
మహీంద్రా సత్యం ( ఇది వరకు సత్యం కంప్యూటర్స్ సర్వీసెస్) కంపెనీ టెక్ మహీంద్రాలో విలీన ప్రక్రియ అధికారికంగా మంగళవారం పూర్తి అయ్యింది. దీంతో సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో టెక్ మహీంద్రా ఐదో అతిపెద్ద కంపెనీగా ఆవిర్బవించింది. ఈ విలీన ప్రక్రియను గత జూన్11న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షరతులతో అంగీకరించడంతో ఇరు కంపెనీలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విలీనం పూర్తి అయ్యింది. దీంతో ఇక సత్యం కంప్యూటర్ సర్వీసెస్ అనే పేరు తెరమరుగు కానుంది. వచ్చే సోమవారం మహీంద్రా గ్రూపు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ మహీంద్రా నూతన లోగోను ఆవిష్కరించనున్నారు.
ఈ విలీన ప్రక్రియ గత నాలుగేళ్లుగా జరుగుతోందని, చట్టపరమైన ఇతర అంశాలపై పలు బృందాల నిపుణులు కృషి చేసి షేర్ హోల్డర్లకు తగిన విలువ లభించేలా చేశారని టెక్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ వినీత్ నయ్యర్ తెలిపారు. ఈ రెండు కంపెనీల బోర్డులు మార్చి 21న విలీనానికి ఆమోదం తెలిపాయి. ముంబయి హైకోర్టు అనుమతి తర్వాత, గత జూన్11న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుమతి కూడా లభించింది. దీంతో అధికారికంగా విలీనం పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ సంస్థ సిఇఒగా మిలింద్ కులకర్ణీ బాధ్యతలు నిర్వహిస్తారని నయ్యర్ తెలిపారు. ముంబయి కేంద్రంగా పని చేస్తోన్న టెక్ మహీంద్రాలో మొత్తం 84 వేల మంది సిబ్బంది, 46 దేశాల్లో 540 మంది క్లయింట్లు ఉన్నారు. విలీన నిష్పత్తిని కూడా గతంలోనే 2:17 నిష్పత్తిలో నిర్దారించారు. దీని ప్రకారం సత్యం కంప్యూటర్స్ సర్వీసెస్ వాటాదార్ల వద్ద ఉన్న ప్రతి 17 షేర్లకు, కొత్తగా 2 టెక్ మహీంద్రా షేర్లు జారీ చేస్తారు. ప్రస్తుతం రెండు కంపెనీల్లోనూ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సీపి గుర్నాని విలీన అంశాన్ని వెల్లడించారు.
టెక మహీంద్రాలో, మహీంద్రా సత్యం విలీనానికి గతంలోనే బాంబే హైకోర్టు , హైదరాబాద్ కోర్టు కూడా ఇందుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే సత్యంపై జరుగుతున్న ఆర్థిక నేరాల పరిశోధనలో ఎలాంటి అవంతరాలు కల్పించకూడదాని మహీంద్రా సత్యం యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. కొన్ని షరతులు కూడా విధించింది. భవిష్యత్తులో జరుగబోయే విచారణలకు సహకరించాలని ఆదేశించింది. కావల్సిన సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత టెక్ మహీంద్రా పైనే ఉంటుందని రాష్ట్ర హైకోర్టు పేర్కొంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆస్తుల ఆటాచ్‌మెంట్ ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. ఈ విలీనాన్ని సవాలు చేస్తూ రుణదాతలు, వాటాదారులు దాఖలు చేసిన పిటిషనర్లను కొట్టివేసింది. టెక్ మహీంద్రా ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉన్నందున ఇక్కడి నుంచి మహీంద్రా సత్యం హెడ్‌క్వార్టర్ కూడా ముంబయికి మారనుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.
5 అగ్రగామి సంస్థల్లో స్థానం
టెక్ మహీంద్రా, మహీంద్రా సత్యం విలీనం పూర్తి కావడంతో దేశంలోనే అతిపెద్ద ఐదవ ఐటి సేవల కంపెనీగా ఆవిర్బవించింది. ప్రస్తుతం రెండు కంపెనీల ఆదాయాలు, ఉద్యోగుల సంఖ్య పరిగణలోకి తీసుకుంటే టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సిఎల్ టెక్నాలాజీస్ తర్వాత స్థానంలో టెక్ మహీంద్రా నిలిచింది. ఉమ్మడి ఆదాయం 2.5 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా.
2009 జనవరిలో సత్యం వ్యవస్థాపకులు మరియు చైర్మన్ రామలింగరాజు కొన్ని కోట్ల రూపాయల ఆర్థిక నేరానికి, అవకతవకలకు పాల్పడిన అంశం బయటికి రావడంతో ఈ కంపెనీ దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్లింది. దీంతో టెక్ మహీంద్రా కంపెనీ దైర్యంతో ముందుకువచ్చి దీన్ని తీసుకుంది. 2009 ఏప్రిల్‌లో సత్యం కంప్యూటర్స్‌ను మహీంద్రా సత్యంగా పేరు మార్చింది.
No comments:
Post a Comment