‘‘శిల లోపల వెన్న ఉందంటే నమ్మలేం. శరీర దారుఢ్యంతో హూ హా హా హూ అని అరుస్తూ కాళ్లను, వేళ్లను, చేతులను వదులుతూ విడుస్తూ ముడుస్తూ కిక్‌లు ఇచ్చే మార్షల్ ఆర్ట్స్ వీరుడికి పుస్తకాల పిచ్చి ఉందంటే అవునా అంటాం. బ్రూస్ లీ ఇంట 2,500 పుస్తకాలుండేవి. దాదాపు అన్నింటినీ చదివి ఆకళింపు చేసుకున్నాడు.....................
టావోయిజం, బౌద్ధం ప్రభావాలు బ్రూస్ లీపై ఉన్నాయి. జిడ్డు కృష్ణమూర్తి తత్త్వం అతనికి ఇష్టం. నీరు ఎక్కడుంటే అక్కడ ఇమిడిపోతుంది. మనిషి అలా ఉండాలంటాడు బ్రూస్ లీ. ఘనంగా ఉండి ఇతరులకు ఉపద్రవంగా ఉండడం కన్నా ద్రవంగా ఉండడం మేలు అని ఓ మార్షల్ ఆర్ట్ ్స ధీరుడు అనడమే పరిపూర్ణత అంటే.’’

అప్పటికి బ్రూస్ లీకి 13 ఏళ్లు.
సన్నగా, పీలగా ఉండేవాడు. ఎవ్వరితోనూ కలిసేవాడు కాడు.
ఆ రోజు స్కూలు నుంచి ఇంటికి వెళ్తున్నాడు.
హఠాత్తుగా నలుగురు వెనక నుంచి మీదపడ్డారు. బ్రూస్ లీని తీవ్రంగా కొట్టారు. వారెవరో, ఎందుకలా చేశారో అర్థంకాలేదు. దేహానికైన గాయాలు నాలుగైదు రోజులకు మాయమయ్యాయి. మనసులో మాత్రం తెలీని రోదన. హృదయంలో అవమానాగ్ని. ఆ పరాభవమే బ్రూస్ లీలో-పిడికిలి బిగించి, గాల్లోకి జుమ్మని దూసుకుపోయే పంచ్‌లు కొట్టాలన్న పట్టుదల పెంచింది. బక్కపలచని కుర్రాడిని మెలి తిరిగిన కండలతో ఉక్కు నరాలతో ఎదగాలన్న కసిని పెంచింది. ఒక్క మాటలో... బ్రూస్ లీని బ్రూస్ లీగా మార్చింది.
ఆడపిల్లగా...
బ్రూస్ లీ తండ్రి లీ హో చూన్ చైనా జాతీయుడు. హాంగ్‌కాంగ్ నివాసస్థుడు. సంగీత నాటక కళాకారుడు. తల్లి గ్రేసీ జర్మన్ సంతతికి చెందిన మహిళ. దంపతులిద్దరూ వివిధ దేశాలు పర్యటిస్తూ కళాప్రదర్శనలిచ్చేవారు. అలా వారోసారి అమెరికాలో ఉన్నప్పుడు 1940 నవంబర్ 27న లీ జన్మించాడు.
అయితే అతడు పుట్టినప్పుడు వృషణాల్లో ఒకటి అపసవ్యంగా ఉంది. పైగా ఆరోగ్యం కూడా అంతంత మాత్రం. దీంతో గ్రేసీ భయపడిపోయింది. దీనికితోడు అప్పుడే పుట్టిన మగపిల్లల్ని ఆడ పిశాచాలు ఎత్తుకుపోతాయన్న మూఢనమ్మకం చైనీయుల్లో ఎక్కువ.
దీంతో కొడుక్కి ఎక్కడ ప్రమాదం ముంచుకొస్తుందోనని తల్లి తల్లడిల్లిపోయింది. మగ పిల్లాడే అయినా ఆడపిల్ల పేరు పెడితే ఏ పీడా ఉండదని అనుకొంది. అందుకే ‘లీ జున్ ఫాన్’ అంటూ స్త్రీలింగ నామకరణం చేసింది. అమ్మాయిలకు మాదిరి చెవులు కుట్టించింది. ఇంకో సంగతి ఏమిటంటే... తొలిసారి తెరమీద బ్రూస్ లీ కనిపించింది మూడు నెలల వయసులో ‘గోల్డెన్ గేట్ గర్ల్’ అనే సినిమాలో! ఆ చిత్రంలో బ్రూస్‌లీని ఆడపిల్ల వేషంలో చూపించడం ఓ విచిత్రం.
తండ్రే తొలి గురువు
హాంగ్‌కాంగ్ అప్పట్లో బ్రిటిష్ వలస ప్రాంతం. అక్కడ చైనీయులతో పాటు బ్రిటన్, జర్మన్ ఇతర జాతీయులు కూడా వలసవచ్చి నివసిస్తూ ఉండేవారు. దాంతో వీరికీ స్థానికులకూ నిరంతరం గొడవలే! స్థానిక యువకులు గ్యాంగులుగా మారి ఇతర జాతీయులపై వీరంగం సృష్టించేవారు.
13 ఏళ్ల వయసులో బ్రూస్ లీ దెబ్బలు తిన్నది అలాంటి రౌడీమూక చేతిలోనే. బ్రూస్ తల్లి జర్మన్ కావడం ఆ దాడికి కారణం. ఆ అవమానంతోనే తానెలాగైనా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. ‘గెలిచామా ఓడామా అన్నది మరిచిపో. పోరాటం నుంచి మాత్రం పారిపోకు’ అంటాడు.
చైనీయులు పశ్చిమ దేశాల వారి నుంచి తమను తాము కాపాడుకునేందుకు తప్పనిసరిగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొనేవారు. బ్రూస్ లీ తండ్రికి ‘థామ్ చీ చువాన్’ అనే యుద్ధ విద్య వచ్చు. దాన్నే కొడుక్కి నేర్పాడు.
కొంతకాలమయ్యాక, 14 ఏళ్ల వయసులో బ్రూస్ లీ సైఫూ ఇప్‌మెన్ దగ్గర శిష్యరికం చేశాడు. కుంగ్‌ఫూలో ఒక భాగమైన వింగ్ చున్‌లో ఇప్‌మెన్‌ను మించినవారు లేరు. అయితే తోటి విద్యార్థులు జర్మన్ జాతీయురాలికి పుట్టిన బ్రూస్‌లీ ఆసియా కళ నేర్చుకోవడానికి వీల్లేదని గొడవపడ్డారు. ఇప్‌మెన్‌పై ఒత్తిడి తెచ్చారు. కొంతకాలం శిక్షణ ఆగిపోయింది. చివరకు ఎవ్వరికీ తెలీకుండా ఇప్‌మెన్ రహస్యంగా బ్రూస్ లీకి క్లాసులు తీసుకొనేవాడు.
అదే కాలంలో తన అన్న పీటర్ లీ నుంచి కత్తిసాము నేర్చుకొన్నాడు. చా-చా డ్యాన్స్ నేర్చుకొని చాంపియన్‌షిప్ పొందాడు. వెస్టర్న్ బాక్సింగ్ కూడా నేర్చుకొన్నాడు. 1958లో అప్పటికి మూడుసార్లు బాక్సింగ్‌లో చాంపియన్ అయిన గ్యారీ ఎల్మ్స్‌ని మట్టికరిపించాడు- అదీ 18 యేళ్ల వయసులో! అదే సంవత్సరం ‘ది ఆర్ఫన్’ చిత్రంలో నటించాడు. అప్పటికి ఇరవై చిత్రాల్లో కనిపించినా, బాలనటుడిగా అదే చివరిది. తన జీవితంలో ఒక్క ఫైట్ కూడా లేని ఏకైక చిత్రం కూడా ఇదే!
అమెరికాకి పయనం...
1958లో బ్రూస్ లీపై రౌడీమూకలు మరోసారి దాడికి యత్నించాయి. అంతకుముందు బ్రూస్ లీ అమాయకుడు. మరి ఇప్పుడో... చేతులను, కాళ్లను, చివరకు వేళ్లను సైతం కత్తుల్లా తిప్పగల సమర్థుడు. అందుకే ఆ మూకకి చుక్కలు చూపించాడు. మామూలుగా కాదు వారిలో ఒకరు దాదాపు మరణించేలా! దాంతో పెద్ద గొడవైంది. బ్రూస్ లీని జైలుకి పంపుతారేమోనన్నంత కేసయింది. దాంతో తల్లి భయపడిపోయింది.
బ్రూస్ లీని హాంగ్‌కాంగ్ నుంచి అమెరికా వెళ్లిపొమ్మంది. బ్రూస్ లీ ఎలాగూ పుట్టింది శాన్‌ఫ్రాన్సిస్కోలోనే! 18 యేళ్లలోపు అక్కడకు వెళ్తే, ఆ దేశ పౌరసత్వం కూడా లభిస్తుందని తల్లి భావించింది. బ్రూస్ లీ సరేనన్నాడు.
కొంతకాలం హోటల్లో వెయిటర్‌గా ఉద్యోగం. 1961లో యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లో ఫిలాసఫీ కోర్సులో చేరాడు. అక్కడే విండా ఎమెరీతో ప్రేమ. 1964లో ఆమెతోనే పెళ్లి.
తాను నేర్చుకున్న విద్యను నలుగురికీ నేర్పాలన్న ఉద్దేశంతో 1965లో మార్షల్ ఆర్ట్స్ స్కూల్‌ను స్థాపించాడు. అప్పట్లో అలాంటి అకాడమీలు చాలానే ఉండేవి. కానీ మార్షల్ ఆర్ట్స్‌కు జన్మనిచ్చిన చైనీయులు తమ విద్యను పశ్చిమ దేశీయులకు నేర్పడానికి ఇష్టపడేవారు కాదు. అలాంటిది బ్రూస్ లీ అదే పని చేస్తుండటంతో చాలామందికి ఆగ్రహం వచ్చింది.
వూంగ్ జాక్‌మన్ అయితే బ్రూస్ లీని నేరుగా బెదిరించాడు. పోరాడమని సవాల్ విసిరాడు. అయితే బ్రూస్ లీ చేతిలో పది నిమిషాల్లోనే మట్టి కరిచాడు.
‘రోజుకి ఎంత నేర్చుకున్నామన్నది కాదు. అనవసరమైంది ఎంత వదిలేశామన్నది ముఖ్యం’ అంటాడు లీ. అందుకే తాను నేర్చుకున్న కుంగ్‌ఫూ సంపూర్ణం కాదని గ్రహించాడు. అంతకన్నా మెరుగైన, తనదైన పోరాట కళను సృష్టించాలనుకున్నాడు. అమెరికన్ బాక్సింగ్‌ని, థామ్ కిక్ బాక్సింగ్‌ని, జపనీస్ కరాటేని, చైనీస్ కుంగ్‌ఫూని మించిన ‘జీట్ కునె డు’ మార్షల్ ఆర్ట్స్‌కు ప్రాణం పోశాడు.
క్రమంగా ద గ్రీన్ హార్నట్ (టీవీ షో), మార్లో, బిగ్‌బాస్, ఫిస్ట్స్ ఆఫ్ ఫ్యురీ, ద వే ఆఫ్ డ్రాగన్... చిత్రాలతో పాపులర్ అయ్యాడు. నటుడిగానే కాక దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రిప్ట్ రైటర్‌గా బహు పాత్రాభినయం చేశాడు. ‘ద సైలంట్ ఫ్లూట్’ అనే చిత్రానికి లొకేషన్లు చూడటం కోసం 1971లో భారత్ వచ్చి నెలరోజులు గడిపాడు.
అంతిమంగా...
విధి విచిత్రమైంది. 30 యేళ్ల వయసులో అతడి శరీరంపై తీవ్రమైన ఒత్తిళ్ల కారణంగా వెన్నెముకలో నరాలు దెబ్బతిన్నాయి. మార్షల్ ఆర్ట్స్ జోలికి వెళ్లకూడదని డాక్టర్లు కచ్చితంగా చెప్పేశారు. కానీ బ్రూస్ లీ మొండి మనిషి. కొంతకాలం విశ్రాంతి మాత్రం తీసుకున్నాడు. ఆ సమయంలో కూడా ‘జీట్ కునె డు’పై పుస్తకం రాశాడు. పెయిన్ కిల్లర్స్‌ని మాత్రం తెగ మింగేవాడు. అవే అతని ప్రాణాల్ని అతిత్వరలో మింగేస్తాయని అప్పటికి తెలీదు.
1973 నాటికి బ్రూస్ లీ శరీరం సహకరించడం తగ్గించింది. ‘‘నువ్వు ఉన్నంతవరకు మరణం నీ వెంటే ఉంటుంది. భయపడితే దూరం కాదుగా’’ అని అంటుండేవాడు.
1973 ఏప్రిల్ 10న హాంగ్‌కాంగ్‌లోని గోల్డెన్ హార్వెస్ట్ స్టూడియోలో ‘ఎంటర్ ద డ్రాగన్’ చిత్రానికి డబ్బింగ్ చెబుతూ తూలిపడ్డాడు. ఆ మరునాడు మరోసారి బాత్‌రూమ్‌లో పడ్డాడు. శరీరం సహకరించడం లేదని అర్థమైపోతోంది.

పెయిన్ కిల్లర్స్... ఎన్నని వేసుకొనేది!
అదే ఏడాది జూలై 20న బ్రూస్ ఇంటికి రేమాండ్ చౌ వచ్చాడు. బ్రూస్ లీని, జాకీచాన్‌ని ప్రపంచానికి పరిచయం చేసిన నిర్మాత. తదుపరి చిత్రం ‘ద గేమ్ ఆఫ్ డెత్’ కోసం చర్చించారు. బ్రూస్ లీ భార్య విండా భర్తకు ముద్దిచ్చి షాపింగుకి వెళ్లింది. అదే ఆమెకు కడసారి కలయిక...
చౌ, లీ కలిసి బెట్టీ టింగ్ పె అనే నటి ఇంటికి వెళ్లారు. కొంచెంసేపు కథాచర్చలు జరిపారు. డిన్నర్‌కు ముగ్గురూ ‘జేమ్స్‌బాండ్’ ఫేమ్ జార్జ్ లాజాంబి దగ్గరకు వెళ్లాలనుకొన్నారు. రాత్రి ఏడున్నరయ్యింది. తనకు కాస్త అలసటగా ఉంది. పది నిమిషాలు విశ్రమిస్తానన్నాడు బ్రూస్ లీ. బెట్టీ ఇంటిలోనే మేను వాల్చాడు.
రాత్రి తొమ్మిదయ్యింది. బ్రూస్ లీ మాత్రం లేవలేదు. శాశ్వతంగా లేవలేదు. సెరిబ్రల్ ఎడెమాతో, ఈక్వా జెసిక్ అనే పెయిన్ కిల్లర్ రియాక్షన్‌తో మరణించినట్లు డాక్టర్లు చెప్పారు.
బతికింది 33 యేళ్లే. చేసింది మూడు, నాలుగు సినిమాలే. అయితేనేం... తనదైన పంచ్‌ను వదిలి వెళ్లిపోయాడు. బ్రూస్ లీ అంటేనే గుర్తొచ్చే ‘ఎంటర్ ద డ్రాగన్’ విడుదలకు ఆరు రోజుల ముందే మరణించడం ఓ విధి వైచిత్రి. అతడి తొలి చిత్రం ‘ద బర్త్ ఆఫ్ మేన్ కైండ్’ కావడం, చివరగా తీయాలనుకున్నది ‘ద గేమ్ ఆఫ్ డెత్’ కావడం... జనన మరణాల వింత క్రీడను తలపించే ఓ యాదృచ్ఛికం. బ్రూస్ లీ పేరుకి అర్థం ‘తిరిగి రావడం’ అని. ఆ పేరు సార్థకమైతే బాగుండు.
అతడి తొలి చిత్రం ‘ద బర్త్ ఆఫ్ మేన్ కైండ్’ కావడం, చివరగా తీయాలనుకున్నది ‘ద గేమ్ ఆఫ్ డెత్’ కావడం... జనన మరణాల వింత క్రీడను తలపించే ఓ యాదృచ్ఛికం.
No comments:
Post a Comment