అనుమానం మొగుళ్లతో వేగడం ఎంత కష్టమో భరించేవారికే
తెలుస్తుంది. భర్త వ్యసనాల పాలయినా సహించొచ్చేమో! డబ్బులు వచ్చినవి
వచ్చినట్లు తగలేస్తున్నా ఓపిక పట్టొచ్చేమో!........
కొట్టినా పంటి బిగువున
భరించొచ్చేమో! కానీ, అనుమానం ఉంటే మాత్రం కాపురం చేయడం ముళ్లమీద నడకే! పైగా
ఇది ఒక రోజు, రెండు రోజుల బాధ కూడా కాదయ్యె! తెల్లవారింది మొదలు,
నిద్రపోయేదాకా భర్త మాటలతో చిత్రవధ చేయడం ఎవరికి మాత్రం ఆమోదంగా ఉంటుంది
చెప్పండి! పెళ్లిచేసుకుంది మొదలు ఇదే తంతుగా నడుస్తుంటే... పిల్లలు
పుట్టినా భర్తలో మార్పురాకుంటే శారద మాత్రం ఏం చేస్తుంది?
శారద,
దినకర్‌లకు పెళ్లయి 14 సంవత్సరాలు. కానీ, శారదకు ఈ సమయం పద్నాలుగేళ్ల
వనవాసంతో సమానం. ఎన్నో ఆశలతో అత్తవారింట అడుగుపెట్టిన శారద అందుకు
పశ్చాత్తాపపడని రోజు లేదు. దినకర్ వాళ్లది ఉమ్మడికాపురం. ఉండేది పెద్ద
లోగిలి. అది వారి సొంతిల్లే. నలుగురు అన్నదమ్ముల్లో దినకర్ పెద్దవాడు. ఇంత
పెద్ద సంసారంలో శారద తొందరగానే ఇమిడిపోయింది. అత్తగారు, మామగారు శారదను
ప్రేమగా చూసుకునేవారు. మంచి కుటుంబంలో తమ పిల్లనిచ్చామని శారద
తల్లిదండ్రులు సంతోషించారు. కానీ, ఆ సంతోషం నాలుగు రోజులు కూడా నిలవలేదు.
శారద
మంచితనం మంచిగంధంలా ఆమెను ఎల్లప్పుడూ అంటిపెట్టుకుని ఉండేది. రూపానికి
గుణం తోడయిన శారద చందనపు బొమ్మలా ఉండేది. సరిగ్గా ఈ అందమే దినకర్‌కు కారం
పూసుకున్నట్లనిపించేది. ఏ అందం చూసి పెళ్లి చేసుకున్నాడో, ఆ అందమే అతనికి
ఇబ్బందైపోయింది. అందరి దృష్టీ తన భార్యపైనే ఉందేమోనని దినకర్‌కు ఒకటే
అనుమానం. తన భార్యనే అంతా గమనిస్తున్నారనే శంక అతన్ని కుదురుగా ఉండనిచ్చేది
కాదు. అనుమానపు జ్వాలల్లో రగిలిపోయే దినకర్ శారదను గుమ్మం దాటనిచ్చేవాడు
కాదు. గుమ్మం సంగతి తర్వాత, కనీసం బెడ్‌రూమ్ దాటి బయటికి రానిచ్చేవాడు
కాదు. ఆ బెడ్‌రూమ్ చుట్టూ పరదాలు ఏర్పాటుచేశాడు. శారద తన మరుదులతో
మాట్లాడకూడదు. వారికి అన్నం వడ్డించకూడదు. కలిసి కూర్చోకూడదు. మాసిన
దుస్తులు గదిలోనే ఉతుక్కోవాలి. పోనీ, ఉతుక్కున్నవి డాబామీద ఆరేయడానికి శారద
వెళ్లకూడదు. ఉతికి గది బయటపెడితే అత్తగారు తీసుకెళ్లి వాటిని మేడపై
ఆరేయాలి. ఇంట్లోనే ఇలా ప్రవర్తిస్తున్నాడంటే ఇక బయట దినకర్ ఎలా ఉంటాడో
ఊహించండి!
శారద జీవితం నరకంకన్నా దారుణంగా తయారైంది. శారద పెద్ద
మెడ ఉన్న జాకెట్టు ధరించకూడదు. పొరబాటున కూడా ఒంగకూడదు. ఇంటికెవరొచ్చినా
పలకరించకూడదు. యువకుడు నడిపే ఆటో ఎక్కకూడదు. గుడికెళ్తే ఎవరూ తాకకుండా
జాగ్రత్తపడాలి. భర్త మనసుకు నచ్చినట్లు నడుచుకుందామని అనుకున్నా ఎన్నాళ్లు?
అసలు గుడికెళ్లినపుడు, బస్సెక్కినపుడు ఆ రద్దీలో ఒకరు తాకడం, తాకకపోవడం మన
చేతుల్లో ఎలా ఉంటుంది? ఎలా వీలుపడుతుంది? అనుమానం బుర్రలో తిష్టవేసినపుడు
సొంత సోదరులతోనే మాట్లాడనీయని దినకర్‌తో ఎలా వేగాలి? ఎన్నాళ్లని భరించాలి?
ఇలా సతమతమవుతూనే శారద రోజులు గడిపింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు.
అత్తగారు, మామగారు, మరుదులు వీరంతా శారద మాటకు విలువిస్తారు. ఎట్టి
పరిస్థితుల్లోనూ ఆమెను నొప్పించరు. వీరి అండతోనే శారద ఇన్నాళ్లూ ఆ ఇంట
ఉండగలిగింది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే... ఎన్ని తిట్టినా, కోపంతో
కొట్టినా శారద తన కళ్లెదురుగా కనిపించకపోతే దినకర్ అల్లాడిపోతాడు. శారదంటే
అంతిష్టం. విసిగి పుట్టింటికి వెళ్లిన మరుక్షణమే అత్తగారింటికి వచ్చి
శారదను బతిమలాడి తీసుకెళ్లిపోతాడు. ఈ ప్రేమ, ఆ అనుమానం మధ్య శారద అడచెక్కలో
పోకలా నలిగిపోయేది.
కానీ దినకర్ ప్రవర్తన అంతకంతకూ క్షీణించడం
మొదలెట్టింది. చెదలు పట్టిన తలుపులా రోజురోజుకూ సమస్య పెరిగిపోయింది తప్ప
తగ్గుముఖం పట్టడంలేదు. తన జీవితం ఎటువైపు సాగుతుందో శారదకు అర్థంకాని
పరిస్థితి. ఇక తట్టుకోలేని శారద పిల్లలిద్దరినీ తీసుకుని
పుట్టింటికెళ్లిపోయింది.
శారద, అత్తగారు, పుట్టింటివారు అంతా
కలిసి 'ఐద్వా లీగల్‌సెల్'కు వచ్చారు. వాడ్ని ఎలాగైనా మార్చండి అని దినకర్
తల్లి కన్నీళ్లుపెట్టింది. తల్లిపేగు పడుతున్న ఆక్రోశాన్ని, కొడుకులో
మార్పొచ్చి అతని కాపురం చక్కబడాలని ఆమె పడుతున్న తపనను సభ్యులను
కదిలించేసింది. దినకర్‌ను పిలిపించి మాట్లాడారు. సభ్యులు ఓపిగ్గా ఎన్నో
విషయాలు నచ్చచెప్పారు. బతికినన్నాళ్లూ సుఖంగా బతకకుండా, ఇతరులకు
సుఖంలేకుండా బతకడం సరికాదన్నారు. చక్కని సంసారాన్ని అతలాకుతలం చేసుకుంటున్న
దినకర్‌ను మందలించారు. అలా మూడు నాలుగు వారాలు మాట్లాడగా దినకర్‌లో
మార్పొచ్చింది. ఇంతేకాకుండా దినకర్‌కు కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు.
దినకర్‌లో అందరూ ఆశించిన మార్పొచ్చింది. ఇప్పుడూ వారు లీగల్‌సెల్‌కు వచ్చి
సంతకాలు పెట్టి వెళుతుంటారు. అసలు పెదవి విప్పని దినకర్ ఇప్పుడు నవ్వుతూ
మాట్లాడుతున్నాడు. భార్యను బయటికి తీసుకెళుతున్నాడు. ఆ కుటుంబమే కాకుండా
ఐద్వా లీగల్‌సెల్ సభ్యులు కూడా హమ్మయ్య అనుకున్నారు.
No comments:
Post a Comment