హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పాటైన
పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. ఇప్పుడు అధిష్టానం రాష్ట్ర ఏర్పాటును
ప్రకటించడంతో ఆ పార్టీ నిర్ణయం కీలకంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే
టిఆర్ ఎస్ ను కాంగ్రెస్ లో
విలీనం చేయడానికి వెనకాడనని గతంలో కెసిఆర్
ప్రకటించారు. కేంద్రం రాష్ట్ర విభజనపై ప్రకటన చేసిన నేపథ్యంలో కెసిఆర్
'విలీనం'పై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.టిఆర్ ఎస్ ప్రమేయం లేకుండా 'తెలంగాణ'ప్రకటన
రాష్ట్రంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ వాదులు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సుమారు 1000మందికి పైగా ఆత్మబలిదానం చేసుకున్నారు. అయితే, 2014 ఎన్నికలలోపు కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదనే అంచనాకు కెసిఆర్ వచ్చారు. దీంతో కొద్ది రోజుల క్రితం ఆయన తన వ్యూహాలను ఎన్నికల వైపే కేంద్రీకరించారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలకే గాలం వేయడం మొదలు పెట్టారు.అధిష్టానం ఇక తెలంగాణ ఇవ్వదని భావించిన కెకె, వివేక్, మందా జగన్నాథం లాంటి కాంగ్రెస్ నేతలు టిఆర్ ఎస్ గూటికి చేరారు. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి. కాంగ్రెస్ తన వ్యూహాత్మక ఎత్తుగడలను ప్రారంభించింది. వేగంగా పావులు కదిపి తెలంగాణ దిశగా అడుగులు వేసింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో కెసిఆర్ ను పట్టించుకోలేదు. టిఆర్ ఎస్ ప్రమేయం లేకుండానే నిర్ణయాన్ని తెలపాలని నిర్ణయించుకొంది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేది మేమే.. తెచ్చేది మేమే అన్న కాంగ్రెస్ ఆ ఖ్యాతి దక్కించుకుంది. అలాగే తెలంగాణ ప్రక్రియలో కెసిఆర్ ను కలుపుకొని పోతే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత వస్తుందని కాంగ్రెస్ భావించినట్లు తెలుస్తోంది. దీంతో 'తెలంగాణ' అంశంపై కెసిఆర్ ను కాంగ్రెస్ దూరంగా ఉంచిందని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ సాధన కోసం పుట్టిన పార్టీ ప్రమేయం లేకుండానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై నిర్ణయం జరిగిపోయింది.
విలీనమేనా?
విలీనంపై ఇప్పటికే కెసిఆర్ తనదైన శైలిలో స్పందించారు. తాను మాటతప్పే వ్యక్తిని కానని స్పష్టం చేశారు. అయితే పార్టీ పదవుల్లో కానీ, రాబోయే ఎన్నికలకు టిక్కెట్ల కేటాయింపు విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ కెసిఆర్ కు ఎలాంటి హామీలూ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. పన్నేండేళ్ళపాటు స్వతంత్రంగా వ్యవహరించిన కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యులు కాంగ్రెస్ లో చేరినా ఆ పార్టీ సంస్కృతిలో ఇమడగలరా? అన్నదే ప్రశ్న. మరి కెసిఆర్ వ్యవహారం దేనికి దారితీస్తుంది? వేచిచూడాల్సిందే...

No comments:
Post a Comment