ఒంటిమీద దెబ్బపడటమంటే అవమానం కిందే లెక్క! చిన్నతనంలో అన్నం తినమని అమ్మకొడితే అర్థముంది. అబద్ధాలు కూడదని నాన్న కొడితే అది మన బాగుకోసం! పాఠాలు రాలేదని పంతులు కొడితే భరించాలి.................''నా పేరు కుసుమ. అందరమ్మాయిల్లాగానే నేనూ తల్లిదండ్రుల చాటున పెరిగాను. ఆడపిల్ల కన్నెత్తి చూడకూడదని, పన్నెత్తి మాట్లాడకూడదని, ఫక్కున నవ్వకూడదనీ నానమ్మ చెబుతుంటే పాటించాను. కాలేజీకి వెళుతున్నపుడు ఇంటి దగ్గర దించిన తల మళ్లీ ఇంటికొచ్చాకనే ఎత్తాలని నాన్న చెబితే సరేనన్నాను. ఏంటా పరుగు, మగరాయుడిలా! మెల్లగా నడు అని అమ్మ మందలిస్తే తలూపాను. పెళ్లీడు వచ్చింది పెళ్లిచేయాలని అంతా అంటుంటే మనసులో ఆశలకు రెక్కలు తొడిగాను. నాకంటూ ఓ ఇల్లు, నాదనే మరో సామ్రాజ్యం అంటూ ఊహల్లో తేలియాడాను. పెళ్లిచూపుల్లో అంతా నన్ను చూసి రూపవతి, గుణవతి, విద్యావతి అంటుంటే మురిసిపోయాను. కలలోని రాకుమారుడు కాబోయే వరునిగా ఎదుట నిలిచాడని తెలిశాక మనసులో సిగ్గు దొంతరలు. చూసుకోవే కాబోయే మొగుడ్నంటూ మేనత్త మేళమాడేసరికి సాహసించి ఓరగా చూశాను. ఎదురుగా కనిపించిన మధునే నా జీవన సర్వస్వమనుకున్నాను. కళ్లు మూసి తెరిచేలోగా మధు భార్యనై ఆయన సందిట నిలిచాను.
సదా నువ్వే నా తోడూనీడ అని తలుస్తూ అతనివెంట అత్తవారింటికి నడిచాను. ఇకపై నా జీవితం పూలబాట అనుకుంటూ తడబడే అడుగులతో కొత్తకాపురంలోకి అడుగుపెట్టాను. కలకూ, వాస్తవానికీ హస్తిమశకాంతరమంత దూరముంటుందని నాకప్పుడే తెలిసింది.
భార్యంటే అణిగిమణిగి ఉండాలి. సమయానికి అన్నీ అమర్చాలి. దగ్గరకు రమ్మన్నపుడు వెళ్లాలి. కసురుకుంటే దూరం తప్పుకోవాలి. ఫలానాది ఇష్టమనే మాట రాకూడదు. ఇది చేయననే మాట రానేకూడదు. అమ్మ, నాన్న, నానమ్మ చెప్పిన మాటలకు భిన్నంగా ఇక్కడి ప్రపంచంలేదు. పైపెచ్చు మరికాస్త ఎక్కువగానే ఉంది. అప్పుడే నా ఆశలసౌధం కూలిపోయింది. ఈ ప్రపంచంసైతం నాదికాదని రూఢగాీ తెలిసిపోయింది. ఇక్కడ నేను వేతనంలేని పనిమనిషిని. జీవంలేని మరమనిషిని. అన్నీ అర్థమైనా ఏమీ చేయలేని మనసు ఏనాడో చచ్చిపోయింది. నిరాశానిస్పృహలు చుట్టుముడుతున్నా పట్టించుకోకుండా రోజులు వెళ్లబుచ్చుతున్నాను. ఒక్కొక్కసారి నాకే ఆశ్చర్యం. నా చదువు, విజ్ఞానం ఏమైపోయింది? నాలోని ఆలోచనలు, ఆశలు ఎక్కడికి ఎగిరిపోయాయి? పెళ్లంటే ఇదేనా?
మధుకు తాగుడు అలవాటుందని పెళ్లయిన కొత్తలోనే తెలిసింది. జీతమంతా ఖర్చయిపోతున్నా మారుమాట్లాడకూడదనే ఆజ్ఞ ఎన్నడో జారీ అయిపోయింది. నా జీవితంలో ఉన్న ఒకే ఒక్క కాంతిరేఖ మా బాబు. వాడిని చూసుకునే బతుకునీడుస్తున్నాను. ఇంకా చెప్పాలంటే, వాడికోసమే బతుకుతున్నాను. కానీ, బాబు పెంపకం, ఇంటద్దె, ఖర్చులు... ఇవన్నీ ఎలా? ఊరుకుంటూ కూర్చుంటే ఆయన ఆరోగ్యమే కాదు, ఇల్లే నాశనమైపోతుందే! అందుకే ఇప్పటిదాకా మూతపడిపోయిన గొంతు విప్పాను. ఇది మంచిదికాదని తెగించి చెప్పేశాను.
ఫలితంగా నాపై కర్ర, బెల్టు నాట్యంచేశాయి. ఈనాటిదాకా నాకు దెబ్బంటే తెలీదు. పుట్టింట్లో ఆంక్షలున్నా, శిక్షలులేవు. అన్ని బాధలనూ తట్టుకున్న నేను ఈ దారుణాన్ని భరించలేకపోయాను. అడ్డుపడ్డ పసివాడినిసైతం వదల్లేని అతని పైశాచికాన్ని తట్టుకోలేకపోయాను. అందుకే 'ఐద్వా లీగల్‌సెల్'కు వచ్చాను. గాయాలు చూపించాను. బిడ్డకోసమైనా కాపురాన్ని సరిదిద్దమన్నాను'... ఇదీ కుసుమ అంతరంగం. సభ్యులు మధును పిలిపించారు. 'మంచి ఉద్యోగం, చక్కని కుటుంబం. దీన్ని నిలుపుకోలేకపోతే అది అవివేకం తప్ప మరోటికాదు. మనిషి ఎదురుగా ఉంటే విలువ తెలీదు. ఒకసారి కోల్పోయాక ఏడ్చి వగచినా ఎవరూ నీకు సాయంరారు' అన్నారు. మధు తల్లిదండ్రుల కన్నీరు కూడా అదే భాష్యంచెప్పింది. మధు ఆలోచనలో పడ్డాడు. మనసు లోపలికి విషయం వెళ్లిందీ అంటే ఫలితం వస్తుందని లీగల్‌సెల్ అనుభవాలు చెబుతున్నాయి. నిజంగా జరిగేది కూడా అదే!
No comments:
Post a Comment