Friday, June 15, 2012

'ప్రేమ గుడ్డిది'

ఆరోజు 'ఐద్వా లీగల్‌సెల్‌'కు వచ్చిన ధరణిని చూస్తే ఎవరికైనా సరే గౌరవభావం కలుగుతుంది. ఆమె మాట, ప్రవర్తన అన్నీ ఎంతో హుందాగా ఉన్నాయి. అనుకున్నట్లుగానే.................
ఆమె కాలేజీ లెక్చరర్‌గా చేస్తుంది. ఎన్ని చదువులు చదివినా, ఆర్థిక స్థితి బాగున్నా, నలుగురిలోనూ గౌరవప్రదంగా బతుకుతున్నా... ఇంట్లోని పరిస్థితులు సరిగ్గా లేకపోతే కలిగే ఆవేదన ఎలాంటిదో ధరణిని చూస్తే తెలుస్తుంది. స్త్రీ ఎంత రాణిస్తున్నా భర్త ఆమెను ఓ వ్యక్తిగానైనా గుర్తించకపోవడం దారుణం అనిపిస్తుంది.

ధరణిది ప్రేమవివాహం. ధరణి డిగ్రీ చదువుతున్నప్పుడే హరితో పరిచయం ప్రేమగా మారింది. చిత్రంగా హరి ఏమీ చదువుకోలేదు. 'ప్రేమ గుడ్డిది' అన్న ఆర్యోక్తి వారిపట్ల నిజమైంది. హరి చదువుకోకుంటే ఏమైంది, నేనున్నానుగా అనుకుంది ధరణి. నువ్వు సంపాదించకుంటేనేం నేను సంపాదిస్తాగా అని హరికి చెప్పింది. ఉద్యోగం చేయలేకుంటేనేం, వ్యాపారం చేయగలవుగా అని ధైర్యంచెప్పింది. ఈ మాటలే చెప్పి ఇంట్లోవారినీ ఒప్పించింది. ధరణి తల్లిదండ్రులు హరిని పెళ్లి చేసుకోవడంలోని సాధకబాధకాలు వివరించారు. ధరణి వాటన్నింటికీ సమాధానాలు చెప్పింది. ఫలానా సమస్యలు రావచ్చని వారు వ్యక్తంచేసిన అనుమానాలు ఏదో విధంగా నివృత్తిచేసింది. కూతురి ఇష్టాన్ని కాదనలేక చివరికి వారు సరేనన్నారు. పెద్దల అనుమతితో ధరణి, హరిల వివాహం జరిగింది.
కొత్తదనపు పరదాలు తొలగగానే అసలు నిజాలు బయటపడ్డాయి. హరిలో దాగున్న దుర్గుణాలు మెల్లమెల్లగా వెలికొచ్చాయి. హరికి తాగుడు, పేకాట అలవాట్లున్నాయి. వాటిని అలవాట్లు అనేకన్నా వ్యసనాలు అనడం మంచిదేమో! ఎందుకంటే, హరి అప్పటికే వాటికి బానిసైపోయాడు మరి! అతనికో వ్యాపకం ఉండాలని ధరణి పెట్టించిన వ్యాపారం బాగానే సాగుతోంది. కానీ, ఏం ఫలితం! వచ్చినదంతా అతని దుర్వ్యసనాలకు ఖర్చయిపోతుంటే! ఇవే ఎక్కువనుకుంటే, వీటన్నింటినీ మించిన భూతం మరొకటి అతని మీదెక్కి సవారీ చేస్తోంది. అది 'అనుమాన భూతం'. ఇది ఆవహించిన వాడికి వాస్తవాలు పట్టవనేది అందరికీ తెలిసిన విషయమేగా! అలాగే హరి కూడా నిజానిజాలు ఆలోచించలేదు. ప్రేమించిన ధరణి వ్యక్తిత్వాన్ని పట్టించుకోలేదు. తనను వివాహం చేసుకోవడంకోసం, పెద్దలను ఒప్పించడానికి ధరణి ఎంతగా తాపత్రయపడిందో హరి మర్చిపోయాడు.
ఇప్పుడు హరికి గుర్తున్నదల్లా, 'ధరణి బాగా చదువుకుంది. బయట ఉద్యోగం చేస్తోంది. అంటే, బయట 'తిరిగొస్తోంది'. ఆ సమయంలో ధరణి ఏం చేస్తోంది? ఎవరితో మాట్లాడుతోంది?' వీటికి సమాధానాలు అతనే రకరకాలుగా ఊహించుకోవడం, ఇంటికి రాగానే ధరణిని మాటలతో తూట్లు పొడవడం... ఇదే హరి నిత్యకృత్యం. అతని మాటలకు ధరణి నిశ్చేష్టురాలయ్యేది. తాను ప్రేమించింది ఇతనినేనా అని ఆవేదన చెందేది. 'నమ్మకం' ఆధారంగా నడిచే కాపురం ఇలా అయిపోతుందేంటని దిగులుపడేది. అయినా, ఓర్పుగా భర్తకు నచ్చచెప్పేది. ఎన్నోరకాలుగా వివరణలిచ్చేది. ఇంతచేసినా హరిలో మార్పురాలేదు. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. భర్త ఆగడాలకు కృశించిపోకుండా ధరణి ఓ వ్యాపకం ఏర్పరచుకోవాలనుకుంది. అందుకు చదువును మార్గంగా చేసుకుంది. డిగ్రీల మీద డిగ్రీలు చదివింది. పిహెచ్‌డిలు చేసింది. పైసా ఇవ్వకున్నా తన సంపాదనతోనే ఇల్లు నడిపింది.
కొద్దిలో కొద్ది స్వాంతన ఏమిటంటే... అత్తింటివారంతా ధరణి పక్షమే. ఇంతగా వేధిస్తున్నా హరిని ఓపిగ్గా భరిస్తున్న ధరణిని వారు కడుపులో పెట్టుకున్నారు. మేమున్నామనే భరోసానిచ్చారు. తప్పుచేస్తే హరిని నిలదీసేవారు. ధరణి మంచి చీరలు ధరించి కాలేజీకి వెళ్లడం హరి సహించలేకపోయేవాడు. లెక్చరర్‌ హుందాగా ఉండాలనేది ధరణి అభిప్రాయం. అది నిజం కూడాను! కానీ, హరి కుళ్లు ఆలోచనలు వేరు! అందుకే ఓరోజు ధరణి చీరలన్నీ తీసుకెళ్లి చెత్తకుండీలో పడేశాడు. ధరణి హతాశురాలైంది. విషయం తెలిసిన హరి తల్లి, అక్క వెంటనే వచ్చి హరిని మందలించారు. తమకు సమీపంలో కాపురం ఉండమని ఇల్లుచూసి అక్కడికి మార్చారు.
పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ధరణి ఎలాగోలా సర్దుకొచ్చింది. కానీ, పిల్లలు పెరిగే కొద్దీ ధరణి మనసు అల్లకల్లోలమైపోతోంది. కాలేజీ చదువుతున్న కొడుకు, 'ఎందుకమ్మా! ఈయన ఆరళ్లని మనం ఎందుకు భరించాలి?' అంటుంటే మాట్లాడలేకపోతోంది. హరి అవాకులు చెవాకులు తట్టుకోలేని ధరణి ఎదురు తిరుగుతోంది. వీటన్నింటిమధ్యా పిల్లల భవిష్యత్తు ఏమిటన్న విషయంపై ధరణికి దిగులు పట్టుకుంది. దానికితోడు హరి, 'పిల్లలను తీసుకుని నువ్వు పో' అంటున్నాడు. కానీ, పిల్లలకు ఓ కుటుంబం ఉండాలనేది ధరణి అభిప్రాయం. అత్తింటి వారి ఆదరణ కూడా ఆమె వెనుకడుగుకు కారణం. భర్తలో మార్పు వస్తే చాలు తక్కినవన్నీ మరిచిపోవడానికి ధరణి ఇప్పటికీ సిద్ధంగా ఉంది. మరెలా మారతాడు అన్న ధరణి ప్రశ్నకు ఆమె ఆడబడుచు సమాధానం చెప్పింది.
''ఐద్వా లీగల్‌సెల్‌'కు వెళ్తే నీ సమస్య పరిష్కారం అవుతుంది. మనం చెబితే వినడు. పట్టించుకోడు. కానీ, వాళ్లు చెబితే హరి మారతాడు. పద' అని స్వయానా ఆడబడుచు చెప్పింది. అయినా భర్తమీద ఒక భార్య ఫిర్యాదు చేయడమా అనే మీమాంసతో ధరణి ఊగిసలాడింది. దానికి ఆడబడుచు, 'వాడు మారాలనేగా మనం ఫిర్యాదుచేస్తోంది. అతను మారితే అందరికీ సంతోషమేగా! నీ తల్లిదండ్రులు పేరు పెట్టారు కదాని భూమాతలా వాడిని భరించాల్సిన పనిలేదు. నా మాట విని వెళదాం పద' అంది. చివరికి ధరణి అడుగు ముందుకేసింది. వచ్చేవారం అతన్ని పిలిపించి మాట్లాడదామని, అతనికి పట్టిన అనుమానపు భూతాన్ని వదిలిద్దామని సభ్యులు చెప్పగానే ధరణి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఆమె నమ్మకం ఎన్నడూ వమ్ముకాదు. ఎందుకంటే, హరిలాంటి దుర్మధాంధులను సరిచేయడమెలాగో ఐద్వా సభ్యులకు బాగా తెలుసు!

No comments:

Post a Comment