ చేస్తారు. వీరికి టియర్ గ్యాస్ వాహనాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆందోళనకారులను అణిచివేయడంలో రాపిడాక్షన్ ఫోర్స్ నెంబర్ వన్. ఇక సిఆర్ పిఎఫ్.. ర్యాలీలు, ధర్నాలు, ముట్టడి వంటి ఆందోళనలను అడ్డుకుంటుంది. బిఎస్ఎఫ్ బలగాలు పండుగలు, మత ఘర్షణల సమస్యలను అదుపులోకి తెస్తాయి.
మరో వెయ్యి బలగాలు..
ప్రస్తుతం రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలో 1200బలగాలు మోహరించాయి. మరో వెయ్యి బలగాలను మహారాష్ట్ర, తమిళనాడు నుంచి తరలించారు.తిరుపతి, అనంతపురం, కర్నూలు, కడప లో భారీగా పారామిలటరీలు దిగనున్నాయి. ఇప్పటికే 25 వేల మంది పోలీసులు సీమాంధ్రలో ఉండగా మరో 15వేల మందిని పంపించేందుకు హోం శాఖ సిద్ధమైంది. యూనివర్సిటీలు కాలేజీలు, ఉద్యోగ సంస్థలు ,వ్యాపార సముదాయాదాల వద్ద ఈ బలగాలు మోహరిస్తాయి. విఐపిల ఇళ్ల దగ్గర బిఎస్ఎఫ్ బలగాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా అడ్డుకునేందుకు తాము సిద్ధమని పోలీస్ శాఖ ప్రకటించింది.

No comments:

Post a Comment